వివాహేతర సంబంధం: ప్రియుడి సాయంతో ఘాతుకం

Wife Killed Husband With The Help Of Extra Marital Sexual Partner In Mahabubabad - Sakshi

భర్తను హత్య చేయించిన భార్య

రోడ్డు ప్రమాదంగా నమ్మించేందుకు యత్నం

అరెస్టు చేసిన పోలీసులు

సాక్షి, మహబూబాబాద్‌: తన వివాహేతర సంబంధానికి అడ్డు వస్తున్నాడని భర్తను ప్రియుడు, ఆయన స్నేహితులతో కలిసి హత్య చేయించింది ఓ భార్య.. అయితే, ఈ ఘటనను రోడ్డు ప్రమాదంగా నమ్మించేందుకు ప్రయత్నించగా.. పోలీసులు శాస్త్రీయ పద్ధతిలో విచారించడంతో అసలు నిజం బయటపడింది. ఈ మేరకు భార్య, ఆమె ప్రియుడు, ఇందుకు సహకరించిన మరొకరిని అరెస్టు చేయడంతో పాటు, హత్యకు ఉపయోగించిన వస్తువులను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.  మహబూబాబాద్‌ టౌన్‌ పోలీస్‌ స్టేషన్‌ సమావేశ మందిరంలో మంగళవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఎస్పీ నంద్యాల కోటిరెడ్డి వివరాలు వెల్లడించారు.

మహబూబాబాద్‌ జిల్లా కేంద్రంలోని మంగళి కాలనీకి చెందిన ఇన్నారపు నవీన్‌ పెయింటర్‌గా పనిచేస్తుండగా ఆయన భార్య శాంతితో కలిసి జీవిస్తున్నాడు. అయితే, మరో పెయింటర్‌ అయిన దాసరి వెంకటేష్‌తో శాంతికి ఏర్పడిన పరిచయం వివాహేతర సంబంధంగా మారింది. ఈ విషయాన్ని గుర్తించిన నవీన్‌ తన భార్యను గట్టిగా హెచ్చరించాడు. ఈ విషయంలోనే రెండేళ్ల క్రితం దాసరి వెంకటేష్, పద్దం నవీన్‌ కలిసి ఇన్నారపు నవీన్‌ను ఊరి బయటకు తీసుకువెళ్లి దేహశుద్ది చేశారు. అనంతరం కూడా దాసరి వెంకటేష్, శాంతి మధ్య వివాహేతర సంబంధం కొనసాగుతుండగా ప్రతిసారి ఇన్నారపు నవీన్‌ తన భార్యను హెచ్చరిస్తున్నాడు. అయితే, తన భర్తను అడ్డు తొలగిస్తేనే మంచిదని శాంతి చెప్పడంతో వెంకటేష్‌ అంగీకరించాడు. ఇందులో భాగంగా గతనెల 21వ తేదీన శాంతి తన తల్లిగారిల్లయిన రేగడి తండాకు వెళ్లి రాత్రి 9 గంటలకు మటన్‌ తీసుకురావాలని తన భర్త నవీన్‌కు ఫోన్‌లో చెప్పింది. దీంతో ఆయన హోండా యాక్టివాపై రేగడి తండాకు బయలుదేరగా.. ఈ విషయాన్ని శాంతి తన ప్రియుడు వెంకటేష్‌తో పాటు ఆయన స్నేహితుడు పద్దం నవీన్‌కు చేరవేసింది. దీంతో మధ్యలో కాపుకాచిన వెంకటేష్‌ ఆయన స్నేహితుడు నవీన్‌ కలిసి ఇన్నారపు నవీన్‌ను ఆపి రోడ్డు పక్కకు లాక్కెళ్లి రాడ్‌తో తలపై కొట్టడమే కాకుండా మెడకు టవల్‌తో ఉరి బిగించి హత్య చేశారు. ఆ తర్వాత రోడ్డు పక్కన ఆయన మృతదేహాన్ని వేసి, దానిపై బండి పడవేసి రోడ్డు ప్రమాదంగా చిత్రీకరించే ప్రయత్నం చేశారు.

మద్యం గ్లాసులు.. సీసా మూతే ఆధారం
రోడ్డు ప్రమాదంలో ఇన్నారపు నవీన్‌ మృతి చెందినట్లు తెలియడంతో పోలీసులు చేరుకున్నారు. సంఘటన స్థలాన్ని పోలీసులు పరిశీలించగా అక్కడ మద్యం సేవించిన ప్లాస్టిక్‌ గ్లాసులు, మద్యం బాటిల్‌ మూత, ప్లాస్టిక్‌ వాటర్‌ బాటిల్, నేలపై ఉన్న రక్తపు మరకలు, చిల్లర డబ్బు కనిపించాయి. కేసు నమోదు చేసుకున్న మహబూబాబాద్‌ రూరల్‌ సీఐ జూపల్లి వెంకటరత్నం, కురవి ఎస్సై జె.శంకర్‌రావు నేర స్థలంలో లభించిన మద్యం బాటిల్‌పై ఉన్న బార్‌కోడ్‌ ఆధారంగా వైన్స్‌ను గుర్తించి వెళ్లి ఆరా తీశారు. మార్గమధ్యలో సీసీ కెమెరాల్లో కనిపించిన వ్యక్తులతో పాటు మృతుడి భార్య శాంతి కాల్‌డేటాను ఆరా తీయగా.. పలుమార్లు వెంకటేశ్‌తో మాట్లాడినట్లు తేలింది. దీంతో శాంతితో పాటు  దాసరి వెంకటేష్, పద్దం నవీన్‌ను మహబూబాబాద్‌ రూరల్‌ సీఐ వెంకటరత్నం అదుపులోకి విచారించగా తామే హత్య చేసినట్లు అంగీకరించారు. ఈ మేరకు కేసులో పకడ్బందీగా విచారించిన కురవి ఎస్సై జె.శంకర్‌రావు, వారి సిబ్బందిని ఎస్పీ నంద్యాల కోటిరెడ్డి అభినందించారు. ఈ సమావేశంలో డీఎస్పీ ఆంగోతు నరేష్‌కుమార్, మహబూబాబాబాద్‌ రూరల్‌ సీఐ జూపల్లి వెంకటరత్నం, కురవి ఎస్సై జె.శంకర్‌రావు పాల్గొన్నారు.

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top