విద్యుత్ ఉద్యోగుల నిరవధిక సమ్మె ప్రజా జీవితాన్ని అతలాకుతలం చేసింది. విశాఖ నుంచి వివిధ ప్రాంతాలకు బయల్దేరే అనేక ఎక్స్‌ప్రెస్ రైళ్లతో పాటు
విశాఖపట్నం - సాక్షి ప్రతినిధి : విద్యుత్ ఉద్యోగుల నిరవధిక సమ్మె ప్రజా జీవితాన్ని అతలాకుతలం చేసింది. విశాఖ నుంచి వివిధ ప్రాంతాలకు బయల్దేరే అనేక ఎక్స్‌ప్రెస్ రైళ్లతో పాటు, ప్యాసింజర్ రైళ్లన్నీ రద్దయ్యాయి. విమానాల రాకపోకల మీద కూడా విద్యుత్ సమ్మె ప్రభావం చూపింది. విశాఖ నగరం సహా జిల్లా మొత్తం తాగునీటి సరఫరా స్తంభించి జనం ఇక్కట్లకు గురయ్యారు. ఐటీ ఉత్పత్తులు కుప్ప కూలాయి. విశాఖ పోర్టుకు కూడా విద్యుత్ సమ్మె తగిలే ప్రమాదం ఏర్పడింది. స్టీల్‌ప్లాంట్‌లో పరిస్థితి ఘోరంగా మారి ఉత్పత్తి హీన దశకు చేరింది. విశాఖ నగరం సహా, పట్టణాలు, పల్లెలన్నీ గాఢాంధకారంలో కొట్టుమిట్టాడాయి. ప్రభుత్వ వైద్య శాలలు సమ్మె దెబ్బకు చీకటిమయమయ్యాయి. వ్యాపార, వాణిజ్య సముదాయాలు సాయంత్రం 6 గంటలకే మూత పడగా, నివాస గృహాల్లో కొవ్వొత్తుల వెలుగులు మాత్రమే కనిపించాయి. మంగళవారం నుంచి డొంకరాయి విద్యుత్ ఉత్పత్తి కేంద్రం ఉద్యోగులు కూడా సమ్మె బాట పడుతున్నారు. మన రాష్ర్టంలో జరుగుతున్న సమ్మె దెబ్బకు పొరుగునే ఉన్న మాచ్‌ఖండ్ విద్యుదుత్పత్తి కేంద్రంలో మూడు యూనిట్లు ట్రిప్ అయ్యాయి.
ఎక్కడి రైళ్లక్కడే... : వాల్తేర్ రైల్వే డివిజన్‌కు అవసరమైన విద్యుత్ అందకపోవడంతో విశాఖపట్నం -కోరాపుట్, విశాఖపట్నం - రాయగడ , విశాఖపట్నం- పలాస, విశాఖపట్నం - దుర్గ్, విశాఖపట్నం- రాయ్‌పూర్, విశాఖపట్నం- విజయనగరం, రాజమండ్రి- విశాఖపట్నం, భువనేశ్వర్- విశాఖపట్నం, విశాఖపట్నం- రాజమండ్రి, విశాఖపట్నం- మచిలీపట్నం, విశాఖపట్నం - విజయవాడ, విశాఖపట్నం- కాకినాడ ప్యాసింజర్ రైళ్లను రద్దు చేశారు. ఈ రైళ్లను మంగళవారం కూడా రద్దు చేశారు. భువనేశ్వర్- విశాఖపట్నం రైలు సోం పేట వరకు, పూరి- గున్‌పూర్ ప్యాసింజర్‌ను రాంభా వరకు మాత్రమే డీజిల్ ఇంజిన్లతో నడిపారు. విశాఖపట్నంలో మధ్యాహ్నం 1-35కు బయల్దేరిన విశాఖ- విజయవాడ రత్నాచల్ రైలు కిలోమీటరు దూరం వెళ్లి సాయంత్రం 4-30 గంటలకు మళ్లీ విశాఖ స్టేషన్‌కు వచ్చింది. ఈ రైలుకు డీజిల్ ఇంజన్ అమర్చడంతో సాయంత్రం 5-20 గంటలకు విజయవాడకు బయల్దేరింది. భువనేశ్వర్- బెంగళూరు మధ్య నడిచే ప్రశాంతి ఎక్స్‌ప్రెస్ రైలు నాలుగు గంటల 40 నిమిషాలు ఆలస్యంగా నడిచింది.
దువ్వాడ వద్ద విద్యుత్ సరఫరాలో సమస్య తలెత్తడంతో సుమారు గంట పాటు ఆగిపోయింది. ముంబయి నుంచి భువనేశ్వర్ వస్తున్న కోణార్స్ ఎక్స్‌ప్రెస్ పాయకరావుపేట రైల్వే గేట్ వద్ద సుమారు గంట పాటు ఆగిపోయింది. హౌరా- యశ్వంత్ పూర్ రైలు విశాఖకు ఉదయం 10.40 గంటలకు రావాల్సి ఉండగా రాత్రి 7 గంటలు దాటినా రాలేదు. యశ్వంత్ పూర్ - హౌరా రైలు మధ్యాహ్నం 3.55 గంటలకు విశాఖ రావాల్సి ఉండగా ఆ రైలుది కూడా అదే పరిస్థితి. విశాఖ- తిరుపతి మధ్య నడిచే తిరుమల ఎక్స్‌ప్రెస్ మధ్యాహ్నం 2 గంటలకు బయల్దేరాల్సి ఉండగా సాయంత్రం 5.20 గంటలకు బయల్దేరింది. విశాఖపట్నం- నిజాముద్దీన్ లింక్ ఎక్స్‌ప్రెస్ కూడా మూడున్నర గంటలు ఆలస్యంగా నడిచింది. విశాఖ- హైదరాబాద్ మధ్య నడిచే గోదావరి, గరీబ్థ్ రైళ్లను డీజిల్ ఇంజన్లతో నడిపారు.
రైళ్ల రద్దు : మంగళవారం విశాఖ- భువనేశ్వర్ మధ్య నడిచే ఇంటర్‌సిటీ (రెండువైపులది) భువనేశ్వర్- సికింద్రాబాద్ మధ్య నడిచే విశాఖ ఎక్స్‌ప్రెస్, భువనేశ్వర్- పాండిచ్చెరి ఎక్స్‌ప్రెస్ రైళ్లు రద్దు చేసినట్టు రైల్వే పీఆర్వో జయరాం తెలిపారు. విశాఖ నుంచి బయలు దేరాల్సిన జన్మభూమి, సింహాద్రి, రత్నాచల్, తిరుమల, దక్షిణ్, లింక్, గరీభ్థ్, దురంతో, విశాఖ-నాన్‌దెడ్, కెఆర్‌పీయు-విశాఖ ఇంటర్‌సిటీ ఎక్స్‌ప్రెస్‌లు మంగళవారం రద్దయినట్టు రైల్వే అధికారులు ప్రకటించారు.