గ్రామాల్లో బెల్టు షాపులు నడవకూడదు: సీఎం జగన్‌

YS Jagan Held Review Meeting With Enforcement And Prohibition Department - Sakshi

సాక్షి, అమరావతి :  విధి నిర్వహణలో ఎక్సైజ్‌ సిబ్బంది కఠినంగా వ్యవహరించాలని ముఖ్యమంత్రి ఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి సూచించారు. తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో ఆయన గురువారం ఎన్‌ఫోర్స్‌మెంట్‌, ఎక్సైజ్‌ శాఖ అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఇసుక అక్రమ తవ్వకాలు, అక్రమ రవాణా, బెల్టుషాపులు, మద్యం అక్రమ తయారీ నిరోధంపై అనుసరించాల్సిన చర్యలపై అధికారులకు ... ముఖ్యమంత్రి దిశా నిర్ధేశం చేశారు.

ఈ సందర్భంగా సీఎం వైఎస్‌ జగన్‌ మాట్లాడుతూ.. గ్రామాల స్వరూపాన్ని మార్చడానికి అనేక కార్యక్రమాలు చేపడుతున్నామన్నారు. గ్రామ సచివాలయం, వైఎస్సార్‌ రైతు భరోసా కేంద్రాలు, వైఎస్సార్‌ విలేజ్‌ క్లినిక్‌లు, ఇంగ్లిష్‌ మీడియంలో విద్యాబోధన తదితర మార్పులు తీసుకొస్తున్నామని తెలిపారు. గ్రామాల సమగ్రాభివృద్ధిలో ఇవన్నీ విప్లవాత్మకమైన  మార్పులు తీసుకు వస్తాయన్నారు. ఇలాంటి కార్యక్రమాలు నిర్వహిస్తున్నప్పుడు బెల్టుషాపులు, అక్రమంగా మద్యం తయారీ, అక్రమ ఇసుక తవ్వకాలు లాంటివి మన ఉద్దేశాలను దెబ్బతీస్తాయని అభిప్రాయపడ్డారు. (21.. 24.. 27న స్థానిక ఎన్నికలు?)

గ్రామాల్లో బెల్టు షాపులు నడవకూడదు :
గ్రామాల్లో ఎట్టి పరిస్థితుల్లోనూ  బెల్టుషాపులు నడవకూడదని, అలాగే మద్యం అక్రమ తయారీ ఉండకూడదని ముఖ్యమంత్రి హెచ్చరికలు జారీ చేశారు. సరిహద్దుల్లో అక్రమ ఇసుక రవాణా, మద్యం రవాణాలు ఉండకూడదన్నారు. ఇలాంటి ఘటనలపై పోలీసులు, ఎన్‌ఫోర్స్‌మెంట్‌, ప్రొహిబిషన్‌ సిబ్బంది అత్యంత కఠినంగా వ్యవహరించాల్సిన అవసరం ఉందన్నారు. గ్రామాల్లో ప్రభుత్వ ప్రతిష్ట పెరగాలంటే బెల్టు షాపులు ఉండకూడదనే గ్రామాల్లో 11వేల మహిళా పోలీసులను నియమించినట్లు పేర్కొన్నారు. బెల్టుషాపులు నిరోధమే మహిళా పోలీసులు ప్రాథమిక విధిగా పేర్కొన‍్నారు. వారందరికి స్మార్ట్‌ ఫోన్లు ఇచ్చామని, వారిని శక్తివంతంగా వాడుకుంటూ ఎప్పటికప్పుడు సమాచారాన్ని తెప్పించుకోవాలని అధికారులకు వివరించారు. వీరితో పాటు గ్రామాల్లో మహిళా మిత్రలు కూడా ఉన్నారని, వారి సేవలను సమర్థవంతంగా వినియోగించుకోవాలని సూచించారు. (26 లక్షల మందికి ఇళ్ల స్థలాలు)

సమన్వయంతో కలిసి పనిచేయండి :
ఇక ఎన్‌ఫోర్స్‌మెంట్‌ విభాగంలో సిబ్బందిని పెంచాలంటు ముఖ్యమంత్రి జగన్‌ .. అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ప్రొహిబిషన్‌ అండ్‌ ఎక్సైజ్‌ శాఖలో ఉన్న మూడింట రెండు వంతుల సిబ్బందిని ఎన్‌ఫోర్స్‌మెంట్‌ పనుల కోసం వినియోగించాలన్నారు. ఎన్‌ఫోర్స్‌మెంట్‌ విభాగంతో కలిసి కట్టుగా పనిచేసి ఫలితాలు సాధించాలని తెలిపారు. స్టాండర్ట్‌ ఆపరేషన్‌ ప్రొసీజర్‌ను తయారుచేసుకోవడం ద్వారా విధుల నిర్వహణలో సమర్థతను పెంచుకుని అనుకున్న లక్ష్యాలను సాధించాలని అధికారులకు దిశా నిర్ధేశం చేశారు. ఈ సమావేశంలో మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, సీఎస్‌ నీలం సాహ్ని,  సంబంధిత శాఖల అధికారులు పాల్గొన్నారు.(‘ఆయన చంద్రబాబు కోవర్ట్‌’)

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top