కరోనా డిశ్చార్జ్‌లు: కర్నూలు మొదటిస్థానం

Kurnool SP Fakirappa Comments On Coronavirus Lockdown - Sakshi

సాక్షి, కర్నూలు : జిల్లాలో 144 సెక్షన్ అమలులో ఉందని, కరోనా వైరస్‌ పాజిటివ్ కేసులు నమోదు కాని ప్రాంతంలో లాకడౌన్‌కు సంబంధించి సడలింపులు ఉన్నాయని జిల్లా ఎస్పీ డాక్టర్ ఫక్కిరప్ప తెలిపారు. సడలింపులు ఉన్నప్పటికి ఎలాంటి వేడుకలు, పండుగలను జరుపుకోకూడదని, అలా చేస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. పాజిటివ్ కేసులు నమోదైన ప్రాంతాల్లో ఎలాంటి సడలింపులు ఉండవని స్పష్టం చేశారు. లాక్‌డౌన్‌ను ఉల్లంఘించి సీజ్ అయిన వాహనాలను ఆదివారంనుంచి విడుదల చేస్తామని చెప్పారు.

కరోనా డిశ్చార్జ్‌లు: కర్నూలు మొదటిస్థానం
కరోనా వైరస్‌ బారినుంచి కోలుకుని ఆసుపత్రుల నుంచి డిశ్చార్జ్‌ అయిన వారి సంఖ్య పరంగా కర్నూలు జిల్లా మొదటి స్థానంలో.. పరీక్షలు చేయడంలో నాల్గవ స్థానంలో ఉందని జిల్లా కలెక్టర్ వీరపాండియన్ పేర్కొన్నారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. కర్నూలు జిల్లాలో ఇప్పటివరకు 608 పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయని తెలిపారు. ఇందులో 397 మంది డిశ్చార్జ్ అయ్యారని, 19 మంది చనిపోగా 199 పాజిటివ్ కేసులు యాక్టివ్‌గా ఉన్నాయని వెల్లడించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఇచ్చిన ఆదేశాల మేరకు పాజిటివ్ కేసు నమోదైన ప్రాంతాల్లో కంటైన్‌మెంట్ జోన్ ద్వారా ‌‌లాక్‌డౌన్‌ కొనసాగుతుందని చెప్పారు. ( ఆదోనిలో ‘కోయంబేడు’ కలకలం )

జిల్లాలో 50 కంటైన్‌మెంట్‌ క్లస్టర్లను ఏర్పాటు చేశామని, ఇందులో 9 క్లస్టర్ కంటైన్‌మెంట్‌ జోన్‌లలో 45 రోజుల నుండి యాక్టివ్  కేసులు లేక పోవడంతో 9 జోన్లలో లాక్‌డౌన్‌ ఎత్తి వేస్తున్నామని తెలిపారు. ఇతర క్లస్టర్‌లలో 20 రోజుల పాటు పాజిటివ్ కేసు నమోదు కాకపోతే అక్కడ కూడా లాక్‌డౌన్‌ సడలింపులు కొనసాగుతాయన్నారు. పాజిటివ్ కేసులు నమోదు అయిన ప్రదేశాలలో ఎలాంటి సడలింపులు ఉండవని స్పష్టం చేశారు.

కాగా, జిల్లాలోని నందికొట్కూరు రెడ్‌జోన్‌ ప్రాంతంలో శనివారం కేంద్ర కమిటీ బృందం పర్యటించింది. డా" మధు మిత దుబే ఆధ్వర్యంలోని ఈ బృందం హౌసింగ్ బోర్డ్ కాలనీలో కోవిడ్ -19 పై తీసుకుంటున్న చర్యలను పర్యవేక్షించింది. కరోనాపై ప్రజలకు అవగహన కల్పించాలని అధికారులకు సూచనలు చేసింది. రెడ్ జోన్ ప్రాంతంలో రాపిడ్ కిట్లతో టెస్టులు చేయడంపై ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను కేంద్ర బృందం కితాబునిచ్చింది.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top