దారితప్పి..దొంగలయ్యారు

Brother And Mother Arrested in Chain Snatching Case Visakhapatnam - Sakshi

పోలీసులకు చిక్కిన చైన్‌స్నాచింగ్‌ అన్నదమ్ములు

నిందితులపై పలు పీఎస్‌లలో 51 కేసులు

1382.90 గ్రాముల బంగారం అపహరణ  

అందులో 1142.50 గ్రాముల బంగారం రికవరీ

కొడుకులకు సలహాలిస్తూ ప్రోత్సహించిన తల్లీ అరెస్ట్‌

వివరాలు వెల్లడించిన సీపీ మహేష్‌చంద్ర లడ్డా

సాక్షి, విశాఖపట్నం: ఉన్నత చదువులు చదివే క్రమంలో వ్యసనాలకు బానిసలయ్యారు. జల్సాల కోసం సులువుగా డబ్బు సంపాదించేందుకు చైన్‌స్నాచింగ్‌ల బాట పట్టారు. ఈ క్రమంలో కన్నతల్లే సలహాలు ఇస్తూ... చోరీ సొత్తును భద్రపరుస్తుండడంతో మరింతగా చెలరేగిపోయారు. ఎట్టకేలకు పోలీసులకు చిక్కి ముగ్గురూ జైలు పాలయ్యారు. ఇందుకు సంబంధించిన వివరాలను నగర పోలీస్‌ కమిషనర్‌ మహేష్‌చంద్ర లడ్డా బుధవారం వెల్ల డించారు. స్టీల్‌ప్లాంట్‌లో పనిచేస్తున్న ఉద్యోగి ఎంపాడ వెంకటరమణ కుమారులు ఎంపాడ చంద్రశేఖర్‌రెడ్డి బీటెక్, ఎంపాడ గోపీనాథ్‌ రెడ్డి డిప్లమో చదువుకున్నారు. డ్రగ్స్‌ తీసుకుంటూ వ్యసనాలకు బానిసలైన వీరు జల్సాల కోసం డబ్బు సంపాదించేందుకు దొంగతనాల బాటపట్టారు.

ఒంటరిగా వెళ్తున్న మహిళలను టార్గెట్‌ చేసుకొని 2016 నుంచి ఇప్పటి వరకు 51 చైన్‌స్నాచింగ్‌లకు పాల్పడ్డారు. చంద్రశేఖర్‌ 22, గోపీనాథ్‌ 11, ఇద్దరూ కలిపి 18 చైన్‌స్నాచింగ్‌లు చేశారు. ఈ బంగారు ఆభరణాలను విక్రయించి వచ్చిన సొమ్ముతో జల్సాలు చేశారు. కొన్ని సందర్భాల్లో ఈ బంగారాన్ని వీరి తల్లి సరోజిని భద్రపరిచేది. మరికొన్ని సందార్భల్లో ఎక్కడైనా ఒంటరి మహిళలు ఉంటే వారి సమాచారాన్ని కుమారులకు చేరవేసేది. మొత్తంగా నగరంలో చైన్‌స్నాచింగ్‌లు విపరీతంగా పెరిగిపోవడంతో పోలీసులు ప్రత్యేక నిఘా పెట్టారు. సీసీ కెమెరా ఫుటేజీ ఆధారంగా వీరిని గుర్తించిన పోలీసులు అదుపులోకి తీసుకుని విచారించగా అనేక విషయాలు వెలుగుచూశాయి. మొత్తం 51 దొంగతనాల్లో 1382.90 గ్రాముల బంగారం అపహరించారు. వీరి నుంచి 1142.50 గ్రాముల  బంగారాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. వీరు బంగారంతోపాటు ఐదు బైక్‌లు అపహరించారని సీపీ తెలిపారు. ఈ దొంగతనాల వ్యవహారంలో మిగిలిన కుటుంబ సభ్యులకు సంబంధం లేదని ఆయన తెలిపారు. 2016 నుంచి 2019 వరకు చైన్‌ స్నాచింగ్‌ కేసులు తగ్గుతూ వచ్చాయని, 2017లో 1727 కేసులు, 2018లో 1261 కేసులు, 2019 ఏప్రిల్‌ వరకు 261 కేసులు నమోదయ్యాయన్నారు. సమావేశంలో ఏడీసీపీ సురేష్‌బాబు, ఏసీపీ ప్రభాకర్‌ బాబు, ఏసీపీ త్రినాథ్‌రావు, ఇన్‌స్పెక్టర్లు, సబ్‌ ఇన్‌స్పెక్టర్లు పాల్గొన్నారు.

నిందితులు గోపీనాథ్‌రెడ్డి, చంద్రశేఖర్‌రెడ్డి
నిందితులపై కేసుల వివరాలివీ
నిందితులు చంద్రశేఖర్, గోపీనాథ్‌లపై గాజువాక పోలీస్‌ స్టేషన్‌లో 21 కేసులు, దువ్వాడ పీఎస్‌లో 5, ఎంవీపీ పోలీస్‌ స్టేషన్‌లో 6, స్టీల్‌ప్లాంట్‌ పీఎస్‌లో 4, న్యూ పోర్ట్‌ పీఎస్‌లో 4, కంచరపాలెం పీఎస్‌లో 1, త్రీటౌన్‌లో 2, ఫోర్త్‌ టౌన్‌లో 1, మల్కాపురం పీఎస్‌లో 1, పెందుర్తి స్టేషన్‌లో 2, గోపాలపట్నం స్టేషన్లో 2, అనకాపల్లి స్టేషన్లో 3, మునగపాక స్టేషన్‌లో 2 కేసులు నమోదయయ్యాయి.

ప్రత్యేక బృందానికి అభినందనలు
విశాఖ నగరంలో చైన్‌ స్నాచింగ్స్‌ తరచూ జరుగుతుండడంతో ప్రత్యేక బృందాన్ని సీపీ ఏర్పాటు చేశారు. ఈ బృందానికి ఇన్‌స్పెక్టర్‌ ఎం.అవతారం నాయకత్వం వహించారు. దర్యాప్తులో భాగంగా చంద్రశేఖర్‌రెడ్డి, గోపీనాథ్‌రెడ్డి, వారి తల్లిపై అనుమానం రావడంతో ప్రత్యేక నిఘా పెట్టారు. ఈ క్రమంలో వారు నివాసం ఉంటున్న పరవాడలోని అనూష అపార్ట్‌మెంట్‌పై ప్రత్యేక నిఘా ఏర్పాటు చేసి చాకచక్యంగా పట్టుకున్నారు. సీఐ అవతారంతోపాటుగా సౌత్‌ సబ్‌ డివిజన్‌ క్రైం విభాగంలో ఎస్సైలు జి.తేజేశ్వరరావు, ఎల్‌.దామోదర్‌రావు, బి.లూథర్‌బాబు, డి.సూరిబాబు, మిగతా సిబ్బందిని సీపీ మహేష్‌చంద్ర లడ్డా అభినందించారు.

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top