నాగలి పట్టిన కుర్రాడు.. నేడు డీఎస్పీ

DSP Yegireddi Prasad Rao Success Strory In Vizianagaram - Sakshi

సివిల్స్‌ సర్వీసులపై మక్కువతో నిరంతర సాధన  

గ్రూప్స్‌లో మంచి ర్యాంక్‌ రావడంతో పోలీసు శాఖలో చేరా

వ్యవసాయం చేసి తల్లిదండ్రులు చదివించారు 

ప్రొద్దుటూరు డీఎస్పీ ఏగిరెడ్డి ప్రసాదరావు    

సాక్షి, ప్రొద్దుటూరు: ఆ యువకుడు సామాన్య రైతు కుటుంబంలో జన్మించాడు.. వారికున్న కొద్దిపాటి పొలంలో వ్యవసా యం చేసి కష్టపడి తల్లిదండ్రులు బాగా చదివించారు.. తన అభ్యున్నతి కోసం తండ్రి పడిన కష్టాలను చిన్నప్పటి నుంచి కళ్లారా చూశాడు ఆ యువకుడు. కుటుంబ పరిస్థితులు అతడిలో కసిని పెంచాయి. బాగా చదివి పది మందికి సాయం చేసే ఉద్యోగం పొందాలి... తల్లిదండ్రుల కళ్లల్లో ఆనందం చూడాలనుకున్నాడు. ఎంతో క్రమశిక్షణ.. అంతకు మంచి నిబద్ధతతో చదివాడు. నాడు నాగలి పట్టిన విజయనగరం కుర్రాడు నేడు లాఠీ పట్టాడు. ప్రొద్దుటూరు డీఎస్పీగా బాధ్యతలు చేపట్టిన ఏగిరెడ్డి ప్రసాదరావు గురించి ఆయన మాటల్లోనే.. 

రైతు కుటుంబం నుంచి... 
విజయనగరం జిల్లాలోని పార్వతీపురం సమీపంలో ఉన్న గుణానుపురం మా స్వగ్రామం. తల్లిదండ్రులు మహాలక్ష్మి, సత్యంనాయుడు. మేము ఇద్దరం అన్నదమ్ములం. మా అన్న శంకర్‌రావు ఎంబీబీఎస్‌ పూర్తి చేశాడు. ప్రస్తుతం సివిల్స్‌కు ప్రిపేర్‌ అవుతున్నాడు. గ్రామంలో ఆరు ఎకరాల పొలం ఉంది. వ్యవసాయమే మాకు జీవనాధారం. కొద్దిపాటి పొలంలో వ్యవసాయం చేసి మా తల్లిదండ్రులు మా ఇద్దరినీ చదివించారు. మేము నాన్నతో పాటు పొలం పనులు చేసేవాళ్లం. మా ఊళ్లోని ప్రభుత్వ హైస్కూళ్లో 10వ తరగతి వరకు చదివాను.

విజయవాడలోని గౌతమ్‌ కాలేజీలో ఇంటర్‌ పూర్తి చేశా ను. గౌహతిలోని ఐఐటీలో డిగ్రీ చదివాను. తర్వాత హైదరాబాద్‌లో సివిల్స్‌ కోచింగ్‌ తీసుకున్నాను. కుటుంబ పరిస్థితుల ప్రభావంతో సివిల్స్‌కు ప్రిపేర్‌ అయ్యాను, గ్రూప్స్‌లో మంచి ర్యాంక్‌ రావడంతో ఇష్టమైన పోలీసు శాఖలో చేరాను. 2018 బ్యాచ్‌లో డీఎస్పీగా ఎంపికై అనంతపురంలోని పీటీసీలో శిక్షణ పొందాను. డి్రస్టిక్ట్‌ ప్రాక్టికల్‌ ట్రైనింగ్‌ పూర్తిగా వైఎస్సార్‌ జిల్లాలోనే చేశాను. రాయచోటి, రైల్వేకోడూరు, పోరుమామిళ్ల, పులివెందులలో ట్రైనీ డీఎస్పీగా విధులు నిర్వర్తించా ను. అందువల్ల జిల్లాపై మంచి అవగాహన ఉంది.   

చట్టపరిధికి లోబడి పని చేస్తా 
పోలీసులు దురుసుగా ప్రవర్తిస్తారనే భావన చాలా మందిలో ఉంది. అలాంటి ఆలోచనలు పక్కన పెట్టాలని ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నాను. ఎలాంటి సమస్య వచ్చినా నేరుగా పోలీస్‌ స్టేషన్‌కు వచ్చి చెప్పుకోవచ్చు. నిష్పక్షపాతంగా విచారణ చేసి న్యాయం చేస్తాం. ఫ్రెండ్లీ పోలీసింగ్‌ మా విధానం. ప్రజల కోసమే పోలీసులు ఉన్నారు. సబ్‌డివిజన్‌లోని అన్ని గ్రామాలు తిరిగి స్వయంగా సమస్యలు తెలుసుకుంటాను అని డీఎస్పీ ప్రసాదరావు తెలిపారు. 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top