ఇసుక సమస్యకు తెర 

Vijayanagaram Collector Has Issued Orders To Transport Sand - Sakshi

నేటి నుంచి సరఫరాకు చర్యలు

70 ఇసుక స్ట్రీమ్‌లు గురువారం ఉదయమే ప్రారంభించాలి

సంయుక్త కలెక్టర్‌ కె. వెంకట రమణారెడ్డి ఆదేశాలు 

సాక్షి, విజయనగరం : ఇసుక సమస్యకు ఇక చెక్‌ పడనుంది. ఇన్నాళ్లుగా ఇదో ఆయుధంగా మలచుకున్నవారి నోటికి తాళం పడనుంది.  గురువారం ఉదయం నుంచే ఇసుక ర్యాంపుల ద్వారా ఇసుక సరఫరా చేయాలని జిల్లా సయుక్త కలెక్టర్‌ కె.వెంకట రమణారెడ్డి ఆదేశాలు జారీ చేశారు. ఇటీవల వర్షాలు కురవడం వల్ల ఇసుక ర్యాంప్‌లు నీటితో తడిసిపోవడం వల్ల నెలరోజుల పాటు ఇసుక సరఫరా చేయలేదన్నారు. కలెక్టరేట్‌ సమావేశ భవనంలో అధికారులు, ఈఓపీఆర్‌డీలు, పంచాయతీ కార్యదర్శులు, సహాయకులకు బుధవారం ఇసుక సరఫరాపై శిక్షణా కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా జేసీ మాట్లాడుతూ ప్రభుత్వం నూతన ఇసుక పాలసీ ప్రవేశపెట్టిందని, పంచాయతీ కార్యదర్శుల ద్వారా ప్రజలకు ఇసుక సరఫరా చెయ్యాలని ఆదేశాలు జారీచేశారన్నారు.  

జిల్లాలో 26 మండలాల్లో 70 ఇసుక రీచ్‌ లను గుర్తించామనీ, ఈ రీచ్‌ల నిర్వహణ బాధ్యతలను 70 మంది పంచాయతీ కార్యదర్శులకు అప్పగించడమైందన్నారు. మిగిలిన మండలా ల్లో కూడా ఇసుక రీచ్‌ లను గుర్తిస్తామని, వీరికి ఇసుక అవసరమైతే గుర్తించిన రీచ్‌ల నుంచి ఇసుక సరఫరా చేయ్యాలన్నారు. కార్యదర్శులు స్మార్ట్‌ ఫోన్‌ లో  యాప్‌ డౌన్‌ లోడ్‌ చేసుకోవాలని ఎస్‌3 ఫారం జనరేట్‌ చేసుకోవాలన్నారు. ఫారం జనరేట్‌ అయిన తర్వాత యూనిక్‌ నంబరు వస్తుందని దానిని ప్రింట్‌ తీసుకోని, 48 గంటల లోపు ఇసుకను తీసుకు వెళ్లాలన్నారు. ఒక టన్ను ఇసుక ధర రూ.375లు గా నిర్ణయించామనీ, ఇందులో రూ.285 లు ప్రభుత్వానికి, మిగిలిన రూ.90 లు లోడింగ్‌  చార్జీల కింద కార్మికులకు చెల్లించాలన్నారు. ఎడ్ల బండ్లు, ట్రాక్టర్ల ద్వారా మాత్రమే ఇసుక సరఫరా చెయ్యాలని స్పష్టం చేశారు. ఒక ఎడ్ల బండికి అరటన్ను కు రూ.150లు, ఒక ట్రాక్టర్‌కు నాలుగున్నర టన్నుల ఇసుక పడుతుందని, రూ.1283 లు అవుతుందన్నారు. ఇసుకను యంత్రాలతో లోడ్‌ చేయవద్దని, కార్మికుల ద్వారా లోడింగ్‌  చేయించాలన్నారు.

వాహనానికి ఎస్‌3 ఫారం అతికించాలని, అది లేకుండా ఇసుకను తరలిస్తే మొదటిసారి రూ.10 వేలు, రెండవసారి రూ.20 వేలు జరిమానా, మూడవ సారి క్రిమినల్‌ చర్యలు తీసుకోవాలన్నారు. రెండురోజుల తర్వాత  నేరుగా నగదు స్వీకరించే అవకాశం కల్పిస్తామని వివరిచారు.  జిల్లాకు 1,50,000 టన్నుల నుంచి 2లక్షల టన్నుల వరకు అవసరమని తెలిపారు. నీతి, నిజాయితీగా, పారదర్శకంగా పనిచెయ్యాలని, ఎటువంటి ఆరోపణలు  రాకుండా జాగ్రత్తగా అర్హులైన వారికే ఇసుక కేటాయించాలన్నారు.   కార్యక్రమంలో భూగర్భ గనుల శాఖ ఉప సంచాలకుడు పూర్ణ చంద్రరావు, సహాయ సంచాలకుడు ఎస్‌.వి.రమణారావు, జిల్లా పంచాయతీ అధికారి సత్యనారాయణ, ఎన్‌ఐసీ అధికారి నరేంద్ర కుమార్‌ , ఈఓపీఆర్‌డీలు, పంచాయతీ కార్యదర్శులు, సహాయకులు తదితరులు పాల్గొన్నారు. 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top