రైతులంటే పగ ఎందుకు?: వాసిరెడ్డి పద్మ | Vasireddy Padma takes on chandrababu naidu over farmers free current scheme | Sakshi
Sakshi News home page

రైతులంటే పగ ఎందుకు?: వాసిరెడ్డి పద్మ

Nov 21 2014 1:54 AM | Updated on Jul 7 2018 2:56 PM

రైతులంటే పగ ఎందుకు?: వాసిరెడ్డి పద్మ - Sakshi

రైతులంటే పగ ఎందుకు?: వాసిరెడ్డి పద్మ

రాష్ట్రంలోని మెట్ట ప్రాంత రైతులను ఆదుకునేందుకు దివంగత వైఎస్ రాజశేఖరరెడ్డి ప్రవేశపెట్టిన ఉచిత విద్యుత్..

* టీడీపీ అధినేత చంద్రబాబుపై వాసిరెడ్డి పద్మ ధ్వజం
* ఉచిత విద్యుత్‌కు ఆధార్‌తో లింకు పెట్టడం దారుణం
* ఎన్నికల ముందు ఆధార్ కార్డంటే ఖబడ్దార్ అన్నారు..
* ఇప్పుడేమో ఆధార్ సాకు చూపి సంక్షేమ పథకాల్లో కోత విధిస్తున్నారు

 
 సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని మెట్ట ప్రాంత రైతులను ఆదుకునేందుకు దివంగత వైఎస్ రాజశేఖరరెడ్డి ప్రవేశపెట్టిన ఉచిత విద్యుత్ సౌకర్యం పొందాలంటే ఆధార్ కార్డు ఉండి తీరాలని చంద్రబాబు ప్రభుత్వం షరతు విధించడం దారుణమని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి వాసిరెడ్డి పద్మ ఆగ్రహం వ్యక్తం చేశారు. నవంబర్ 20వ తేదీలోపుగా ఆధార్ వివరాలు ఇవ్వకపోతే ఆ మరుసటి రోజు నుంచే ఉచిత విద్యుత్ ఉండదని చెప్పడం, గడువు కూడా పొడిగించకపోవడం సరికాదన్నారు. గురువారం ఆ మె పార్టీ కేంద్ర కార్యాలయంలో విలేకరులతో మాట్లాడుతూ ప్రభుత్వ నిర్ణయం వల్ల మొత్తం 13.50 లక్షల విద్యుత్ కనెక్షన్లలో 40 శాతం మంది రైతులకు ఉచిత విద్యుత్ పథకం దక్కకుండా పోతోందని విమర్శించారు.
 
 ప్రతిపక్ష నేతగా చంద్రబాబు పాదయాత్ర చేసినపుడు ‘ఆధార్‌తో గ్యాస్ కనెక్షన్ లింకా... సబ్సిడీ బియ్యం కోసం ఆధార్ కావాలా..?’ అంటూ విమర్శలు చేసి అధికారంలోకి వచ్చాక అదే ఆధార్‌ను ఆయుధంగా చేసుకుని పథకాల్లో కోత విధిస్తున్నారని పద్మ దుయ్యబట్టారు. ఆధార్ పేరు చెప్పి రాష్ట్రంలో 10 లక్షల సామాజిక పింఛన్లు, 23 లక్షల రేషన్ కార్డులను కత్తిరించారని ఆమె పేర్కొన్నారు. సంక్షేమ పథకాలతో ఆధార్ ను ముడిపెట్టొద్దని సుప్రీంకోర్టు  ఆదేశాలిచ్చినా టీడీపీ ప్రభుత్వం ఖాతరు చేయకపోవడం శోచనీయమన్నారు. వృద్ధులు, పేదలపై చంద్రబాబుకు పగ ఎందుకు? రైతులంటే కోపమెందుకు అని ఆమె ప్రశ్నించారు.
 
 అంతా మిథ్య అనుకుంటున్నారా?
 ‘‘నాడు ఆధార్ అంటే ఖబడ్దార్ అని చెప్పిన చంద్రబాబు ఇపుడు ప్రతిదానికీ ఆధార్ జపం చేస్తున్నారు.. ఉచిత విద్యుత్‌కు కూడా ఆధార్‌తో లింకు అంటున్నారంటే దాని ఉద్దేశం ఏమిటి? పంట భూమి ఉండటం అబద్ధమా? రైతు అబద్ధమా? అంతా మిథ్య అనుకుంటున్నారా?’’ అని వాసిరెడ్డి పద్మ ప్రశ్నించారు. వాస్తవానికి బాబు మనసున్న సీఎం కానే కాదని, పదిమందికీ సాధ్యమైనంత ఎక్కువగా మేలు చేద్దామనే ఆలోచన కన్నా రూపాయి, రూపాయి ఎలా మిగుల్చుకుందామనే ఆలోచిస్తూ ఉంటారని ఆమె విమర్శించారు.
 
 ఉచిత విద్యుత్ పథకానికి ఆధార్ తప్పనిసరి అనే నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని, లేని పక్షంలో తమ పార్టీ పోరాటం చేస్తుందని ఆమె హెచ్చరించారు. తమ పార్టీ కేంద్ర కార్యాలయాన్ని ఒక చోటి నుంచి మరో చోటుకు మార్చుతున్న క్రమంలో వైఎస్ విగ్రహానికి అపచారం చేశామని ఒక చానెల్, ఒక పత్రిక విషప్రచారానికి పూనుకున్నాయని, వైఎస్ జీవించి ఉండగా ఈ మీడియా యాజమాన్యం వైఎస్ పట్ల ఎంత బాగా వ్యవహరించిందో అందరికీ తెలుసునని ఆమె అన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement