సాక్షి, అమరావతి: ప్రముఖ వ్యవసాయ శాస్త్రవేత్త, పద్మశ్రీ డాక్టర్ ఐవీ సుబ్బారావు పేరిట ఏర్పాటు చేసిన రైతునేస్తం పురస్కారాలను ఈనెల 7న హైదరాబాద్ సమీపంలోని ముచ్చింతల్‌లో ఉన్న స్వర్ణభారత్ ట్రస్ట్‌లో అందజేయనున్నట్టు రైతునేస్తం ఫౌండేషన్ చైర్మన్ యడ్లపల్లి వెంకటేశ్వరరావు గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. ఉదయం 9.30 గంటలకు జరిగే అవార్డుల బహూకరణ కార్యక్రమానికి ఉపరాష్ట్రపతి ఎం.వెంకయ్యనాయుడు హాజరుకానున్నారు.
వ్యవసాయం, అనుబంధ రంగాల్లో ప్రతిభ కనబరిచిన శాస్త్రవేత్తలు, అభ్యుదయ రైతులు, విస్తరణ అధికారులు, అగ్రిజర్నలిస్టులను ఈ సందర్భంగా సత్కరించనున్నారు. పురస్కార గ్రహీతల్లో ప్రముఖ ఆరోగ్య ఆహార నిపుణుడు డాక్టర్ ఖాదర్ వలీ, తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం వైస్ చాన్స్‌లర్ డాక్టర్ వెల్చాల ప్రవీణ్‌రావు, సాక్షి దినపత్రిక సంపాదకులు వి.మురళి, పలువురు వ్యవసాయ రంగ నిపుణులు, రైతులు ఉన్నారు.