ఫోర్జరీ కేసులో సోమిరెడ్డి ఏ1

Somi Reddy Chandra Mohan reddy A1 Accused In Forgery of Land Documents - Sakshi

భూవివాదంలో మాజీ మంత్రి

ఫోర్జరీ కేసు నమోదు

రోడ్డు వెంబడి స్థలం కోసం రికార్డుల తారుమారు

తెలుగుదేశం పార్టీలో ఆయనో కీలక నేత. పార్టీ అధిష్టానం అండదండలు పుష్కలంగా ఉన్నాయి. ఎన్నికల్లో ప్రజలు తిరస్కరించినా ఆయన మంత్రి అయిపోయారు. జిల్లా పార్టీలో విభేదాలు తలెత్తినప్పుడు ట్రబుల్‌ షూటర్‌గా పనిచేస్తున్నట్టు హడావుడి చేస్తారు. పార్టీ అధికారంలో ఉన్నప్పుడు రాష్ట్ర మంత్రిగా జిల్లాలో చక్రం తిప్పిన నేత. ప్రతిపక్ష పార్టీపై అడ్డగోలుగా విరుచుకుపడడం ఆయన నైజం. ఆ బడా నేత ఎవరో కాదు మాజీ మంత్రి, టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యుడు సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి. ఆయన ఇప్పుడు ఫోర్జరీ కేసులో ఏ–1గా మారారు. అధికారాన్ని అడ్డం పెట్టుకుని రోడ్డు వెంబడి స్థలం కోసం రికార్డులు తారుమారు చేసి ఇతరుల భూమిని తన భూమిగా చూపించే యత్నంలో కోర్టు ఆదేశాలతో వెంకటాచలం పోలీసులు కేసు నమోదు చేశారు. ప్రస్తుతం ఈ వ్యవహారం జిల్లాలో హాట్‌ టాపిక్‌గా మారింది.

సాక్షి, నెల్లూరు : సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి సర్వేపల్లి నియోజకవర్గం నుంచి వరుసగా నాలుగు పర్యాయాలు పోటీ చేసి ఓటమి పాలయ్యారు. 2014 ఎన్నికల్లో సర్వేపల్లి నియోజకవర్గం నుంచి టీడీపీ అభ్యర్థిగా బరిలో దిగిన సోమిరెడ్డి వైఎస్సార్‌సీపీ అభ్యర్థి కాకాణి గోవర్ధన్‌రెడ్డి చేతిలో ఓటమి పాలయ్యారు.  తర్వాత 2019లోనూ కాకాణి చేతిలో మరో సారి సోమిరెడ్డి ఓడారు.  గత ప్రభుత్వ హయాంలో ఎమ్మెల్సీగా, తర్వాత రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రిగా పనిచేశారు. వ్యవసాయ మంత్రిగా ఉన్న ఆ సమయంలో జిల్లాలో చక్రం తిప్పే ప్రయత్నం చేశారు. సర్వేపల్లిలోని వెంకటాచలం మండలంలోని ఇడిమేపల్లిలో ఉన్న భూమిపై సోమిరెడ్డి కన్నుపడింది. ఇక్కడి నుంచే చిక్కులు మొదలయ్యాయి. తనది కాని భూమిని తన భూమిగా రికార్డులు మార్పులు చేయించి చెన్నైకు చెందిన వారికి విక్రయించారు. దీంతో ఆ భూమి వారసులు తెరపైకి వచ్చి భూమి తమదని రికార్డులతో సహా గతేడాది నుంచి చూపుతున్నారు. ఎన్నికలకు ముందు వరకు తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉండడంతో మంత్రిగా అప్పట్లో సోమిరెడ్డి హవా కొనసాగింది. దీంతో బాధితులకు ఎలాంటి న్యాయం జరగలేదు. ఆ భూమికి సంబంధించిన వ్యక్తులు కోర్టులో ప్రైవేట్‌ కేసు దాఖలు చేయడంతో న్యాయస్థానం ఆదేశాలతో సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డిపై ఫోర్జరీ, చీటింగ్‌ కేసులు నమోదయ్యాయి. 

సోమిరెడ్డి భూ అక్రమాలు
వెంటాచలం మండలంలోని ఇడిమేపల్లి గ్రామంలో పామర్రు పిచ్చిరెడ్డికి సంబంధించి సర్వే నంబర్‌ 58లో 13.71 ఎకరాల భూమి ఉంది. ఆ భూమికి సంబంధించి పిచ్చిరెడ్డి వారసుల మధ్య ఎలాంటి పంపకాలు జరగలేదు. ఆ భూమిలో వాటర్‌ బోర్డు భూసేకరణ, రహదారి విస్తరణకు పోను ఇంకా 10.94 ఎకరాల భూమి పిచ్చిరెడ్డి వారసుల ఆధీనంలో ఉంది. ఈ క్రమంలో సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి ఆ భూమిపై దృష్టి సారించి భూమిలో కొంతభాగాన్ని తన వశం చేసుకోవడానికి పక్కాగా స్కెచ్‌ గీశారు. దీనికి అనుగుణంగా మీనమ్మ అనే మహిళ వద్ద 58/3 సబ్‌ డివిజన్‌లోని 2.36 ఎకరాల భూమిని ఆగమేఘాల మీద నేరుగా తన పేరుతో కొనుగోలు చేసినట్లు రిజిస్టర్‌ చేయించుకున్నారు. ఆ తర్వాత దానిని చెన్నై నగరానికి చెందిన వీఆర్‌ మేఘనాథన్, ఏఎం జయంతిలకు విక్రయించారు. భూమిని కొనుగోలు చేసిన క్రమంలో లేని రికార్డులను సృష్టించడం, సబ్‌ డివిజన్‌ కాని భూమిని సబ్‌డివిజన్‌ చేయడం, వారసుల అనుమతి లేకుండా కొనుగోలు చేయడంతోపాటు విభజన కాని భూమిలో కొంతభాగం రోడ్డు వెంబడి ఉండే భూమిని కొనుగోలు చేసి రూ.50 లక్షలకు విక్రయించారు.

అయితే అధీకృత సర్వేయర్‌ ద్వారా సర్వే చేయించి దానిలో వారసులకు వచ్చిన వాటాను యథాతథంగా కొనుగోలు చేయవచ్చు. కానీ ఇక్కడ సోమిరెడ్డి మాత్రం ఇవేమి పట్టించుకోకుండా మొత్తం భూమిలో తనకు కావాల్సిన, విక్రయానికి బాగా పనికి వచ్చే భూమిని మాత్రమే తీసుకున్నారు. విభజన కాని ఆస్తిలో ఒక భాగం కొనుగోలు చేయడం సాధ్యం కాదు. చట్టరీత్యా కూడా చెల్లుబాటు ఉండదు. అలాగే అంతటితో ఆగకుండా రెవెన్యూ రికార్డుల్లో కేవలం 2.36 ఎకరాల భూమి కోసం కాని సబ్‌ డివిజన్‌ను కూడా చేయడం గమనార్హం. వెంకటాచలం తహసీల్దార్‌ కార్యాలయ అధికారులు దీనికి పూర్తిగా సహకరించినట్లు తెలుస్తోంది. 

న్యాయ నిపుణులతో సోమిరెడ్డి మంతనాలు 
కోర్టు ఆదేశాలతో వెంకటాచలం పోలీసులు ఈ నెల 27న కేసు నమోదు చేశారు. కేసు నమోదు చేయాల్సిందిగా కోర్టు ఈ నెల 24వ తేదీన ఆదేశాలు ఇవ్వడంతో 212/2019 నంబర్‌తో 120బి, 471, 468, 447, 427, 379, 34ఐపీసీ, 156(3) సీఆర్‌పీసీ తదితర సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. దీంతో కేసులో బెయిల్‌ కోసం సోమిరెడ్డి న్యాయవాదులతో మంతనాలు మొదలుపెట్టారు.  

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top