మేమేసిన రోడ్లపై నడవొద్దు

MLA DBV Swamy Threats To YSRCP Activists In Prakasam - Sakshi

గ్రామదర్శినిలో ఎమ్మెల్యే డీబీవీ స్వామి గుస్సా..

రుణమాఫీ కాలేదన్నందుకు రైతులపై ఆగ్రహం

దిక్కున్న చోట చెప్పుకోండంటూ హెచ్చరిక

మీరు మా పార్టీ వారు కాదు..మీరు మాకు ఓట్లు వేయలేదు..మీకు సమాధానం చెప్పాల్సినఅవసరం నాకు లేదు..అసలు నేను వేయించిన రోడ్లపై నడవొద్దు..మీకు దిక్కున్నచోట చెప్పుకోండి.
ఇది సమస్యల పరిష్కారం కోరుతూ తన వద్దకు వచ్చిన రైతులపై కొండపి శాసన సభ్యుడు స్వామి చేసిన వ్యాఖ్యానాలివి. పొన్నలూరు మండలం పెదవెంకన్నపాలెంలో శుక్రవారం జరిగిన గ్రామదర్శిని–గ్రామ వికాసం కార్యక్రమంలో ఈ ఘటన చోటు చేసుకుంది.

ప్రకాశం, పెద వెంకన్నపాలెం(పొన్నలూరు): గ్రామదర్శిని–గ్రామ వికాసం కార్యక్రమంలో పాల్గొనేందుకు కొండపి ఎమ్మెల్యే డోలా బాలవీరాంజనేయస్వామి శుక్రవారం మండలంలోని పెదవెంకన్నపాలెం వెళ్లారు. ఈ సందర్భంగా గ్రామానికి చెందిన నల్లూరి రమేష్‌తో పాటు పలువురు రైతులు తమకు రుణమాఫీ డబ్బులు బ్యాంకు ఖాతాలకు జమ కాలేదని ఎమ్మెల్యేను ప్రశ్నించారు. దీనికి ఆయన ఒక్కసారిగా ఫైర్‌ అయ్యారు.ఇది ప్రభుత్వ కార్యక్రమం కాదు పార్టీ కార్యక్రమమని, తాను మీకు సమాధానం చెప్పాల్సిన అవసరం లేదంటూ వారిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. మీరు అసలు మా పార్టీ వారు కాదంటూ అని పరుష పదజాలంతో వాడు, వీడు అంటూ దూషించారు. మీకు దిక్కున్న వారికి చెప్పుకోండన్నారు.

పైగా మీరు మాకు ఓటు కూడా వేయలేదని ఎదురు ప్రశ్నించారు. దీనిపై రైతులు మాట్లాడుతూ మీరు నియోజకవర్గ ప్రజాప్రతినిధి అయి ఉండి సమస్యలను పరిష్కరించమని మీ దృష్టికి తీసుకుని వస్తే ఈ విధంగా మాపై ఆగ్రహం వ్యక్తం చేయడమేమనిటని నిలదీశారు. తరువాత ఈ సంఘటనను చిత్రీకరిస్తున్న వారిపై,  ప్రశ్నించిన వారిపై పోలీసులను ఎమ్మెల్యే ఉసిగొల్పి వారి నోరు నొక్కే ప్రయత్నం చేశారు. సమస్యలను పరిష్కరించాలని అడిగిన  గ్రామస్తులకు పార్టీలను అంటగడుతూ మీరు నాకు ఓటు వేయలేదు. నేను వేసిన రోడ్ల పై మీరు నడవద్దంటూ ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎమ్మెల్యే ఇటువంటి వ్యాఖ్యలు చేయడంతో అధికార పార్టీ నాయకులు సైతం విస్మయం వ్యక్తం చేశారు. నీవేమైనా సొంత డబ్బులతో రోడ్లేశావా ప్రజల సొమ్ముతో వేసిన రోడ్ల పై నడవద్దని ఎలా చెప్తావని ప్రజలు ఎమ్మెల్యే పై తమ ఆగ్రహం వెళ్లగక్కారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ వీరకుమారి, మాజీ ఎంపీపీ కొండ్రగుంట శ్రీనివాసరావు, కర్ణా కోటిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top