బాధలు భరించలేకే..

Mystery Revealed in Jawahar Nagar Murder Case - Sakshi

జవహర్‌ నగర్‌ హత్య కేసులో వీడిన మిస్టరీ...

తల్లిదండ్రులు కోరడంతో అన్నను చంపిన తమ్ముడు   

ఐదుగురు నిందితుల రిమాండ్‌

జవహర్‌నగర్‌: వంపుగూడలోని బ్యాంక్‌ కాలనీలో జరిగిన హత్య కేసులో మిస్టరీ వీడింది. వ్యసనాలకు బానిసైన పెద్ద కుమారుడిని చంపాలని తల్లిదండ్రులు కోరినందునే స్వయాన అతని సోదరుడే స్నేహితులతో కలిసి అన్నను దారుణంగా హత్య చేసినట్లు వెలుగులోకి వచ్చింది.   బుధవారం జవహర్‌నగర్‌ సీఐ సైదులు వివరాలు వెల్లడించారు.  వంపుగూడలో ఉంటునన్న శ్రీనివాస్, మణెమ్మ దంపతులకు ఇద్దరు కుమారులు, ఒక కుమార్తె. శ్రీనివాస్‌ దంపతులు  మున్సిపాలిటీలో దినసరి కూలీలుగా పనిచేసేవారు. వీరి పెద్ద కుమారుడు సాయికుమార్‌ (25) పెయింటింగ్‌ పని చేసేవాడు. మద్యానికి బానిసైన సాయికుమార్‌  తల్లిదండ్రులు, తమ్ముడిని తరచూ వేధించేవాడు.

అతడి వేధింపులు తాళలేక కుటుంబసభ్యులు అతడి అడ్డు తొలగించుకోవాలని నిర్ణయించుకున్నారు. ఆ పనిని చిన్న కుమారుడు సందీప్‌తో చెప్పారు. ఏప్రిల్‌ 26న రాత్రి మద్యం మత్తులో ఇంటికి వచ్చిన సాయికుమార్‌  తల్లి మణెమ్మను తీవ్రంగా కొట్టాడు. దీనిని గుర్తించిన సందీప్‌ ఆగ్రహానికి లోనయ్యాడు. అనవతరం తన స్నేహితులైన ఫయాజ్, ఇబ్రహీం, గిద్యాల సందీప్‌లను కలిసి సాయికుమార్‌ వేధింపులు తాళలేక పోతున్నామని అతడిని అడ్డు తొలగించాలని కోరడంతో వారు అందుకు అంగీకరించారు. అనంతరం వంపుగూడలోని బ్యాంక్‌కాలనీలో పథకం ప్రకారం సాయికుమార్‌ను మద్యం తాగించి మత్తులో ఉన్న అతడి తలపై బండరాయితో మోది బీరుసీసాలతో  గొంతును కోసి హత్య చేశారు. అనంతరం మే 3న శ్రీనివాస్, మణెమ్మ పోలీసులను కలిసి తమ కుమారుడు సాయికుమార్‌ కనిపించడం లేదని ఫిర్యాదు చేశారు. అయితే నిందితుల్లో ఒకరు ఈ విషయాన్ని స్ధానిక నాయకుడు పత్తి కుమార్‌కు చెప్పడంతో అతను పోలీసులకు సమాచారం అందించాడు. దీనిపై దర్యాప్తు చేపట్టిన పోలీసులు మే 10న వంపుగూడ  ప్రాంతంలో పుర్రె, ఎముకలను స్వాధీనం చేసుకుని పరిశోధన నిమిత్తం ఎఫ్‌ఎస్‌ఎల్‌కు పంపించారు. నివేదిక ఆధారంగా  మృతుడు సాయికుమార్‌కు గుర్తించారు. నిందితులు  సందీప్, శ్రీనివాస్, మణెమ్మ, షేక్‌ ఫయాజ్, గిద్యాల సందీప్‌లను బుధవారం అరెస్ట్‌ చేఇ రిమాండ్‌కు తరలించారు. పరారీలో ఉన్న ఇబ్రహీం కోసం  గాలిస్తున్నారు.

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top