సచివాలయ ఉద్యోగాలకు రేపు నోటిఫికేషన్‌

Notification for Secretariat jobs on 10-01-2020 - Sakshi

ప్రస్తుతం 15,971 పోస్టులు 

మరో 3 వేలకు పైగా పోస్టులు పెరిగే అవకాశం 

పాత పద్ధతి, మార్గదర్శకాలే వర్తింపు.. పంచాయతీరాజ్‌ శాఖ ద్వారా భర్తీ ప్రక్రియ

సాక్షి, అమరావతి: గ్రామ, వార్డు సచివాలయాలకు సంబంధించి 15,971 పోస్టుల భర్తీకి శుక్రవారం నోటిఫికేషన్‌ విడుదల కానుంది. పాత పద్ధతి, మార్గదర్శకాల ప్రకారమే భర్తీ ప్రక్రియ కొనసాగుతుందని అధికారులు చెబుతున్నారు. గ్రామ, వార్డు సచివాలయాల్లో మొత్తం 19 రకాల ఉద్యోగాలు ఉండగా, వాటిలో ఏ పోస్టుకు ఎన్ని ఖాళీలు ఉన్నాయన్న వివరాలను ఆయా శాఖల నుంచి పంచాయతీరాజ్‌ శాఖ బుధవారం తెప్పించుకుంది.

వీటిలో అత్యధికంగా 6,916 పశు సంవర్ధక శాఖ అసిస్టెంట్‌ పోస్టులు ఉన్నట్లు అధికార వర్గాలు వెల్లడించాయి. గ్రామ ఉద్యాన అసిస్టెంట్‌ పోస్టులు 1,746, విలేజీ సర్వేయర్‌ పోస్టులు 1,234, పంచాయతీ డిజిటల్‌ అసిస్టెంట్‌ పోస్టులు 1,122 చొప్పున ఈ నోటిఫికేషన్‌ ద్వారా భర్తీ చేసే అవకాశం ఉందని సమాచారం. గత ఏడాది ఆగస్ట్‌–సెప్టెంబర్‌ మధ్య జరిగిన నియామక ప్రక్రియలో దాదాపు 15,971 పోస్టులు భర్తీ కాకుండా మిగిలిపోగా, ఆ పోస్టులను ఈ నోటిఫికేషన్‌ ద్వారా భర్తీ చేయనున్నారు. 

3 వేలకు పైగా పోస్టులు అదనం
రాష్ట్రంలో ప్రస్తుతం ఉన్న గ్రామ సచివాలయాలకు అదనంగా మరో 300 నూతన సచివాలయాల ఏర్పాటుకు ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశించారు. దీంతో మరో 3 వేలకు పైగా సచివాలయ ఉద్యోగాల భర్తీకి కూడా ప్రభుత్వం ఆమోదం తెలిపే అవకాశం ఉందని అధికారులు భావిస్తున్నారు. నోటిఫికేషన్‌ వెలువడిన తర్వాత కొత్త పోస్టుల భర్తీకి ప్రభుత్వం ఆమోదం తెలిపినా.. వాటిని కూడా ఈ నోటిఫికేషన్‌ ద్వారానే భర్తీ చేసే అవకాశం ఉంటుందని చెబుతున్నారు. 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top