‘ఎక్సయిజ్‌’లో వెలగపూడి హవా!

Velagapudi Ramakrishna Corruption in Excise Department - Sakshi

తన ఇలాకాలో నచ్చిన వారికి పోస్టింగ్‌లు

మద్యం షాపులకు అనుచరులతో టెండర్లు

ఆపై వాటిలో అక్రమాలు, అడ్డదారులు

సాక్షి, విశాఖపట్నం: మద్యం వ్యాపారంలో ఆక్టోపస్‌లా అల్లుకుపోయిన విశాఖ తూర్పు ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణబాబు ఎక్సయిజ్‌ శాఖలో ఆధిపత్యాన్ని చెలాయిస్తున్నారు. దాదాపు దశాబ్దకాలంగా ఆయన ఇటు ఎక్సయిజ్‌ అధికారులను, అటు సిండికేట్లను తన గుప్పెట్లో పెట్టుకుని చక్రం తిప్పుతున్నారు. లిక్కర్‌ సామ్రాజ్యంలో తాను ఆడిందే ఆట, పాడిందే పాటలా వ్యహరిస్తున్నారు. మద్యం షాపులకు టెండర్లు పిలిచినప్పుడు కూడా బెదిరింపులకు పాల్పడుతూ ఇతరులెవ్వరూ తన ఇలాకాలోకి అడుగుపెట్టనీయరు. తన అనుచరగణం ద్వారానే లిక్కర్‌ షాపులకు టెండర్లు వేయించి వాటిని వ్యూహాత్మకంగా దక్కించుకుంటారని మద్యం వ్యాపారులు చెబుతుంటారు. ఏళ్ల తరబడి ఎన్నిసార్లు టెండర్లు పిలిచినా ఇదే అక్కడ ఆనవాయితీగా వస్తోంది.

తూర్పు నియోజకవర్గం పరిధిలోని ఎంవీపీ కాలనీ, హనుమంతవాక తదితర ప్రాంతాల్లో ఉన్న మద్యం షాపులు ఈయన బినామీలవేనని చెబుతారు. అంతేకాదు.. తూర్పు నియోజకవర్గం పరిధిలోకి వచ్చే ఎక్సైజ్‌ స్టేషన్లలోనూ తన చెప్పు చేతల్లో పనిచేసే ఎక్సయిజ్‌ అధికారులకు ఏరికోరి పోస్టింగులు వేయించుకుంటారు. వీరు వెలగపూడి అండ్‌ కో మద్యం దుకాణాల్లో నిబంధనలకు విరుద్ధంగా అక్రమాలు, అధిక ధరలకు విక్రయాలు జరిపినా వారు పట్టించుకోరు. పైగా ఉన్నతస్థానంలో ఉన్న ఒకరిద్దరు ఎక్సయిజ్‌ అధికారులతోను సత్సంబంధాలు కలిగి ఉండడంతో వీరి జోలికి టాస్క్‌ఫోర్స్‌/ఎన్‌ఫోర్స్‌మెంట్‌/ స్క్వాడ్‌ అధికారులు వెలగపూడి వారి మద్యం షాపుల వైపు తొంగిచూడరు.

ఇదో ఉదాహరణ..
గతంలో తన సిండికేట్‌లోని తన అనుచరుడికి చెందిన రూ.50 లక్షల విలువ చేసే మద్యాన్ని అనకాపల్లి ఎక్సయిజ్‌ స్టేషన్‌ పరిధిలో పట్టుకున్నారు. దీనిపై కేసు నమోదు చేసి కమిషనర్‌కు పంపే సమయంలో వెంటనే వెలగపూడి రంగప్రవేశం చేశారు. అప్పటి జిల్లా స్థాయి అధికారి (అసిస్టెంట్‌ కమిషనర్‌)పై ఒత్తిడి తెచ్చారు. కేసును నీరుగార్చి కేవలం రూ.5 వేల జరిమానాతో సరిపెట్టేశారు. ఇంతలా ఎక్సయిజ్‌లో పట్టు సంపాదించిన వెలగపూడి అంటే జిల్లాలో పనిచేసే ఆ శాఖ అధికారులు ఆయన షాపుల జోలికి వెళ్లరు. అందుకే జిల్లాలోనూ, ఎక్కడో సుదూరంగా ఏజెన్సీ ప్రాంతాల్లో ఉన్న మద్యం షాపులపై వీరు దాడులు చేస్తుంటారు తప్ప వెలగపూడి సామ్రాజ్యంలోని దుకాణాలపై కేసులు నమోదు చేయరు. అంతేకాదు.. ఎక్సయిజ్‌లో ఇతర జిల్లాల నుంచి విశాఖకు బదిలీ కావాలన్నా, ఏదైనా ఇబ్బందుల్లో పడ్డ వారిని గట్టెక్కించాలన్నా ఇన్నాళ్లూ వెలగపూడినే ఆశ్రయించే వారు. ఇన్నాళ్లూ ఆ శాఖలో తనకున్న పట్టు, పలుకుబడితో వారికి అనుకూలంగా చేస్తూ వచ్చారు. తెలుగుదేశం అధికారం కోల్పోవడంతో ఇక వెలగపూడి హవాకు చెక్‌ పడుతుందని సాటి మద్యం వ్యాపారులతో పాటు ఎక్సయిజ్‌ అధికారులూ ఇప్పుడు చర్చించుకుంటున్నారు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top