రిమ్స్‌లో అన్నీ అగచాట్లే

No Facilities In Kadapa Rajiv Gandhi Institute Of Medical Sciences - Sakshi

సాక్షి, కడప : కడపలో ఉన్న రిమ్స్‌లో అనేక సమస్యలు రాజ్యమేలుతున్నాయి. రిమ్స్‌కు వెళ్లిన రోగులకు సంబంధించి ఓపీ దగ్గరి నుంచి వైద్య సేవలు పొంది ఇంటికి వచ్చేంతవరకు అన్నీ అగచాట్లే. ఒకప్పుడు కడప నుంచి రిమ్స్‌ వరకు ఉచిత బస్సులు ఉండేవి. అవీ లేవు. ఎన్నో ప్రయాసలు కోర్చి ఆస్పత్రికి వెళ్లినా, అక్కడ కూలైన్లలో ఓపీ తీసుకోవడంలోనే సగం ప్రాణం పోతుంది.

తర్వాత మళ్లీ డాక్టర్‌ వద్ద వైద్య పరీక్షలనంతరం నేరుగా రక్త, ఇతర పరీక్షలకు వెళితే అక్కడ క్యూలైన్లు.. మళ్లీ వాటి రిపోర్టుల కోసం మధ్యాహ్నం వరకు వేచి ఉండాల్సిన పరిస్థితి. ఇలా ఒకటేమిటి అనేక రకాల సమస్యలు వేధిస్తున్నాయి. పైగా ఐపీలో లిఫ్ట్‌లు కూడా పనిచేయకపోవడంతో రోగులను తిప్పలు తప్పడం లేదు. చివరికి రోగులను తరలించే వీల్‌ ఛైర్లు కూడా ఒక్కోసారి అందుబాటులో లేకపోవడంతో రోగులను బంధువులే ఎత్తుకుని వెళుతున్న దృశ్యాలు ‘సాక్షి’ కంటపడ్డాయి.

పేరుకే సూపర్‌ స్పెషాలిటీ
రిమ్స్‌ పేరుకే సూపర్‌. కానీ స్పెషాలిటీలో లేదు. సూపర్‌ స్పెషాలిటీకి సంబంధించి విభాగాలే ఇంతవరకు ఏర్పాటు కాలేదు. సూపర్‌ స్పెషాలిటీ వైద్యులు కూడా అందుబాటులో లేరు. అనేక రకాల పరికరాలు కూడా రిమ్స్‌కు రావాల్సి ఉంది. సామగ్రి లేకపోవడంతోనే ఇక్కడి నుంచి ప్రమాదకర పరిస్థితుల్లో రోగిని ఇతర ప్రాంతాలకు రెఫర్‌ చేయాల్సి వస్తోందని వైద్యులు పేర్కొంటున్నారు. ప్రతిరోజు 1,800 నుంచి 2,000 మంది వివిధ ప్రాంతాల నుంచి రోగులు వస్తున్నారు. ఆర్థోపెడిక్‌కు సంబంధించి సోమవారం దాదాపు 215 మంది రిమ్స్‌కు రాగా, జనరల్‌ మెడిసిన్‌కు సంబంధించి 202 మంది, గైనకాలజీకి సంబంధించి 140, చర్మవ్యాధులకు సంబంధించి 115, కంటి వ్యాధిగ్రస్తులు 110 మంది వచ్చారు. ఆపరేషన్లకు సంబంధించి గైనకాలజీ, ఆర్థోపెడిక్, జనరల్‌ సర్జరీ, ఈఎన్‌టీ, ఆప్తాలమిక్‌ తదితర వాటికి ఆపరేషన్లు అనుకున్న సమయానికే జరిగిపోతున్నాయి.

ప్రతిరోజు ఆస్పత్రులకు 13వేల మంది రోగులు
జిల్లాలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, కమ్యూనిటీ హెల్త్‌ సెంటర్లు, 24 గంటల ఆస్పత్రులు, రిమ్స్, జిల్లా ఆస్పత్రి, ఏరియా ఆస్పత్రులకు దాదాపు ప్రతిరోజు 12 వేల నుంచి 13 వేల మంది రోగులు వస్తున్నారు. వివిధ రకాల జబ్బులతో అల్లాడుతున్న బాధితులతోపాటు ప్రతినిత్యం జలుబు, జ్వరం, కీళ్ల నొప్పులు, కాళ్ల నొప్పులతోపాటు ఇతర సమస్యలతో రోజూ భారీగా ఆస్పత్రులకు వెళుతున్నారు. అయితే వచ్చిన రోగులందరినీ పరీక్షిస్తున్నా నాణ్యమైన వైద్య సేవలు అందడం గగనంగా మారింది.

మంచినీటికి నోచుకోని జిల్లా ఆస్పత్రి
ప్రొద్దుటూరులోని జిల్లా ఆస్పత్రి మండు వేసవిలో గుక్కెడు నీటి కోసం అల్లాడిపోతోంది. మంచినీటి కోసం బయటికి రోగులు పరుగులు పెడుతున్నారు. ఎందుకంటే ఆస్పత్రిలో మంచినీటి ట్యాంకు మరమ్మత్తులకు గురి కావడంతో ప్రస్తుతం ఇబ్బందులు పడుతున్నారు. పైగా డాక్టర్లు కూడా సమయపాలన పాటించడం లేదు. సివిల్‌ సర్జన్ల కొరత కూడా ఆస్పత్రిని వెంటాడుతోంది. కొన్ని మందులు బయటికి రాసిస్తున్నారు. పులివెందుల ఏరియా ఆస్పత్రిలో కూడా రోగులకు మధ్యాహ్న భోజనం అందడం లేదు. కాంట్రాక్టర్‌ ముందుకు రాకపోవడంతో పరిస్థితి అధ్వానంగా మారింది. ఈసీజీ మిషన్‌ కూడా చెడిపోవడంతో ఇబ్బందులు తప్పడం లేదు.

ఐవీ సెట్లు కనబడవు....ఐరన్‌ మాత్రలూ లేవు
జిల్లాలోని రాజంపేట సామాజిక ఆరోగ్య కేంద్రాన్ని కోట్లాది రూపాయలతో నిర్మించినా ఇప్పటికీ ప్రారంభం కాకపోవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ప్రధానంగా డాక్టర్‌ వద్దకు వెళ్లాలన్నా, ఓపీ తీసుకోవాలన్నా ఎండలోనే రోగులకు తిప్పలు తప్పడం లేదు. బడ్జెట్‌ కొరత కారణంగా మందులు కూడా అంతంతమాత్రంగానే వచ్చినట్లు పలువురు పేర్కొంటున్నారు. ప్రస్తుతం ఆస్పత్రుల్లో ఐవీసెట్లు లేవు. ఐరన్‌ మాత్రలు కూడా అందుబాటులో లేవు. దీంతో రోగులకు తిప్పలు తప్పడం లేదు. తాగునీరు కూడా అందుబాటులో లేకపోవడంతో సమస్య జఠిలంగా మారింది. మొత్తానికి ఆస్పత్రి అస్తవ్యస్తంగా మారిందని, బాగు చేయాలని రోగులు కోరుతున్నారు.

  • బద్వేలులో కూడా వైద్యుల కొరత వెంటాడుతోంది. ప్రభుత్వ ఆస్పత్రిని ప్రస్తుతం సీమాంక్‌ కేంద్రంలోనే నడుపుతున్నారు.
  • రైల్వేకోడూరు 30పడకల ఆస్పత్రిలో చిన్నపిల్లల వార్డు కోసం లక్షలు వెచ్చించి నిర్మించినా వైద్యుడు లేకపోవవడంతో ప్రారంభించలేదు. ఎక్స్‌రే ప్లాంటు ఉన్నా మూలనపడింది.
  • జమ్మలమడుగు ఆస్పత్రి నుంచి చిన్నచిన్న సమస్యలకు సైతం రోగులను రెఫర్‌ చేస్తున్నారు. గైనకాలజీ, అనస్తిషియా వైద్యులు లేకపోవడంతో ఇబ్బందులు తప్పడం లేదు. రేడియాలజిస్టు లేరు. మంత్రి నియోజకవర్గంలోని ఆస్పత్రిలో సమస్యలను పట్టించుకునేవారే లేరు.
  • రాయచోటి ఆస్పత్రిలో కూడా వసతులు అరకొరగానే ఉన్నాయి. పేరుకు 50 పడకల ఆస్పత్రి అయినా వంద పడకల ఆస్పత్రిలాగా రోగులతో కిటకిటలాడుతూ ఉంటుంది. పారిశుధ్యం అధ్వానంగా ఉంది. సమీప ప్రాంతంలో కుక్క చనిపోయి రెండు రోజులు కావడంతో దుర్వాసన వస్తున్నా పట్టించుకునే నాథుడే లేడు.
  • కమలాపురంలో 30 పడకల ఆస్పత్రి ఉన్నా చిన్నపిల్లలు, అనస్తీషియా, గైనకాలజీ వైద్యులు లేకపోవడంతో ప్రజలకు ఇబ్బందులు తప్పడం లేదు. ఎక్స్‌రే కూడా లేదు. రోగులు అధికంగా ఉన్నా అనువైన వసతులు లేవని లబోదిబోమంటున్నారు. పూర్తిస్థాయిలో వైద్యులను నియమిస్తే మారుమూల ప్రాంతాల నుంచి వచ్చే రోగులకు సౌకర్యవంతంగా ఉంటుంది.
  • మైదుకూరులో ఆస్పత్రి ఆధునీకరిస్తుండడంతో పక్కన గదుల్లో వైద్యం అందిస్తున్నారు. ఆస్పత్రి నిర్మాణం పూర్తికాకపోవడంతో ప్రస్తుతం కాన్పులకు ఇబ్బందిగా మారింది. ఆరుగురు వైద్యులు ఉండాల్సి ఉండగా, కేవలం ఇద్దరే ఉన్నారు. ఇక 24 గంటల ఆస్పత్రిగా పేరొందిన వనిపెంట ఆస్పత్రిలో అయితే ఒకే ఒక వైద్యుడు ఉంటారు. రోగులు అధిక సంఖ్యలో వస్తుండడంతో రోగులను పరీక్షించం కష్టంగా మారుతోంది.

స్కానింగ్‌కు బయటకు..
ప్రత్యేకంగా ఎప్పటినుంచో రిమ్స్‌కు ఎంఆర్‌ఐ స్కానింగ్‌ వస్తుందంటున్నా ఇప్పటికీ కనిపించడం లేదు. పైగా ఎంసీఐ నిబంధనల ప్రకారం ఒక సూపర్‌ స్పెషాలిటీ ఆస్పత్రిలో ఖచ్చితంగా ఎంఆర్‌ఐ స్కానింగ్‌ సెంటర్‌ ఉండాల్సి ఉన్నా ఇప్పటికీ అతీగతి లేదు. సిటీ స్కానింగ్‌ ఉన్నా పనిచేయడం లేదు. ఆర్‌ఎంఓ నుంచి ఇప్పటివరకు కొన్నివేల స్కానింగ్‌లు నిర్వహించారు. అది మరమ్మతులకు గురికావడంతో నెల కిందటి నుంచి సిటీ స్కాన్‌ పనిచేయడం లేదు. దీంతో రోగులను ఆరోగ్యశ్రీ ద్వారా బయటికి పంపి స్కానింగ్‌లు చేస్తున్నారు.

సీటీస్కాన్‌ పనిచేయడం లేదంటూ బోర్డు ఏర్పాటు

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top