'మాయా చెంబు' ముఠా ఆటకట్టు

Rice Pulling Gang Arrest in Anantapur - Sakshi

ధర్మవరం అర్బన్‌: మాయా చెంబు పేరుతో అమాయక ప్రజలను మోసం చేస్తున్న ముఠా ఆటకట్టించారు పోలీసులు. 18 మంది సభ్యుల ముఠాను అరెస్టు చేసినట్లు ధర్మవరం డీఎస్పీ రమాకాంత్, సీసీఎస్‌ డీఎస్పీ శ్రీనివాసులు తెలిపారు. పట్టణంలోని డీఎస్పీ కార్యాలయంలో గురువారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో డీఎస్పీలు వివరాలు వెల్లడించారు. నిందితులు తమ వద్ద ఉన్న రాగి చెంబుకు రసాయనాలు పూసి ఆ చెంబు వద్ద టార్చ్‌లైట్‌ వేస్తే లైట్‌ ఆఫ్‌ అవుతుంది. దీంతో ఈ చెంబుకు అద్వితీయ శక్తులు ఉన్నాయని ఇది ఎవరి ఇంట్లో ఉంటే వారికి అదృష్టం కలిసి వస్తుందని వారు అనుకొన్న కార్యాలు నెరవేరుతాయని అమాయక ప్రజలను నమ్మించి వారికి రాగి చెంబును అమ్మి అధిక మొత్తంలో డబ్బులు తీసుకోవాలన్న పథకంతో గత మూడురోజులుగా గోరంట్ల పరిసర ప్రాంతాల్లో 18 మంది సభ్యుల ముఠా తిరుగుతోంది. విషయం తెలుసుకున్న డీఎస్పీ రమాకాంత్, సీసీఎస్‌ డీఎస్పీ శ్రీనివాసులు ఆదేశాల మేరకు గోరంట్ల సీఐ జయనాయక్, సీసీఎస్‌ సిబ్బంది గోరంట్ల సమీపంలోని యర్రబల్లి రోడ్డు బూదిలి క్రాస్‌ వద్ద గురువారం ఉదయం 9.30 గంటలకు 18 మంది ముఠాను అరెస్టు చేశారు. వారి వద్ద నుంచి మూడుకార్లు, ఒక స్కార్పియో, రెండు రాగి చెంబులు, ఒక టార్చిలైట్, రూ.30వేలు నగదు స్వాధీనం చేసుకున్నారు. 18 మందిపైనా కేసులు నమోదు చేశారు. ముఠాను చాకచక్యంగా అరెస్టు చేసిన గోరంట్ల సీఐ, సీసీఎస్‌ సిబ్బందిని డీఎస్పీలు అభినందించారు.

అరెస్టైన వారు వీరే...
అనంతపురానికి చెందిన శ్యామలబోయన శ్రీనివాసులు, బెళుగుప్ప మండలం తగ్గుపర్తి గ్రామానికి చెందిన నారా సుదర్శన్, కదిరి టౌన్‌ మౌనిక టాకీస్‌ వద్దనున్న పాలగిరి ముఖద్దర్‌ బాషా, పామిడి మండలం సరస్వతి విద్యామందిరం దగ్గరున్న షేక్‌ షాషావలి, గాండ్లపెంట మండలం కటకంవారిపల్లికి చెందిన ఆలుకుంట్ల శ్రీనివాసులు, కర్ణాటక రాష్ట్రం కోలారు జిల్లా గల్‌పేటకు చెందిన కె.పి.గోపినాథ్, బెంగళూరులోని రాజీవ్‌గాంధీ రోడ్డుకు చెందిన వై.శ్రీనాథ్, స్కార్పియో డ్రైవర్, మంగళూరుకు చెందిన ప్రవీణ్‌రాజ్, యలహంకకు చెందిన ఎం.రోహిత్, ఎ.రవికుమార్, బెంగళూరులోని శ్రీకంఠేశ్వరనగర్‌కు చెందిన ఆర్‌.రాము, వశికేరహళ్లికి చెందిన ఎం.శ్రీనాథ్, శివమొగ్గ జిల్లా వినోబానగర్‌కు చెందిన ఎస్‌.అశోక్, బెంగళూరు రూరల్‌ పరిధిలోని చిన్న మంగళకు చెందిన చంద్రప్ప నాగరాజు, తుమకూరు జిల్లా హెగ్గెరెహళ్లికి చెందిన జగన్నాథ్‌ మంజునాథ్, హిందూపురం మండలం సంతేబిదనూరుకు చెందిన హెచ్‌.సంజీవప్ప, నల్లమాడ మండలానికి చెందిన జె నాగరాజు, అమడగూరు మండలం వడ్డిపల్లి గ్రామానికి చెందిన పి.మురళి.

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top