
విభజన ఎప్పటికీ శేషప్రశ్నే!
రాష్ట్ర విభజన రాజ్యాంగబద్ధమా, కాదా అనేది ఎప్పటికీ సమాధానం లేని ప్రశ్నేనని సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ జాస్తి చలమేశ్వర్ అన్నారు.
- ఉండవల్లి పుస్తకావిష్కరణలో సుప్రీం జడ్జి చలమేశ్వర్
- చరిత్రలో చాలా ఘటనలు అలాగే ఉండిపోతాయి
- రాజ్యాంగ బద్ధంగా జరగలేదన్నదే బాధ: ఉండవల్లి
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర విభజన రాజ్యాంగబద్ధమా, కాదా అనేది ఎప్పటికీ సమాధానం లేని ప్రశ్నేనని సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ జాస్తి చలమేశ్వర్ అన్నారు. రాష్ట్ర పునర్ వ్యవస్థీకరణ బిల్లు పార్లమెంటులో పాసయిందా, లేదా? అనేది కూడా చరిత్రలో చాలా సంఘటనల మాదిరే ఎప్పటికీ శేష ప్రశ్నేనని అభిప్రాయపడ్డారు. సీనియర్ రాజకీయ వేత్త ఉండవల్లి అరుణ్ కుమార్ రాష్ట్ర విభజన నేపథ్యంలో రచించిన ‘విభజన కథ- నా డైరీలో కొన్ని పేజీలు’ అనే గ్రంథాన్ని జస్టిస్ చలమేశ్వర్ ఆదివారమిక్కడ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా చలమేశ్వర్ మాట్లాడుతూ జరిగి పోయిన విడాకులకు బాజాలెందుకని చమత్కరించారు.
ఉండవల్లి అరుణ్‌కుమార్ పుస్తకాన్ని చదివినప్పుడు విభజన సమయంలో ఏయే నాయకుడు వ్యక్తిగతంగా ఎలా ప్రవర్తించారో, ఏ పాత్ర పోషించారనేది తెలుస్తుందని చెప్పారు. రాష్ట్ర పునర్ వ్యవస్థీకరణ బిల్లు పాసయిందా? లేదా? అనే సందేహాన్ని రచయిత లేవనెత్తారని, చరిత్రలో చాలా సంఘటనలు అవి ఎప్పటికీ అలాగే మిగిలిపోతాయన్నారు. విభజన రాజ్యాంగ బద్ధమా కాదా? వాస్తవం ఏమిటి? సభలో ఏమి జరిగింది? అనేవి లోపల కూర్చున్న వారికే తెలియాలన్నారు. ‘చరిత్రలో అనేకం జరిగాయి. తెలుగు మాట్లాడే వారి రాజకీయ చరిత్ర ఏ ఆరేడు వందల ఏళ్లో అనుకుంటే రకరకాల ప్రక్రియలు జరిగాయి. గత 60,70 ఏళ్లలో రెండుసార్లు కలవడం, మరో రెండుసార్లు విడిపోవడానికి దగ్గరగా వచ్చి ఆగిపోవడం జరిగింది. దానికి కారకులు ఎవరనేది వేరే ప్రశ్న. అవన్నీ గ్రంథస్తం కావా లి. ఎప్పటికయినా మనుషులు తెలివి తెచ్చుకుని పొరబాట్లు మళ్లీ చేయకుండా ఉంటారని ఆశిస్తున్నా’ అని చలమేశ్వర్ అన్నారు.
ఏదీ సవ్యంగా జరగలేదు...
సాక్షి ఎడిటోరియల్ డెరైక్టర్ కె.రామచంద్రమూర్తి మాట్లాడుతూ 1956లో ఆంధ్రప్రదేశ్ ఏర్పడినా ఏదీ సవ్యంగా జరగలేదని, దీనికి నెహ్రూ మొదలు కిరణ్‌కుమార్‌రెడ్డి వరకు అందరూ బాధ్యులేనన్నారు. ‘ఏమైనా, విభజన జరిగింది. ఇది కొంతమందికి నచ్చలేదు. కానీ చేయగలిగిందేమీ లేదు. అయినా బిల్లు పాస్ కాలేదనే వాళ్లు కొందరున్నారు. వాళ్లలో ఉండవల్లి ఒకరు.’ అని పేర్కొన్నారు. ఈ పుస్తకంలోని చాలా అంశాలను సాక్షి సీరియల్‌గా ప్రచురించిందని వివరించారు.రాజ్యసభ సభ్యుడు కేవీపీ రామచంద్రరావు మాట్లాడుతూ తెలంగాణపై ఆధిపత్యం కోసమో, పదవుల కోసమో సమైక్యాంధ్ర కోసం పోరాడలేదని, ఉమ్మడిగా ఉంటే మరింత అభివృద్ధి, మేలు జరుగుతుందని పోరాడామన్నారు.
గ్రంథ రచయిత ఉండవల్లి మాట్లాడుతూ రాజ్యాంగ బద్ధంగా జరగాల్సిన ప్రక్రియ ఆ విధంగా జరగలేదన్నదే తన ఆవేదన అని చెప్పారు. అధికార, ప్రతిపక్షం కలిస్తే ఏమైనా చేయవచ్చన్నది ఈ బిల్లుతో నిరూపణ అయిందని వివరించారు. ఎమెస్కో ప్రచురణ సంస్థ సంపాదకుడు డి.చంద్రశేఖర్‌రెడ్డి అధ్యక్షతన జరిగిన సభలో సీనియర్ సంపాదకులు పొత్తూరి వెంకటేశ్వరరావు, కె.శ్రీనివాస్, కె.శ్రీనివాసరెడ్డి, డి.అమర్, కృష్ణారావు, బి.శ్రీనివాసరావు, మాజీ ఐఎఎస్ అధికారులు మోహన్‌కందా, పీవీకే ప్రసాద్, మాజీ డీజీపీ అరవిందరావు, తెలంగాణ సీఎం మీడియా సలహాదారు జ్వాలా నరసింహారావు, ఎమెస్కో ప్రచురణాలయం అధిపతి విజయ్‌కుమార్‌లు ప్రసంగించారు. మరో సీనియర్ సంపాదకుడు ఏబీకే ప్రసాద్ ప్రసంగించేందుకు నిరాకరించారు.