సమైక్య శంఖారావం యాత్ర మూడోరోజు సోమవారం పలమనేరు నియోజకవర్గం వి.కోట నుంచి ప్రారంభమైంది. ఉదయం 9.30 నుంచి 1.20 గంటల వరకు వి.కోటలోనే సాగింది.
=మిన్నంటిన సమైక్య నినాదాలు
=కుట్రదారులకు శాపనార్థాలు
=తరగని అభిమానం
సాక్షి, తిరుపతి: సమైక్య శంఖారావం యాత్ర మూడోరోజు సోమవారం పలమనేరు నియోజకవర్గం వి.కోట నుంచి ప్రారంభమైంది. ఉదయం 9.30 నుంచి 1.20 గంటల వరకు వి.కోటలోనే సాగింది. అడుగడుగునా అభిమానులు, మహిళలు హారతులు ఇస్తూ జగన్‌మోహన్‌రెడ్డికి ఘన స్వాగతం పలికారు.
వి.కోట శివారు ప్రాంతంలోని ఖాజీపేటలో పలువురు ముస్లిం సోదరులు ఆయనను కలిసి సంఘీభావం తెలిపారు. ఖాజీపేట మసీదు ప్రాంతంలో పండ్లు అందజేశారు. సిద్ధార్థ హైస్కూలు వద్ద విద్యార్థులు వేచి ఉండడంతో జగన్‌మోహన్‌రెడ్డి అక్కడ ఆగి విద్యార్థులను ఆశీర్వదించారు.
అక్కడి నుంచి బయలుదేరిన ఆయనకు దొడ్డిపల్లె వద్ద అభిమానులు ఘన స్వాగతం పలికారు. నెర్నిపల్లె పంచాయతీ ప్రాంతంలో మాజీ ఎంపీటీసీ చలపతి, పార్టీ నాయకులు మురళీ, వెంకటరమణ తదితరులు భారీ ఎత్తున స్వాగతం పలికారు. అలాగే జగన్‌మోహన్‌రెడ్డి దారి పొడవునా అభిమానులను పలకరిస్తూ కృష్ణాపురం, దానమయ్యగారిపల్లె మీదుగా బెరైడ్డిపల్లె చేరుకున్నారు.
అభిమానుల పట్టుదలతో..
జగన్‌మోహన్‌రెడ్డి సోమవారం రాత్రి బెంగళూరు మీదుగా హైదరాబాద్ వెళ్లాల్సి ఉండడంతో మధ్యలోనే యాత్రను ముగించుకున్నారు. సాయంత్రం 4 గంటలకు బెంగళూరుకు బయలుదేరేందుకు బెరైడ్డిపల్లెలో జరగాల్సిన సభను వాయిదా వేసుకున్నారు. అప్పటికే అక్కడ 20 వేల మంది అభిమానులు వేచి ఉన్నారు. జగన్‌మోహన్‌రెడ్డి రారని తెలియడంతో నిరాశ చెందారు. జగన్ రావాలంటూ కొందరు గట్టిగా నినాదాలు చేశారు. ఈ విషయం తెలుసుకున్న ఆయన బెరైడ్డిపల్లె వెళ్లేందుకు అంగీకరించారు.
సాయంత్రం 4.45 గంటలకు అక్కడికి చేరుకున్నారు. 5.30 గంటల వరకు ఉండి కొద్దిసేపు ప్రసంగించారు. ఆ తరువాత అక్కడి నుంచి బెంగుళూరు మీదుగా హైదరాబాద్‌కు వెళ్లారు. జగన్‌మోహన్‌రెడ్డి ఆదివారం రాత్రి పట్రపల్లెలో బస చేయగా సోమవారం ఉదయం ఆయనను పలువురు నేతలు కలుసుకున్నారు. వీరిలో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, భూమన కరుణాకర్‌రెడ్డి, పెద్దిరెడ్డి మిధున్‌రెడ్డి, చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి, బియ్యపు మధుసూదన్‌రెడ్డి, ఆర్‌కే.రోజా, నారాయణస్వామి, అమరనాథరెడ్డి, ఏఎస్.మనోహర్, వరప్రసాదరావు, ఆదిమూలం, చింతల రామచంద్రారెడ్డి, సుబ్రమణ్యంరెడ్డి, తలుపులపల్లి బాబురెడ్డి, పోకల అశోక్‌కుమార్, పూతలపట్టు సునీల్‌కుమార్, షమీమ్‌అస్లాం, రాజరత్నంరెడ్డి, సాక్షిబాబు, చొక్కారెడ్డి జగదీశ్వర్‌రెడ్డి, ఉదయకుమార్, పాలగిరి ప్రతాప్‌రెడ్డి, వై.సురేష్ తదితరులు ఉన్నారు.