వర్డెంట్‌ ఫార్మా నుంచి దారిమళ్లిన బల్క్‌ డ్రగ్స్‌ | Bulk Drugs Smuggling From Vardent Pharma Visakhapatnam | Sakshi
Sakshi News home page

వర్డెంట్‌ ఫార్మా నుంచి దారిమళ్లిన బల్క్‌ డ్రగ్స్‌

Jan 11 2019 8:23 AM | Updated on Mar 9 2019 11:21 AM

Bulk Drugs Smuggling From Vardent Pharma Visakhapatnam - Sakshi

స్వాధీనం చేసుకున్న డ్రగ్స్‌ మెటీరియల్‌తో డీసీపీలు నయీం హష్మీ, సురేష్‌బాబు తదితరులు

విశాఖపట్నం, గాజువాక : పరవాడ జవహర్‌లాల్‌ నెహ్రూ ఫార్మాసిటీలోని వర్డెంట్‌ ఫార్మా కంపెనీ నుంచి బల్క్‌ డ్రగ్స్, ఫ్రెష్‌ సాల్వెంట్స్‌ను అపహరించిన కేసులో ఐదుగురు నిందితులను పోలీసులు అరెస్టు చేశారు. వారి నుంచి రూ.22 లక్షల విలువైన అపహరణ సొత్తును స్వాధీనం చేసుకున్నారు. ఈ మేరకు గాజువాక పోలీస్‌ స్టేషన్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో దీనికి సంబంధించిన వివరాలను జోన్‌–2 డీసీపీ నయీమ్‌ అస్మీ వెల్లడించారు. ఆయన కథనం ప్రకారం వివరాలిలా ఉన్నాయి. ఫార్మాసిటీలోని వర్డెంట్‌ లైఫ్‌ సైన్సెస్‌లో 6.25 టన్నుల బల్క్‌ డ్రగ్స్, ఫ్రెష్‌ సాల్వెంట్స్‌ చోరీ జరిగినట్టు కంపెనీ డైరెక్టర్‌ శివరామ్‌ ప్రసాద్‌ పరవాడ పోలీసులకు ఇటీవల ఫిర్యాదు చేశారు. పది కేజీల ఒల్మీ సర్టన్‌ మెడాక్సిమిల్‌ పౌడర్, 50 కేజీల లావా సిట్రజిన్‌ పౌడర్, 100 కేజీల సెర్ర్‌టాలైన్‌ హెచ్‌సీఎల్‌ పౌడర్, 100 కేజీల టెల్మీసట్రన్‌ పౌడర్, మూడు టన్నుల ఎండీసీ సాల్వెంట్, మూడు టన్నుల ఐపీఏ సాల్వెంట్‌ అపహరణకు గురైనట్టు తన ఫిర్యాదులో పేర్కొన్నారు.

దీనిపై దర్యాప్తు ప్రారంభించిన పోలీసులు కంపెనీ ఉద్యోగులే ఈ దొంగతనానికి పాల్పడినట్టు నిర్ధారణకు వచ్చారు. వర్డెంట్‌ ఫార్మాలో ఎనిమిది నెలల క్రితం సీనియర్‌ జనరల్‌ మేనేజర్‌గా విధుల్లో చేరిన పశ్చిమ గోదావరి జిల్లా ఆచంట గ్రామ నివాసి కమ్మ పరశురామ్, ఆరు నెలల నుంచి అసిస్టెంట్‌ జనరల్‌ మేనేజర్‌గా పని చేస్తున్న గుంటూరు జిల్లా సత్తెనపల్లి గ్రామ నివాసి రాయుడు శ్రీనివాసరావు, సూపర్‌వైజర్‌గా పని చేస్తున్న విశాఖ జిల్లా కె.కోటపాడు గ్రామ నివాసి కింతాడ దేముడుబాబు ఈ చోరీకి పాల్పడినట్టు నిర్ధారించారు. హైదరాబాద్‌కు చెందిన ఫార్మా వ్యాపారులు సంగు వెంకటేశ్వరరెడ్డి, శ్రీనివాస్‌ చౌదరికి 100 కేజీల టెల్మీసట్రన్, 25 కేజీల లావా సిట్రజిన్‌ పౌడర్‌ను అమ్మినట్టు గుర్తించి సంబంధిత మెటీరియల్‌ను స్వాధీనం చేసుకున్నారు. ఈ దుశ్చర్యకు పాల్పడిన కంపెనీ ఉద్యోగులను, మెటీరియల్‌ కొనుగోలు చేసిన వ్యాపారులను అరెస్టు చేసినట్టు డీసీపీ తెలిపారు. సూపర్‌వైజర్‌ దేముడుబాబు ద్వారా మిగిలిన నిందితులు ఈ మెటీరియల్‌ను అపహరించారన్నారు. ఈ కేసులో మొత్తం 6,250 బల్క్‌ డ్రగ్స్‌ను స్వాధీనం చేసుకున్నట్టు తెలిపారు. వీటి మొత్తం విలువ రూ.22 లక్షలు ఉంటుందని పేర్కొన్నారు. కంపెనీ డైరెక్టర్‌ నుంచి ఫిర్యాదు స్వీకరించిన వెంటనే గాజువాక క్రైమ్‌ సీఐ కె.పైడపునాయుడు, పరవాడ ఎస్‌ఐ సంతోష్‌ నేతృత్వంలో ఏడుగురు సభ్యులతో గల దర్యాప్తు బృందాన్ని నియమించి ప్రగతి సాధించినట్టు పేర్కొన్నారు. ఈ సందర్భంగా వారికి నగదు ప్రోత్సాహకాలను అందించారు. విలేకరుల సమావేశంలో క్రైం ఏడీసీపీ వి.సురేష్‌బాబు, సౌత్‌ ఏసీపీ ప్రేమ కాజల్, సీఐలు స్వామినాయుడు, పైడపు నాయుడు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement