కర్నూలుకు చెందిన తొలితరం ప్రముఖ రచయిత శ్రీరాగి(89) సోమవారం రాత్రి 9 గంటలకు కర్నూలులోని ఒక ప్రైవేటు వైద్యశాలలో కన్నుమూశారు.
	కర్నూలు: కర్నూలుకు చెందిన తొలితరం ప్రముఖ రచయిత శ్రీరాగి(89) సోమవారం రాత్రి 9 గంటలకు కర్నూలులోని ఒక ప్రైవేటు వైద్యశాలలో కన్నుమూశారు. శ్రీరాగి అసలు పేరు కోపల్లె పూర్ణచంద్ర సదాశివ సుబ్రహ్మణ్యేశ్వరరావు. అయితే, శ్రీరాగి అనే కలం పేరుతో ప్రసిద్ధ రచయితగా ఖ్యాతి గడించారు. ఈయన పలు తెలుగు, ఆంగ్ల నవలలు, కథానికలు రచించారు.
	
	మధ్యతరగతి జీవుల కడగండ్లను అక్షరీకరించిన శ్రీరాగి.. కథానికలతో తన సాహితీ ప్రస్థానాన్ని ప్రారంభించి ఆంగ్ల నవలలు రాసే వరకు విస్తరించారు. 1927లో జన్మించిన ఈయన ఉద్యోగ రీత్యా కర్నూలు వైద్య కళాశాలలో అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్‌గా పనిచేసి పదవీ విరమణ పొందారు.
	
	ఈయన రచనల్లో.. విభిన్న స్వరాలు, అధికారం-అంధత్వం, బదిలీ, శుభలేఖ, సగటు ఉద్యోగి, ఆత్మావలోకనం, బ్రతుకు వరం అనే నవలలు పేరొందాయి. విభిన్న స్వరాలు నవలకు భరాగో అవార్డు లభించింది. శ్రీరామ శతకాన్ని కూడా ఈయన రచించారు. శ్రీరాగి మృతి పట్ల రచయితలు వేదగిరి రాంబాబు, కలిమి శ్రీ, కర్నూలు తెలుగు రచయితల సంఘం, సాహితీ సంస్థల నిర్వాహకులు, రచయితలు సంతాపం వ్యక్తం చేశారు.

 
                                                    
                                                    
                                                    
                                                    
                                                    
                        
                        
                        
                        
                        
