
కిశోర్ మృతదేహం
కాళేశ్వరం : ప్రేమ పెళ్లి చేసుకున్న సోదరితో రాఖీ కట్టించుకోలేకపోయానని ఓ వ్యక్తి తీవ్ర ఆవేశానికి లోనయ్యాడు. ఆ పెళ్లికి మధ్యవర్తిగా వ్యవహరించిన యువకుడిని గొడ్డలితో నరికి హత్య చేశాడు. ఈ సంఘటన జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహదేవపూర్ మండలం ఎడపల్లి గ్రామ శివారు బ్రాహ్మణపల్లి-2 క్వారీ సమీపంలో ఆదివారం అర్థరాత్రి జరిగింది. సీఐ రంజీత్‌కుమార్ కథనం ప్రకారం... ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని తూర్పుగోదావరి జిల్లా సీతనగరానికి చెందిన సంగిశెట్టి కిషోర్(25), ఆయనకు వరుసకు సోదరుడైన నరసింహామూర్తి కలిసి ఎడపల్లిలోని ఓ క్వారీలో సూపర్‌వైజర్లుగా గత కొన్నిరో జులుగా విధులు నిర్వర్తిస్తున్నారు.
ఈ క్రమంలో ఎడపల్లికి చెందిన గోగుల లలితతో నరసింహామూర్తికి ఏర్పడిన పరిచయం ప్రేమగా మారింది. కాగా ఈ నెల 23న వారిద్దరు వివాహం చేసుకుని విజయనగరం వెళ్లిపోయారు. ఈ పెళ్లి లలిత వాళ్లింట్లో ఎవరికీ ఇష్టం లేకపోవడంతో మహదేపూర్ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. కాగా అదే మసస్తాపంతో లలిత సోదరుడు విజయ్ రగిలిపోతున్నాడు. ఆదివారం రాఖీ పౌర్ణమి సందర్భంగా సోదరి ఇంట్లో లేకపోవడంతో విజయ్ కోపం మరింత పెరిగింది. ఆమె ఉంటే ఉంటే రాఖీ కట్టించుకునేవాడినని మదన పడ్డాడు.
వారి పెళ్లి జరగడానికి సహకరించాడనే ఉద్దేశంతో విజయ్ ఆవేశానికిలోనై కిషోర్‌ను మండలంలోని బ్రాహ్మణపల్లి- 2 క్వారీ సమీపంలో గొడ్డలితో అతిదారుణంగా నరికి చంపాడు. స్థానికుల సమాచారంతో పోలీసులు ఆ మృతదేహాన్ని రాత్రి మహదేవపూర్ ఆస్పత్రికి తరలించారు. నిందితుడు విజయ్‌ని వారు అదుపులోకి తీసుకున్నట్లు సమచారం. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ తెలిపారు.