తుపాకీతో కాల్చుకున్న కానిస్టేబుల్‌

Constable Commits Suicide Attempt in Tamil Nadu - Sakshi

విషమంగా శరవణన్‌ పరిస్థితి

మరణిస్తే యూనిఫాంతోనే అంత్యక్రియలకు విజ్ఞప్తి

సాక్షి, చెన్నై: న్యాయమూర్తి ఇంటి వద్ద భద్రతా విధుల్లో ఉన్న తమిళనాడు సిరప్పు కావల్‌ పడై ( ప్రత్యేక పోలీసు విభాగం) కానిస్టేబుల్‌ బుధవారం తుపాకీతో కాల్చుకుని ఆత్మహత్యాయత్నం చేశాడు. అతడి పరిస్థితి ఆందోళనకరంగా ఉంది. తాను మరణిస్తే, యూనిఫాం సహా అంత్యక్రియలు నిర్వహించాలని ఓ లేఖను రాసి పెట్టి మరీ ఆ కానిస్టేబుల్‌ కాల్చుకున్నాడు.
గత ఏడాది సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్‌ నెలల్లో పోలీసుల బలవన్మరణాలు కలకలం రేపిన విషయం తెలిసిందే. సెలవుల కరువు, పని భారం, మానసిక ఒత్తిడి, ఉన్నతాధికారుల వేధింపులు అంటూ ఆత్మహత్యలకు పాల్పడే వారు కొందరు అయితే, రాజీనామాలు సమర్పించి గుడ్‌ బై చెప్పిన వాళ్లు మరెందరో. తమపై విమర్శలు పెరగడంతో చివరకు పోలీసుల్లో నెలకొన్న మానసిక ఒత్తిడి తగ్గించేందుకు తగ్గట్టుగా ప్రత్యేక కార్యాచరణకు అధికార వర్గాలు శ్రీకారం చుట్టాయి.

దీంతో బలవన్మరణాలు కాస్త తగ్గాయి. అయితే, గత నెల సాయుధ బలగాల విభాగం ఐజీ కార్యాలయం క్వార్టర్స్‌లో పేలిన తుపాకీ మళ్లీ పోలీసుల్లో కలవరాన్ని రేపింది. తిరుత్తణి సమీపంలోని పళ్లిపట్టు వేటకారన్‌ గ్రామం అమ్మన్‌ కోవిల్‌ వీధికి చెందిన కన్నన్, రాధా దంపతుల కుమారుడు మణికంఠన్‌(26) తుపాకీతో కాల్చుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. బర్త్‌డేను డెత్‌గా అతడు మార్చుకున్నారు. ఈ ఘటన తదుపరి మరో ముగ్గురు నలుగురు పోలీసులు ఆత్మహత్యలు చేసుకున్న సంఘటనలు వెలుగులోకి వచ్చాయి. ఈ నేపథ్యంలో బుధవారం తమిళనాడు సిరప్పు కావల్‌ పడై విభాగంలో కానిస్టేబుల్‌గా ఉన్న శరవణన్‌(29) తుపాకీతో కాల్చుని ప్రాణాలతో ఆసుపత్రిలో కొట్టమిట్టాడుతుండడం పోలీసుల్లో ఆందోళన రేపింది.

లేఖ రాసి పెట్టి మరీ : అడయార్‌లోని ఓ న్యాయమూర్తి  క్వార్టర్స్‌లో కానిస్టేబుల్‌ శరవణన్‌ విధులు నిర్వర్తిస్తున్నాడు. ఈ నేపథ్యంలో హఠాత్తుగా తన వద్ద ఉన్న తుపాకీ తీసుకుని కాల్చుకున్నట్టు సమాచారం. ఈ హఠాత్పరిణామం నుంచి తేరుకున్న అక్కడున్న సహచరులు హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు. ఆసుపత్రిలో శరవణన్‌కు చికిత్స అందిస్తున్నారు. ప్రాణాలతో కొట్టుమిట్టాడుతున్న శరవణన్‌ తుపాకీతో కాల్చుకోవాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చిందోనని అభిరామపురం పోలీసులు దర్యాప్తును వేగవంతం చేశారు. ఇందులో భాగంగా  శరవణన్‌ రాసి పెట్టిన లేఖ ఒకటి బయటపడింది. అందులో తన మరణానికి కారకులు ఎవరూ లేరని, తన తల్లిదండ్రులు చాలా మంచి వాళ్లు అని, వారిని చాలా బాగా చూసుకోవాలని, తాను మరణిస్తే వచ్చే మొత్తాన్ని వారికే అప్పగించాలని విజ్ఞప్తి చేశాడు. అలాగే, తాను మరణిస్తే తన శరీరం మీదున్న యూనిఫాంను మాత్రం దయచేసి తొలగించ వద్దు అని, తనకు యూనిఫాం అంటే చాలా ఇష్టం అని, అలాగే తనకు అంత్యక్రియలు జరిపించాలని, ఇదే తన చివరి కోరిక అని రాసి పెట్టి మరీ కాల్చుకుని ఉండడం సహచరుల్ని తీవ్ర వేదనలో పడేసింది. 

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top