నగర రూపురేఖలు మారుస్తాం 

We Have Plan For Road Development Said By Venkatrami Reddy - Sakshi

రూ.1.50 కోట్లతో ఆర్‌అండ్‌బీ రోడ్లు

ఎమ్మెల్యే అనంత వెంకటరామిరెడ్డి

సాక్షి, అనంతపురం : ‘గత పాలకుల నిర్లక్ష్యం నగర ప్రజలకు శాపంగా మారింది. నగరంలోని రోడ్లు చాలా చోట్ల చిద్రమయ్యాయి. నగర ప్రజలు అడుగు వేయాలంటే భయపడే పరిస్థితి. శానిటేషన్‌ను అటకెక్కించేశారు. మా ప్రభుత్వం అధికారంలోకి రాగానే పాలనను గాడిలో పెట్టేందుకు కృషి చేస్తున్నాం. ప్రణాళిక బద్ధంగా ముందుకెళ్లి నగర రూపురేఖలు మారుస్తాం’ అని అనంతపురం అర్బన్‌ ఎమ్మెల్యే అనంత వెంకటరామిరెడ్డి పేర్కొన్నారు.

శనివారం ఎమ్మెల్యే సాక్షితో మాట్లాడారు. నగరంలో చేపట్టబోతున్న అభివృద్ధి కార్యక్రమాలను తెలియజేశారు. ఆర్‌అండ్‌బీ పరిధిలోని గుత్తి రోడ్డు పోస్టాఫీసు నుంచి సోములదొడ్ది వరకు రూ.1.10 కోట్లతో బీటీ రోడ్డు, క్లాక్‌టవర్‌ ఆర్‌ఓసీ బ్రిడ్జిపై రూ.40 లక్షలతో బీటీ రోడ్డు వేసేలా చర్యలు తీసుకున్నామన్నారు. ఇందుకు సంబంధించి టెండర్లను ఆహ్వానించామని, త్వరలో పనులు ప్రారంభం కానున్నాయన్నారు.  

రూ.4.2 కోట్లతో రోడ్లకు ప్రతిపాదనలు 
గతంలో అప్పటి ఎంపీ జేసీ దివాకర్‌రెడ్డి, ఎమ్మెల్యే వైకుంఠం ప్రభాకర్‌ చౌదరి, మేయర్‌ స్వరూప వేరుకుంపట్లతో నగరాభివృద్ధిని విస్మరించారన్నారు. వీరి అస్తవ్యస్థ పాలనతో నగరంలోని రోడ్లన్నీ గుంతలమయంగా మారాయన్నారు. 14వ ఆర్థిక సంఘం నిధులు రూ.4.2 కోట్లతో నగరంలో రోడ్లు వేసేందుకు ప్రతిపాదనలు పంపుతామన్నారు.

ఆర్టీసీ బస్టాండ్‌ నుంచి గుత్తి రోడ్డు వరకు రూ.85 లక్షలతో బీటీ రోడ్డు,  త్రివేణి థియేటర్‌ నుంచి శ్రీకంఠం సర్కిల్‌ మీదుగా ఆర్టీసీ బస్టాండ్‌ వరకు రూ.46 లక్షలతో రోడ్డు, 1, 2, 3 రోడ్లు ఉండే జీరో క్రాస్‌ వద్ద రూ.60 లక్షలతో బీటీ రోడ్డు, నీలిమా థియేటర్‌ నుంచి తపోవనం హైవే వరకు రూ.81 లక్షలతో రోడ్డు, 48వ డివిజన్‌లో రూ.49 లక్షలతో రోడ్డు, అశోక్‌నగర్‌ నుంచి డ్రైవర్స్‌ కాలనీ వరకు రూ.40 లక్షలతో బీటీ రోడ్డు, ఓటీఆర్‌ఐ నుంచి అశోక్‌నగర్‌ వైపు రూ.40 లక్షలతో రోడ్డు వేసేందుకు ప్రతిపాదనలు సిద్ధం చేశామన్నారు.  

మొదలైన ప్యాచ్‌ వర్క్‌ పనులు  
నగరంలో రూ.25 లక్షలతో ప్యాచ్‌ వర్క్‌లు మొదలయ్యాయని ఎమ్మెల్యే తెలిపారు. ప్రధాన రోడ్లలో మొదట ప్యాచ్‌ వర్క్‌›లు ప్రారంభించేలా చర్యలు తీసుకున్నామన్నారు. వర్షం పడుతున్న సమయంలో నెమ్మదిగా పనులు జరిగేలా చూస్తున్నామన్నారు. రానున్న రోజుల్లో నగరం సుందరంగా తీర్చిదిద్దుతామని ఎమ్మెల్యే స్పష్టం చేశారు.   

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top