నేలరాలిన సాహితీ కుసుమం

Manapragada Shesa Sai Died With Illness inVizianagaram - Sakshi

 మధురవాచస్వి మానాప్రగడ శేషశాయి అస్తమయం

నివాళులర్పించిన ప్రముఖులు

నేడు అంత్యక్రియలు

విజయనగరం టౌన్‌:  సాహితీ కుసుమం నేలరాలింది. విజయనగర వాసుల ఆరాధ్య దైవం పైడితల్లి అమ్మవారి సిరిమాను తిరుగుతుంటే ఆయన వ్యాఖ్యానం లేనిదే ఆ మాను కదలదు.. తన ఆరోగ్యం సహకరించకపోయినా అమ్మవారి పండగలో వ్యాఖ్యానంతో పాటు  వేదాశీర్వచనాల ను చివరి వరకూ కొనసాగించారు.. ఎందరో సాహితీవేత్తలకు ఆయన ఆదర్శప్రాయుడు.. 13 ఏళ్లపాటు సంస్కృత విద్యను నేర్పించి, ఎందరో విద్యార్థులకు దిక్సూచీగా నిలిచిన మానాప్రగడ శేషశాయి (90) గొంతు మూగబోయింది. మంగళవారం వేకువజామున పూల్‌బాగ్‌లో ఉన్న ఆయన స్వగృహంలో అస్తమించారు. ఆయన మృతివార్త తెలుసుకున్న సాహితీవేత్తలు, అభిమానులు భౌతిక కాయాన్ని చూసేందుకు తరలివస్తున్నారు. బుధవారం ఆయన అంత్యక్రియలు నిర్వహించనున్నారు.

శేషశాయి జీవిత చరిత్ర ఇదీ...
పశ్చిమగోదావరి జిల్లా గుణపర్రులో సూరమ్మ, బాపిరాజు దంపతుల ద్వితీయపుత్రినిగా 1927 ఆగస్టు 14న మానాప్రగడ జన్మించారు. ఏలూరు, గుంటూరు, రాజమండ్రిలలో విద్యాభ్యాసం, నం తరం బెనారస్‌ విశ్వవిద్యాలయం నుంచి ఎంఏ పట్టా స్వీకరించారు. ఏలూరు, మద్రాసు, అనంతరం, కాకినాడ, రాజమండ్రి ప్రభుత్వ కళాశాలల్లో అధ్యాపకునిగా పనిచేశారు. 1966–79 వరకు విజయనగరం మహారాజా ప్రభుత్వ సంస్కృత కళాశాలలో ఆచార్య పదవిలో కొనసాగారు. జీవి తాన్ని కళాశాల అభివృద్ధికే అంకితం చేశారు. అధ్యాపకులు, వేదపండితులకు యూజీసీ స్కేల్‌ అమలుచేయడంలో ఆయన పోరాటం ఆదర్శనీ యం. 1969లో కళాశాల శతజయంతి ఉత్సవాన్ని పురప్రముఖుల సహాయ సంపత్తులతో నిర్వహించడం వారి కార్యనిర్వహణ దక్షతకు నిలువెత్తు దర్పణం. ఆయన హయాంలో డాక్టర్‌ సి.నారాయణరెడ్డి, విశ్వనాథ సత్యనారాయణ, మంగళంపల్లి బాలమురళీ కృష్ణ, వేదాంతం వంటి మహామహులు సత్కరించబడ్డారు. నాటి గవర్నర్‌ ఖండూబాయ్‌ దేశాయ్, రాష్ట్రపతి వీవీ గిరి, మాజీప్రధాని పీవీ నరసింహరావు (అప్పట్లో విద్యామంత్రిగా ఉన్నప్పుడు)  విజయనగర వైభవాన్ని చూసి శేషశాయికి మంగళాశాసనం చేశారు.  కవితాపరంగా చూస్తే సింహాచలేశునికి పద్యాల చలువగంధం పూసారు. అన్నవరం స్వామికి కవితా కల్హారాలు అర్పించారు. అరసవిల్లి సూర్యనారాయణమూర్తికి కావ్యోపహారంతో అలరించారు. చందస్సు సుందరమైన పద్యాన్ని రసభరితంగా రచించి సహృదయహృద్యంగా వినిపించడం ఆయన ఘనత.

సిరిమానోత్సవంలో ఆయన పాత్ర కీలకం..
విజయనగరంలో పైడితల్లి అమ్మవారి సిరిమాను సంబరం, తిరుపతి బ్రహ్మోత్సవాల కార్యక్రమాల వ్యాఖ్యానం శ్రోతృ కర్ణామృతంగా వినిపించడంలో ఆయనకు ఎవరూ సాటిలేరు.  అంబరాన్నంటే సంబరాలన్నా.. వెర్రిముండావాడన్నా, తెల్లారినట్లే ఉందన్న పదాలు వినిపిస్తే అవి మానాప్రగడ వ్యాఖ్యానాలు అని ఇట్టే చెప్పేయవచ్చు. 1989 జూన్‌ 25న మానాప్రగడ షష్టిపూర్తిని జిల్లా ప్రజలు ఘనంగా జరిపారు. ఆయన శ్రీ చందనం, సత్యదేవ శతకం, ఆంధ్రసాహిత్యంలో హాస్యం, శ్రీమల్లిఖార్జున శతకం, ప్రసన్న భాస్కరం, జయదేవ సరస్వతి, పైడితల్లి అమ్మవారి సుప్రభాతాలను రచించారు. నాలుగు దశాబ్దాలుగా మందార మకరంద సుందర పద ప్రబంధ సుగంధాలు వెదజల్లుతూ పైడితల్లిని సేవిస్తూ, అక్షర ప్రసూనాలతో అర్చిస్తూ, వాక్యాల చంద్రికలను కురిపిస్తూ అపర వ్యాసమహర్షిగా నిలిచారు. విజయాలకు గోపు రం.. పలుకుల చెలినూపురం అని రాసినా.. సాహిత్యం సంగీతం స్తంభేరమ స్వచ్ఛ యశోబింబం గంటస్తంభం అని రాసినా ఆ ఘనత ఆయనదే. సాహితీలోకానికి  ఆయన లేని లోటు తీరనిది.

నివాళులర్పించిన వారిలో...
మానాప్రగడ శేషశాయి మృతి పట్ల పలువురు కవులు, రచయితలు, సాహితీవేత్తలు తమ ప్రగాడ సంతాపాన్ని తెలిపారు. ఆంధ్రప్రదేశ్‌ గ్రంథాలయ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డాక్టర్‌ రావి శారద, రాష్ట్ర అధ్యక్షుడు  కె.చంద్రశేఖర్, కిన్నెర ఆర్ట్స్‌ థియేటర్స్‌ ప్రధాన కార్యదర్శి మద్దాళి రఘురామ్, దూరదర్శన్‌పూర్వ డైరెక్టర్‌ వోలేటి పార్వతీశం, కొవ్వలి లక్ష్మీనరసింహారావు, జిల్లా సాహితీవేత్తలు పి.లక్ష్మణరావు, ధవళ సర్వేశ్వరరావు, మండపాక రవి, మహారాజా ప్రభుత్వ సంస్కృత కళాశాల ప్రిన్సిపాల్‌ స్వప్నహైందవి,  బ్రాహ్మణసంఘ ప్రతినిధులు సాంబశివ శాస్త్రి ఉన్నారు.

మానాప్రగడ మృతి తీరనిలోటు
సాహితీవేత్త మానాప్రగడ శేషశాయి మృతి తీరనిలోటని జిల్లా సంయుక్త కలెక్టర్‌ కె.వెంకటరమణారెడ్డి, జెసి–2 జె.సీతారామారావులు సంతాపం వ్యక్తం చేశారు. మంగళవారం ఆయన స్వగృహానికి వెళ్లి ఆయన భౌతిక కాయంపై పుష్పగుచ్చం ఉంచి శ్రద్ధాంజలి ఘటించారు.

బాధకలుగుతోంది
చదువుల తల్లి సిగ సిరిమల్లి, సంస్కృతాంధ్రాల్లో మకుటం లేని మహారాజు, మధురవచస్వి శేషశాయి తిరిగిరాని లోకాలకు తరలిపోవడం తెలుగు సాహితీ సరస్వతికి తీరనిలోటు. 2013లో తెలుగు భాషా పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో గిడుగు జయంతి, అదే ఏడాది అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవం రోజున తెలుగుభాష గొప్పతనాన్ని ఆయన విద్యార్థులకు వివరించారు.  2014లో కిన్నెర ఆర్ట్‌ థియేటర్స్‌ హైదరాబాద్, అలయన్స్‌ క్లబ్‌ సంయుక్తంగా  శేషసాయికి పానుగంటి లక్ష్మీనరసింహరావు స్మారక పురస్కారాన్ని ప్రదానం చేశాం.– సముద్రాల గురుప్రసాద్, తెలుగు భాషా పరిరక్షణ సమితి అధ్యక్షుడు

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top