కండీషన్ తప్పుతోంది | Missing condition | Sakshi
Sakshi News home page

కండీషన్ తప్పుతోంది

Mar 15 2016 2:27 AM | Updated on Sep 3 2017 7:44 PM

కండీషన్ తప్పుతోంది

కండీషన్ తప్పుతోంది

పోలీసులకు పట్టబడ్డ తర్వాత కూడా ‘ఎర్ర’ స్మగ్లర్లు కొత్త ఎత్తులు వేసి స్మగ్లింగ్ కొనసాగిస్తున్నారు.

తిరుపతి: పోలీసులకు పట్టబడ్డ తర్వాత కూడా ‘ఎర్ర’ స్మగ్లర్లు కొత్త ఎత్తులు వేసి స్మగ్లింగ్ కొనసాగిస్తున్నారు. ఎర్రచందనం అక్రమ రవాణాలో తెలుగుదేశం పార్టీ నాయకులు ప్రవేశించి స్మగ్లింగ్‌లో కొత్త దార్లు వెదుకుతున్నారు. ఇటీవల కాలంలో మహిళలను వాహనాల్లో ఉంచి ఫ్యామిలీ ప్రయాణం తరహాలో ఎర్ర దందా సాగిస్తున్న విషయం తెలిసిందే. సోమవారం కొత్త కోణం వెలుగులోకి వచ్చింది. సోమవారం మామండూరు సమీపంలో ఖరీదైన హోండా కారులో దుంగలను తరలించేందుకు సిద్ధం చేస్తుండగా టాస్క్‌ఫోర్స్ అధికారులు దాడిచేశారు. కారుతో పాటు, మూడు దుంగలను స్వాధీనం చేసుకున్నారు. ఓ వ్యక్తి పట్టుబడ్డాడు. ఏడుగురు పరారయ్యారు. పట్టుబడిన వ్యక్తిని విచారిస్తే ఆసక్తికరమైన అంశాలు వెలుగులోకి వచ్చాయి.

అతను తమిళనాడు విల్లుపురానికి చెందిన రాజా గుర్తించారు. గత సంవత్సరంలో ఎర్రచందనం అక్రమ రవాణా కేసులో అరెస్టయిన రాజా మూడు నెలలు జైలులో ఉన్నాడు. ఆ తర్వాత కండీషన్ బెయిలు పొందాడు. అతను నిర్ణీత సమయంలో తిరుపతి కపిలతీర్థం సమీపంలోని అటవీశాఖ కార్యాలయానికి వచ్చి  సంతకాలు పెట్టి వెళ్లాలి. ఇతను సంతకం పెట్టేందుకు వచ్చి అటునుంచి అటే అడవికి వెళ్లిపోయి యథావిధిగా ఎర్రచందనం స్మగ్లింగ్ చేస్తున్నాడు. స్మగ్లింగ్‌లో పట్టుబడిన వారికి సులభంగా బెయిలు వచ్చేందుకు కొంతమంది స్థానిక న్యాయవాదులు సహాయపడుతున్నట్లు టాస్క్‌ఫోర్స్ సిబ్బంది అనుమానం వ్యక్తంచేస్తున్నారు. రాజా తరహాలోనే వందలాది మంది కండీషన్ బెయిలుపై బయట ఉండి మళ్లీ ఎర్ర దందాలు పాల్గొంటున్నట్టు సమాచారం.
 
అడవికి నిప్పు పెట్టి..
అడవి నరికి పెట్టిన ఎర్రచందనం దుంగలను టాస్క్‌ఫోర్స్ సిబ్బంది కళ్లుగప్పి తరలించేందుకు కూలీలు కొత్త ఎత్తుగడ వేస్తున్నారని తెలిసింది. అడవికి నిప్పుపెట్టి అటవీశాఖ, టాస్క్‌ఫోర్స్ సిబ్బంది పక్కదారి పట్టించి దుంగలు తరలిస్తున్నారని టాస్క్‌ఫోర్స్ సిబ్బంది గుర్తించారు. దీంతో నిఘా మరింత పెంచారు. మరోవైపు అడవికి నిప్పు పెట్టడం వల్ల వన్యప్రాణులకు ముప్పు వాటిల్లుతుందని అటవీశాఖ సిబ్బంది ఆందోళన చెందుతున్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement