రెండు కుటుంబాల్లో తీరని విషాదం చోటుచేసుకుంది. అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం మండలం దొడగట్ట గ్రామానికి చెందిన రెండు కుటుంబాల్లోని పవన్, సంతోష్ అనే ఇద్దరు పిల్లలు నీటి కుంటలో పడి మరణించారు.
రెండు కుటుంబాల్లో తీరని విషాదం చోటుచేసుకుంది. అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం మండలం దొడగట్ట గ్రామానికి చెందిన రెండు కుటుంబాల్లోని పవన్, సంతోష్ అనే ఇద్దరు పిల్లలు నీటి కుంటలో పడి మరణించారు. పిల్లలు ఇద్దరూ వాస్తవానికి శుక్రవారం మధ్యాహ్నం నుంచి కనిపించలేదు. దాంతో కుటుంబసభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేసి, ఆ ప్రాంతంలో చుట్టుపక్కల అంతా గాలించారు. అయినా ఫలితం లేకపోయింది.
శనివారం ఉదయం దొడగట్ట గ్రామ సమీపంలో ఉన్న ఓ నీటి కుంట వద్ద చిన్నారుల మృతదేహాలను స్థానికులు గుర్తించి సమాచారం అందించారు. వీళ్లు ఈతకు వెళ్లి పొరపాటున పడి మరణించారా.. లేక మరేవైనా కారణాలు ఉన్నాయా అనే విషయమై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఆ ప్రాంతంలో పిల్లలు ఆడుకోడానికి ఎలాంటి అవకాశం లేదని, అందువల్ల ఎవరైనా పిల్లలను తీసుకెళ్లి అక్కడ ఏమైనా చేశారా అనే అనుమానాలు కూడా తలెత్తుతున్నాయి. కానీ సమగ్రంగా దర్యాప్తు చేసిన తర్వాతే దీనిపై పూర్తి వివరాలు చెప్పగలమని పోలీసులు అంటున్నారు.