
ఇన్ సైడర్ ట్రేడింగ్ లో రిలయన్స్ కు ఊరట
ఐపీసీఎల్(ఇండియన్ పెట్రోకెమికల్స్ కార్పొ) కేసులో మకేశ్ అంబానీ రిలయన్స్ గ్రూప్‌కు చెందిన రిలయన్స్ పెట్రోఇన్వెస్ట్‌మెంట్స్(ఆర్‌పీఐఎల్)కు ఊరట లభించింది.
తాజా ఉత్తర్వులో స్పష్టం చేసిన సెబీ
న్యూఢిల్లీ: ఐపీసీఎల్(ఇండియన్ పెట్రోకెమికల్స్ కార్పొ) కేసులో మకేశ్ అంబానీ రిలయన్స్ గ్రూప్‌కు చెందిన రిలయన్స్ పెట్రోఇన్వెస్ట్‌మెంట్స్(ఆర్‌పీఐఎల్)కు ఊరట లభించింది. 9 ఏళ్ల ఈ ఇన్‌సైడర్ ట్రేడింగ్ కేసులో ఆర్‌పీఐఎల్ ఇన్‌సైడర్ ట్రేడింగ్ నిబంధనలు ఉల్లంఘించిందనడానికి తగిన ఆధారాల్లేవంటూ మార్కెట్ నియంత్రణ సంస్థ సెబీ కేసును కొట్టివేసింది. ఇదే కేసులో 2013 మేలో ఆర్‌పీఐఎల్‌పై సెబీ రూ.11 కోట్ల జరిమానా విధించింది. రిలయన్స్ ఇండస్ట్రీస్‌లో ఐపీసీఎల్ విలీనం, డివిడెండ్‌లకు సంబంధించిన సమాచారాన్ని ఐసీసీఎల్ యాజమాన్య సంస్థగా ఆర్‌పీఐఎల్ ముందుగానే తెలుసుకొని స్టాక్ మార్కెట్లో ఐపీసీఎల్ షేర్లను కొనుగోలు చేసిందని సెబీ పేర్కొంది.
ఈ ఇన్‌సైడర్ ట్రేడింగ్ కారణంగా ఆర్‌పీఐఎల్ రూ.3.82 కోట్లు లాభపడిందని భావించిన సెబీ ఆర్‌పీఐఎల్‌పై రూ 11 కోట్ల జరిమానాను విధించింది. సెబీ జరిమానాకు వ్యతిరేకంగా ఆర్‌పీఐఎల్ సెక్యూరిటీస్ అప్పిల్లేట్ ట్రిబ్యూనల్(శాట్)ను ఆశ్రయించింది. ఈ జరిమానాను గత ఏడాది డిసెంబర్‌లో శాట్ కొట్టేసింది. అంతే కాకుండా ఈ కేసును సెబీ తాజాగా విచారించాలని, మూడు నెలల్లో నిర్ణయాన్ని వెలువరించాలని ఆదేశాలు జారీ చేసింది. తాజాగా ఈ కేసు విచారణ చేపట్టిన సెబీ, ఆర్‌పీఐఎల్, ఆర్‌ఐఎల్‌లు ఒకే గ్రూప్‌కు చెందిన కంపెనీలైనప్పటికీ, ఐపీసీఎల్ షేర్లకు సంబంధించి ఇన్‌సైడర్ ట్రేడింగ్‌కు పాల్పడ్డాయనడానికి ఎలాంటి ఆధారాలు లేవని పేర్కొంది. ఐపీసీఎల్ ప్రభుత్వ రంగ సంస్థ. డిజిన్వెస్ట్‌మెంట్ ప్రక్రియలో భాగంగా ఈ కంపెనీని ప్రభుత్వం రిలయన్స్ ఇండస్ట్రీస్‌కు విక్రయించింది. రిలయన్స్ ఇండస్ట్రీస్‌కు అనుబంధ సంస్థగా కొనసాగి ఆ తర్వాత రిలయన్స్ ఇండస్ట్రీస్‌లో విలీనమైంది. ఆ తర్వాత స్టాక్ ఎక్స్ఛేంజ్‌ల నుంచి డీలిస్ట్ అయింది.