43 కిలోమీటర్ల మేర స్తంభించిన ట్రాఫిక్‌

Traffic Jam on Srisailam Ghat Road - Sakshi

సాక్షి, శ్రీశైలం: ప్రముఖ జ్యోతిర్లింగ శివక్షేత్రమైన శ్రీశైల మహాక్షేత్రం ఆదివారం భారీగా తరలివచ్చిన సందర్శకులు, యాత్రికులతో పోటెత్తింది. వరుసగా మూడు రోజులపాటు సెలవు రావడంతో ఏపీ, తెలంగాణ, మహారాష్ట్ర, కర్ణాటక రాష్ట్రాల నుంచి పెద్దసంఖ్యలో సందర్శకులు తరలివచ్చారు. శ్రీశైలం డ్యామ్‌ 10 గేట్లను 30 అడుగుల పైకెత్తడంతో కృష్ణా నది పరవళ్లు తొక్కుతోంది. ఈ అందాలను తిలకించడానికి తెలంగాణ ప్రాంతం నుంచి భారీసంఖ్యలో సందర్శకులు తరలివచ్చారు. ఆనకట్ట మీదుగా శ్రీశైలం చేరుకోవడానికి వేలాది వాహనాలు రావడంతో ఘాట్‌ రోడ్డులో సుమారు 43 కిలోమీటర్ల మేర ట్రాఫిక్‌ స్తంభించింది.

శనివారం మధ్యాహ్నం 12 గంటలకు హైదరాబాద్‌ నుంచి బయలుదేరిన వారు అర్ధరాత్రి 2 గంటలకు శ్రీశైలం చేరుకున్నారు. ఫర్హాబాద్‌ నుంచి ట్రాఫిక్‌ జామ్‌ కావడంతో అనేకమంది హైదరాబాద్‌కు వెనుదిరిగారు. మిగిలిన వారు శ్రీశైలం చేరుకున్నా మల్లన్న దర్శనానికి నిరీక్షణ తప్పలేదు. శ్రీశైలంలోని ప్రధాన వీధులు, అంతర్గత రహదారులు సైతం భక్తులు, వాహనాలతో కిటకిటలాడాయి. ఉచిత దర్శనానికి ఏడు గంటలకు పైగా సమయం పట్టింది. ప్రత్యేక, అతి శీఘ్రదర్శనాలకు నాలుగు గంటలు పట్టింది. బ్రేక్‌ దర్శనానికి సైతం రెండు గంటలపాటు క్యూలో వేచి ఉండక తప్పలేదు. శ్రావణ మాసంలో ఒకే రోజున లక్షన్నరకు పైగా భక్తులు శ్రీశైలం రావడం ఇదే ప్రథమమని ఆలయ ఉద్యోగులు తెలిపారు. (చదవండి: ఎన్నాళ్లకెన్నాళ్లకు.. జలకళాంధ్ర..)

శ్రీశైలం డ్యామ్‌ దగ్గర సందర్శకుల సందడి

(ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి)

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top