తల్లీకూతుళ్ల ఆత్మహత్య

Mother And Daughter End Life Due To Financial Problems - Sakshi

ఆర్థిక ఇబ్బందులు రెండు నిండు ప్రాణాలను బలిగొన్నాయి. ఇంటి నిర్మాణం కోసం చేసిన అప్పులు ఎలా తీర్చాలోనని మనోవేదనకు గురైన ఆ ఇల్లాలు.. పెళ్లీడుకొచ్చిన తన కూతురుతో సహా బావిలో దూకి ఆత్మహత్య చేసకుంది. ఈ ఘటన ఎర్రాపహాడ్‌ గ్రామంలో విషాదాన్ని నింపింది.

సాక్షి, తాడ్వాయి: ఎర్రాపహాడ్‌ గ్రామానికి చెందిన బద్దం లక్ష్మారెడ్డి, బద్దం లింగమణి(42) దంపతులకు కుమారుడు రణదీప్‌రెడ్డి,కూతురు శిరీష(18) ఉన్నారు. వీరికి రెండున్నర ఎకరాల భూమి ఉంది. ఆ భూమిలో వ్యవసా యం చేసుకుంటూ జీవిస్తున్నారు. రణదీప్‌రెడ్డి హైదరాబాద్‌లో హోటల్‌ మేనేజ్‌మెంట్‌ కోర్సు చేస్తుండగా కూతురు కామారెడ్డిలో డిగ్రీ మొదటి సంవత్సరం చదువుతోంది. వీరు ఏడాది క్రితం ఇంటిని నిర్మించుకున్నారు. ఇందుకోసం రూ. 2 లక్షలకుపైగా అప్పులు చేశారు. చేసిన అప్పులు పెరిగిపోతుండడం, కూతురు పెళ్లీడుకు రావడం, కుమారుడి చదువుకు డబ్బులు అవసరం కావడంతో లింగమణి మానసికంగా నలిగిపోయింది. అప్పుల విషయమై ఆదివారం రాత్రి భర్తతో గొడవ జరిగింది. రాత్రి ఇద్దరూ భోజనం చేయలేదు. (కోవిడ్-19 : పరిశీలనలో అతి చవకైన మందు  )

సోమవారం ఉదయమే లక్ష్మారెడ్డి పొలానికి వెళ్లిపోయాడు. ఆర్థిక పరిస్థితుల నేపథ్యంలో మనస్తాపానికి గురైన లింగమణి, శిరీష ఆత్మహత్య చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. ఇద్దరూ కలిసి వ్యవసాయ బావి వద్దకు వెళ్లారు. లక్ష్మారెడ్డి తాగునీటికోసం సమీపంలోని మరో బావి వద్దకు వెళ్లగానే తల్లి తన చీర కొంగును కూతురు నడుముకు కట్టింది. ఇద్దరూ ఒకేసారి బావిలో దూకి ఆత్మహత్య చేసుకున్నారు. నీళ్లు తాగి తిరిగి వచ్చిన లక్ష్మారెడ్డికి భార్యాకూతుళ్లు కనిపించకపోవడంతో చుట్టూ చూశాడు. బావిలోకి తొంగిచూడగా ఇద్దరి మృతదేహాలు కనిపించాయి. గ్రామస్తులు ఇచ్చిన సమాచారం మేరకు సీఐ వెంకట్, ఎస్‌ఐ కృష్ణమూర్తి సంఘటన స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. మృతదేహాలను వెలికితీసి, పోస్టుమార్టం నిమిత్తం కామారెడ్డి ఏరియా ఆస్పత్రికి తరలించారు. మాజీ ఎమ్మెల్యే ఏనుగు రవీందర్‌రెడ్డి గ్రామానికి వచ్చి బాధిత కుటుంబాన్ని పరామర్శించారు. (కరోనా.. 24 గంటల్లో 146 మంది మృతి)

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top