
మహిళ మెడలో గొలుసు లాగుతున్న దొంగ
యశవంతపుర : బెంగళూరు నగరంలో పండుగ రోజు చైన్‌స్నాచింగ్‌లకు అడ్డు అదుపులేకుండా పోయింది. సోమవారం సంక్రాంతి రోజున ఇంటి ముందు ముగ్గులు వేస్తున్న మహిళలే టార్గెట్‌గా స్నాచర్లు రెచ్చిపోయారు. వివరాలు... పీణ్య పోలీస్ స్టేషన్ పరిధిలో నివాసం ఉంటున్న సీఐ కెంచెగౌడ పోలీస్ డైరెక్టర్ జనరల్ కార్యాలయంలో విధులు నిర్వహిస్తున్నాడు. కెంచేగౌడ భార్య గంగమ్మ ఉదయం 7 గంటల సమయంలో ఇంటి ముందు ముగ్గు వేస్తుండగా వెనుక వైపు నుంచి వచ్చిన దుండగులు ఆమె మెడలో ఉన్న 70 గ్రాముల బంగారు చైన్ లాక్కొని పారిపోయారు. ఆమె గట్టిగా కేకలు వేయడంతో కెంచేగౌడ దొంగలను పట్టుకోవడానికి యత్నించినా ఫలితం లేకపోయింది. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. అదే విధంగా కామత్ లేఔట్‌లో నివాసం ఉంటున్న శారదమ్మ ఇంటి ముందు నిలబడి ఉండగా దుండగలు ఒక్కసారిగా వాహనంలో వచ్చి ఆమె మెడలో ఉన్న బంగారు గొలుసు లాక్కొని ఉడాయించారు. బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేశారు.
బాగలకుంటలో...
మల్లసంద్ర, బృందావన లేఔట్ పైపులైన్ రోడ్డులో నివాసం ఉంటున్న సౌధమణి పండగ రోజు ఉదయం 7 గంటల సమయంలో ఇంటి ముందు ముగ్గు వేస్తుండగా బైక్‌పై వచ్చిన ఇద్దరు దొంగలు ఆమె మెడలో ఉన్న 55 గ్రాముల బంగారు గొలుసు లాక్కొని ఉడాయించారు. బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేశారు.
ఆరు కేసులు నమోదు...ఇరానీ గ్యాంగ్‌పై అనుమానం
ఆదివారం సాయంత్రం నుంచి ఆరు చైన్‌స్నాచింగ్ కేసులు నమోదయ్యాయి. పీణ్యాలో 2, బాగలకుంటలో 2, కామాక్షిపాళ్య, బ్యాడరహళ్లిల్లో ఒక్కక్క కేసు నమోదయ్యాయి. సంక్రాంతి రోజే జరగడంతో చైన్‌స్నాచింగ్‌లు ఇరానీ గ్యాంగ్‌ల పనేనని పోలీసులు అనుమానిస్తున్నారు. ప్రత్యేక బృందాలుగా ఏర్పడి ఆలయాలకు వెళ్లే మహిళలే టార్గెట్‌గా జరుగుతున్నాయి.