చిట్టిబుర్రలకు సైబర్‌ గాలం

Cyber Criminals Send Unknown Links to Students in Karnataka - Sakshi

మైనర్‌ విద్యార్థుల స్మార్ట్‌ఫోన్లకు అశ్లీల సందేశాలు 

గ్రూప్‌ ఏర్పాటు చేసి దుష్ప్రచారం  

ఐటీ నగరంలో నయా దందా  

పోలీసుల దర్యాప్తు  

కర్ణాటక, బనశంకరి: మొబైల్‌ ఫోన్‌ వినియోగించే మైనర్‌ బాలురకు అశ్లీల ఫోటోలు, వీడియోల లింక్‌ పంపించి వ్యసనపరులుగా చేయడం, బ్లాక్‌మెయిల్‌ చేసి డబ్బు దండుకునే ముఠా సిలికాన్‌ సిటీ ఉన్నట్లు అనుమానం వ్యక్తమౌతోంది. గుర్తుతెలియని వ్యక్తి ఒకరు వాట్సాప్‌ గ్రూప్‌ క్రియేట్‌ చేసి అందులో బెంగళూరు పేరుపొందిన 70 కుపైగా పాఠశాలలకు చెందిన విద్యార్థుల నెంబర్లను గ్రూప్‌లో చేర్చడం అనేక అనుమానాలకు తావిస్తోంది. ఈ గ్రూప్‌లో అశ్లీల సంభాషణలు, అశ్లీల వీడియోలు , పోటోలు కలిగిన ఆన్‌లైన్‌ లింక్‌ అప్‌లోడ్‌ చేయడాన్ని తీవ్రంగా పరిగణించిన బెంగళూరు పశ్చిమ విభాగ  సైబర్‌క్రైం పోలీసులు  కేసు నమోదు చేసుకుని విచారణ చేపడుతున్నారు. ఫ్రెండ్‌ యువర్‌ లవ్‌ 2083  పేరుతో గల వాట్సాప్‌ గ్రూప్‌లో పాఠశాల విద్యార్థుల ఆన్‌లైన్‌ బోధనకు వినియోగించే ఫోన్‌ నంబర్లు యాడ్‌ చేసి ఉన్నాయి. 

మహిళ ఫిర్యాదుతో కదలిక  
లాక్‌డౌన్‌ అనంతరం పాఠశాలలకు దూరంగా ఉంటున్న విద్యార్థులకు ప్రైవేటు విద్యాసంస్థలు ఆన్‌లైన్‌లో బోధనను ప్రారంభించాయి. ఇది గమనించిన సైబర్‌ నేరగాళ్లు విద్యార్థుల నంబర్లను సంపాదించి గాలం వేస్తున్నారు. ఈ నెల 10వ తేదీన మైనర్‌ పిల్లల వాట్సాప్‌ గ్రూప్‌లో అశ్లీల దశ్యాలు కలిగిన లింక్‌ ఉన్నట్లు చంద్రాలేఔట్‌కు చెందిన మహిళకు తెలిసింది. ఆమె గ్రూప్‌లోని బాలల తల్లిదండ్రుల దృష్టికి తీసుకువచ్చింది. కానీ వీరందరూ పోలీసులకు పిర్యాదు చేయడానికి వెనుకంజ వేస్తున్నారు.  దీంతో సదరు మహిళే పశ్చిమ విభాగ సైబర్‌ క్రైం పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. కాగా 2018లో రాష్ట్రంలో 113 మంది బైనర్‌ విద్యార్థులు అశ్లీల చిత్రాల వీడియోలు వీక్షించినట్లు రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్ర మహిళా మక్కళ సంక్షేమశాఖ నివేదిక అందించింది. హైకోర్టు సూచన మేరకు 7 ఎఫ్‌ఐఆర్‌లను నమోదు చేసి విచారణ చేపట్టింది.

దుండగుల కుట్ర ఇదేనా
విద్యార్థులను అశ్లీల ఫోటోలను వీక్షించే అలవాటుకు బానిసలు చేయడం అనంతరం దశలవారీగా మానసికంగా తమ ఆధీనంలోకి తీసుకోవడం ఈ దుష్టుల కుట్రగా తెలుస్తోంది.  ఆ తరువాత విద్యార్థులకు ప్రైవేటు ఫోటోలు, వీడియోలు తీసుకుని వాటిని వారి తల్లిదండ్రులకు పంపించి బ్యాంక్‌ వివరాలు, డెబిట్, క్రెడిట్‌ కార్డు సమాచారం తెలుసుకుని నగదు దోచేయడం, ఇతరత్రా బ్లాక్‌ మెయిలింగ్‌లకు పాల్పడడం ఈ ముఠాల పన్నాగమని పోలీసులు తెలిపారు.

విచారణ చేపట్టాం 
విద్యార్థుల చేతికి మొబైల్‌ ఇచ్చే ముందు అప్రమత్తంగా ఉండాలి. గుర్తుతెలియని వ్యక్తులు పంపించే ఆన్‌లైన్‌ లింక్‌  తెరవరాదని చెప్పాలి. విద్యార్థులకు ఆశ్లీల చిత్రాలు, వీడియోలు  పంపించిన కేసును తీవ్రంగా పరిగణించి విచారణ చేపడుతున్నాం. ఇలాంటి కేసులు మీ దృష్టికి వస్తే స్థానిక సైబర్‌ క్రైం పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేయాలి.–  సీసీబీ జాయింట్‌పోలీస్‌ కమిషనర్‌ సందీప్‌పాటిల్‌   

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top