రుధిర దారులు

8 People Died In Road Accidents In Joint Warangal District - Sakshi

ఉమ్మడి వరంగల్‌ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదాలు

రెండు ఘటనల్లో ఎనిమిది మంది దుర్మరణం

ఓ ఘటనలో భార్యాభర్తలతోపాటు ఐదునెలల కుమారుడు మృతి

మరో ప్రమాదంలో మామ, మేనల్లుడు.. బావబామ్మర్దులు

దసరా పండుగకు ముందు కుటుంబాల్లో తీరని విషాదం

ఇంకో రోజు గడిస్తే సద్దుల బతుకమ్మ.. ఆ తర్వాత మరో రోజుకు దసరా పండుగ.. ఆయా పండుగలకు సంబంధించి ఆ కుటుంబాలు ఏర్పాట్లు పూర్తి చేసుకున్నాయి.. కుటుంబీకులతో కలిసి ఆనందంగా పర్వదినాలు జరుపుకోవాలని సిద్ధమవుతున్నాయి.. ఇంతలోనే పెనువిషాదం! రోడ్డు ప్రమాదాల రూపంలో ఎదురొచ్చిన మృత్యువు ఎనిమిది మందిని బలి తీసుకుంది. ఉమ్మడి జిల్లాలోని దేవరుప్పుల మండలం బంజర స్టేజీతో పాటు ఆత్మకూరు మండలం కటాక్షపూర్‌ సమీపాన శుక్రవారం జరిగిన రెండు రోడ్డు ప్రమాదాల్లో ఎనిమిది మంది దుర్మరణం పాలయ్యారు. ఓ ఘటనలో భార్యాభర్తలు వారి కుమారుడితో పాటు మరో ఘటనలు మామ, మేనల్లుడు, సమీప బంధువులు మృతి చెందడంతో ఆ కుటుంబాల్లో రోదనలు మిన్నంటాయి.

సాక్షి, వరంగల్‌: ఉమ్మడి జిల్లాలోని రెండు చోట్ల ఘోర రోడ్డు ప్రమాదాలు చోటు చేసుకున్నాయి. ఈ ఘటనల్లో ఎనిమిది మంది మృతి చెందడంతో మరో నాలుగు రోజుల్లో దసరా పండుగ జరుపుకోవాల్సిన ఆయా కుటుంబాల్లో తీరని విషాదం నెలకొంది. బంధువుల ఇంట్లో శుభకార్యానికి హాజరయ్యేందుకు కారులో వెళ్తున్న నలుగురు మృతి చెందగా.. ఇందులో మామ, మేనల్లుడు, బావబామ్మర్దులు ఉన్నాయి. ఇక మరో ఘటనలో సోదరుడిని పరామర్శించి తల్లిదండ్రులతో కలిసి పండుగ జరుపుకునేందుకు వెళ్తున్న భార్యాభర్తలు, వారి ఐదు నెలల కుమారుడు దుర్మరణం పాలవడం కలిచివేసింది. ఓ ప్రమాదానికి అతివేగం, అజాగ్రత్తే కారణమని పోలీసులు తేల్చిచెప్పారు. దేవరుప్పుల మండలం బంజర వద్ద ఓ ప్రమాదం, ఆత్మకూరు మండలం మహ్మద్‌గౌస్‌పల్లి వద్ద శుక్రవారం ఈ ప్రమాదాలు జరిగాయి. బంధువుల మృతదేహాల వద్ద బంధువుల రోదనలు మిన్నంటగా.. ఆస్పత్రులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్న కుటుంబీకుల ఆర్తనాదాలతో మార్మోగాయి. 

శుభాకార్యానికి వెళ్తుండగా...
జనగామ జిల్లా దేవరుప్పుల మండలం నీర్మాలకు చెందిన బోగ సోమనర్సయ్య(40) జనగామలోని వీవర్స్‌ కాలనీలో స్థిరపడ్డారు. మహబూబాబాద్‌ జిల్లా తొర్రూరులో శుక్రవారం బంధువుల జన్మదిన వేడుకలకు ఆయనతోపాటు ఒకే సామాజిక వర్గం(పద్మశాలి)కు చెందిన హైదరాబాద్‌ వాస్తవ్యుడు, మేనల్లుడు చింతకింది మణిదీప్‌(18), జనగామ వీవర్స్‌ కాలనీకీ చెందిన బోగ రోహిత్, ప్రమీల, ఎల్లంలకు చెందిన బిర్రు సుధీర్‌కుమార్, రమాదేవితో స్విప్ట్‌ కారు(టీఎస్‌ 27–9772)లో శుక్రవారం ఉదయం బయలుదేరారు. సుమారు 11 గంటలకు బంజర స్టేజీ సమీపంలోని పెట్రోల్‌ బంకు వద్దకు రాగానే యాదాద్రి భువనగిరి జిల్లా గుండాల మండలం తుర్కలషాపురంకు చెందిన వృద్ధుడు జక్కులు రాములు వృద్ధుడు టీవీఎస్‌ ఎక్సెల్‌పై బంక్‌ నుంచి బంజర వైపు రోడ్డు క్రాస్‌ చేస్తుండగా ఆయనను తప్పించబోయే క్రమంలో జనగామ వైపు ఎదురుగా వస్తున్న కారు(టీఎస్‌ 10యూ 2344)ను ఢీకొట్టాడు. ఈ సంఘటనలో రెండు కార్లు నుజ్జునుజ్జయ్యాయి. ఈ మేరకు ఎయిర్‌ బ్యాగ్స్‌ ఓపెన్‌ అయినప్పటికీ పగిలిపోయి చింతకింది మణిదీప్‌ అక్కడికక్కడే మృతి చెందాడు. అలాగే, ఎదురుగా వస్తున్న కారులో పెద్దమడూరుకు చెందిన వర్రె మహేష్‌(24), కొమ్ము కృష్ణ(32), కర్రె అశోక్, చెరుకు సందీప్, దండబోయిన ఉమేష్‌ తీవ్రగాయాలపాలయ్యారు. రెండు కార్లలోని ముగ్గురి పరిస్థితి విషమంగా మారడంతో క్షతగాత్రులతో సహా స్థానిక ఎస్సై బి.రామారావు సిబ్బందితో చేరుకుని క్షతగాత్రులను జనగామ ఏరియా ఆస్పత్రికి తరలించారు. అయితే, చికిత్స పొందుతూ బోగ సోమనర్సయ్య, కొమ్ము కృష్ణ మృతి చెందగా మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్‌కు తరలించిన వర్రె మహేష్‌ కూడా మృతి చెందగా మృతుల సంఖ్య నాలుగుకు చేరింది. 

మరణంలోను వీడని బంధుత్వం, స్నేహం

బోగ సోమనర్సయ్య మృతదేహం; చింతకింది మనిదీప్‌; వర్రె మహేష్‌; కొమ్ము కృష్ణ 

బంజర స్టేజీ సమీపంలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాద ఘటనలో మృతి చెందిన నలుగురి నడుమ బంధుత్వం, స్నేహం ఉంది. బోగ సోమనర్సయ్య తమ రక్తససంబంధీకులు, బంధువులతో అన్యోన్యంగా ఉండే క్రమంలో ఆయనతోపాటు అక్క కొడుకు, మేనల్లుడు చింతకింది మణిదీప్‌ మరణంలోనూ కలిసే వెళ్లారు. ఇక పెద్దమడూరుకు చెందిన వర్రె మహేష్, కొమ్ము కృష్ణ ఒకే సామాజికవర్గాని(యాదవ)కి చెందిన యాదవులు కావడంతో పాటు చిన్ననాటి నుంచి స్నేహంతో పాటు బంధుత్వం(బావబామ్మర్దులు) కూడా ఉంది.

ఆస్పత్రిలో మిన్నంటిన ఆర్తనాదాలు

జనగామ ఏరియా ఆస్పత్రి వద్ద రోదిస్తున్న మృతుల కుటుంబసభ్యులు, బంధువులు

బంజర స్టేజీ వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతుల్లో నలుగురు మండల వాసులే కాగా మరొకరు హైదరాబాద్‌కు చెందిన వారు ఉన్నా అందరి నడుమ బంధుత్వం ఉంది. దీంతో ఘటన జరగగా జనగామ ఏరియా ఆస్పత్రికి చేరుకున్న బంధుమిత్రుల ఆర్తనాదాలు మిన్నంటాయి. ఈ దుర్ఘటనతో మృతి చెందిన బోగ సోమర్సయ్య నీర్మాల వాసికావడమేగాక అత్తగారు ఇదే మండలం కడవెండి కావడంతో ఆ రెండు గ్రామాలతోపాటు జనగామ వీవర్స్‌ కాలనీలో విషాదం అలుముకుంది. ఇక పెద్దమడూరులో ఊరుకు అరిష్టమని ఏడొద్దుల సద్దుల బతుకమ్మ రోజే ఇద్దరు గ్రామస్తుల దుర్మరణంతోపాటు నలుగురు గాయపడడంతో గ్రామం మూగబోయినట్లయింది. ఇక ఆస్పత్రి వద్ద సోమనర్సయ్య భార్య మాధవి, కొమ్ము కృష్ణ భార్య రేణుక, కుటుంబ సభ్యులు ‘అయ్యో తమ పిల్లల భవిత ఎట్టా.. తమకు ఆదెరువు ఎట్టా...దేవుడా మేమేం పాపం చేశాం..’ అంటూ చేసిన రోదనలు కలిచి వేశాయి.

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter


Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top