అనంతపురం జిల్లా బండ్లపల్లిలో ఫిబ్రవరి 2న జరిగే ఉపాధి కూలీల భరోసా సభను జయప్రదం చేయాలని ప్రదేశ్
విజయవాడ బ్యూరో: అనంతపురం జిల్లా బండ్లపల్లిలో ఫిబ్రవరి 2న జరిగే ఉపాధి కూలీల భరోసా సభను జయప్రదం చేయాలని ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు ఎన్.రఘువీరారెడ్డి పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. ఏఐసీసీ ఉపాధ్యక్షుడు రాహుల్‌గాంధీ, కేంద్ర మాజీమంత్రులు, పార్టీ ప్రముఖులు హాజరవుతున్న బండ్లపల్లి సభ జాతీయస్థాయిలో జరుగుతుందన్నారు. పదేళ్ల కిందట ఉపాధి హామీ పథకాన్ని ప్రధాని మన్మోహన్‌సింగ్, సోనియాగాంధీలు బండ్లపల్లిలోనే ప్రారంభించారనీ, ఫిబ్రవరి 2న మరోసారి అదేగ్రామంలో పథకం అమలు తీరుపై పూర్తిస్థాయి సమీక్ష నిర్వహించాలన్న ఉద్దేశంతో చలో బండ్లపల్లి కార్యక్రమాన్ని ఏర్పాటు చేశామన్నారు. గురువారం సాయంత్రం విజయవాడ ఆంధ్రరత్న భవన్‌లో జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. రాష్ట్రంలో ఉపాధిహామీ పథకం అమలు పూర్తిగా గాడితప్పిందనీ, పథకం ద్వారా మంజూరయ్యే నిధులను టీడీపీ కాంట్రాక్టర్లు కోట్లకు కోట్లు దోచుకుంటున్నారన్నారు.
ఉపాధి హామీ పథకం పనుల్లో భారీ మిషన్లు స్వైరవిహారం చేస్తున్నాయనీ, కూలీలకు దక్కాల్సిన సొమ్ములు కాంట్రాక్టర్ల జేబుల్లోకి వెళ్తున్నాయని ఆరోపించారు. సోషల్ ఆడిట్ లేకుండా పోయిందనీ, పథకం నీరుగారిన నేపథ్యంలో రాష్ట్రంలోని 15నుంచి 20 లక్షల మంది కూలీలు వలసలు వెళ్లారన్నారు. ఉపాధి హామీ పథకంలో పనిచేసే 7వేల మంది ఫీల్డు అసిస్టెంట్లను తొలగించిన ప్రభుత్వం జన్మభూమి కమిటీల పర్యవేక్షణ పేరుతో దళారుల వ్యవస్థను బలోపేతం చేసిందన్నారు. ఈ నేపథ్యంలో బండ్లపల్లి సభ ద్వారా పథకం అమలుపై పూర్తిస్థాయి సమీక్ష నిర్వహించి ఉపాధి కూలీలకు భరోసా కల్పిస్తామని రఘువీరా చెప్పారు. పార్టీశ్రేణుల సమీకరణలో భాగంగా గురువారం విశాఖపట్నం నుంచి నెల్లూరు వరకూ ఉన్న వివిధ జిల్లాల పార్టీ అధ్యక్షులతో నేరుగా మాట్లాడడం జరిగిందన్నారు. విలేకరుల సమావేశంలో టీటీడీ మాజీ చైర్మన్ కనుమూరి బాపిరాజు, కృష్ణా, గుంటూరు, ప్రకాశం జిల్లాల పార్టీ అధ్యక్షులు కడియాల బుచ్చిబాబు, మక్కెన మల్లికార్జునరావు, ఉగ్రనరసింహారెడ్డి, పార్టీ నేతలు మల్లాది విష్ణు, కొలనుకొండ శివాజీ, వినయ్‌కుమార్, సుంకర పద్మశ్రీ పాల్గొన్నారు.