తమిళ కిక్‌ 

Illicit Supply Of Alcohol From Neighboring States - Sakshi

అడ్డదారుల్లో జిల్లాలోకి..

అధిక ధరలకు విక్రయాలు

దృష్టిసారించిన ఎస్‌ఈబీ

కట్టడికి ప్రత్యేక యాక్షన్‌ప్లాన్‌

రాష్ట్ర సరిహద్దుల్లో శాశ్వత చెక్‌పోస్టుల ఏర్పాటు 

నెలరోజుల వ్యవధిలో 21 కేసుల నమోదు

336 మద్యం బాటిళ్ల స్వాధీనం 

మద్య నిషేధం వైపు ప్రభుత్వం అడుగులు వేస్తుంటే ఉన్నతాశయానికి కొందరు అక్రమార్కులు తూట్లు పొడుస్తున్నారు. పొరుగు రాష్ట్రాల నుంచి మద్యాన్ని తీసుకువచ్చి విక్రయాలు చేస్తూ వ్యాపారంగా మార్చుకున్నారు. ముఖ్యంగా తమిళనాడు నుంచి అడ్డదారుల్లో నాన్‌ డ్యూటీ పెయిడ్‌ లిక్కర్‌ను (ఎన్‌డీపీ) అధిక ధరలకు విక్రయించి సొమ్ము చేసుకుంటున్నారు. దీనిపై స్పెషల్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ బ్యూరో  (ఎస్‌ఈబీ) దృష్టి సారించింది. ప్రత్యేక కార్యాచరణను సిద్ధం చేసింది. సరిహద్దు ప్రాంతాల్లో ముమ్మరంగా దాడులు నిర్వహించి విక్రయాలకు బ్రేక్‌ వేస్తోంది.  

నెల్లూరు(క్రైమ్‌): వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే దశలవారీ మద్యనిషేధం అమలుకు శ్రీకారం చుట్టింది. అందులో భాగంగా ఏపీ బేవరేజస్‌ కార్పొరేషన్‌ ద్వారా ప్రభుత్వమే మద్యం దుకాణాల నిర్వహణ, 33 శాతం దుకాణాల కుదింపు, పరి్మట్‌రూమ్‌ల రద్దు, బెల్టుషాపులపై ఉక్కుపాదం తదితర చర్యలు తీసుకుంది.  మద్య వినియోగాన్ని తగ్గించేందుకు ధరలను భారీగా పెంచింది. దీంతో కొందరు మందుబాబులు స్వచ్ఛందంగా మద్యానికి స్వస్తి పలుకుతున్నారు. మరికొందరు ప్రత్యామ్నాయ మార్గాలపై దృష్టి సారిస్తున్నారు. ఇంకొందరు దీనిని వ్యాపారంగా మార్చుకుని తమిళనాడు మద్యం బాటిళ్లను జిల్లాకు తీసుకువచ్చి విక్రయాలు చేస్తున్నారు.  

వివిధ మార్గాల ద్వారా.. 
తమిళనాడు రాష్ట్రం జిల్లాకు సరిహద్దు ప్రాంతం. మన రాష్ట్రాంలో ఓ బ్రాండ్‌ క్వార్టర్‌ మద్యం ధర రూ.450 ఉండగా అదే మద్యం ధర తమిళనాడు రాష్ట్రంలో రూ.300కే దొరుకుతోంది.
ఈక్రమంలో సూళ్లూరుపేట, తడ, మన్నారుపోలూరు, చిత్తూరు జిల్లాలోని వరదయ్యపాళెం, బుచ్చినాయుడుకండ్రిగ, నడిమికుప్పం తదితర ప్రాంతాలకు చెందిన అనేకమంది మందుబాబులు పక్క రాష్ట్రంలోని  ఆరంబాకం, గుమ్మడిపూండి, చిన్నోబులాపురం, వీరకాడు తదితర ప్రాంతాలనుంచి పెద్దఎత్తున మద్యాన్ని కొనుగోలు చేస్తున్నారు.  
కొందరు అక్రమార్కులు ఇదే అవకాశాన్ని ఆదాయవనరులుగా మార్చుకుంటున్నారు.
తడ నుంచి తమిళనాడు రాష్ట్రంలోకి వెళ్లేందుకు వివిధ మార్గాలు ఉండడంతో వాటిని తమకు అనుకూలంగా మలుచుకుని తమిళ మద్యాన్ని జిల్లాలోకి తీసుకువస్తున్నారు. 
ఫుల్‌ బాటిల్‌పై రూ.500 నుంచి రూ.800 మార్జిన్‌ పెట్టుకుని విక్రయిస్తున్నారు. తెలంగాణ నుంచి వివిధ మార్గాల్లో అక్కడి మద్యం సైతం జిల్లాలో అందుబాటులో ఉంది.   
తనిఖీలు నామమాత్రమే..
జిల్లా సరిహద్దులో చెక్‌పోస్టులున్నా అక్కడ తనిఖీలు నామమాత్రంగానే సాగుతున్నాయన్న విమర్శలున్నాయి.  
పక్కా సమాచారం ఉంటే తప్ప చెక్‌పోస్ట్‌ సిబ్బంది వాహన తనిఖీలు నిర్వహిస్తున్న దాఖలాలు లేవన్న ఆరోపణలున్నాయి.  
కొందరు సిబ్బంది సైతం అక్రమరవాణాకు సహకరిస్తున్నారని ప్రచారం ఉంది. బైక్‌లు, కార్లు, ఇతర వాహనాల ద్వారా మద్యం జిల్లాలోకి ప్రవేశిస్తోంది. 
ప్రత్యేక నిఘా 
పొరుగు మద్యం అక్రమ విక్రయాలపై స్పెషల్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ బ్యూరో దృష్టి సారించింది.  
ఆ విభాగ డిప్యూటీ కమిషనర్‌ డాక్టర్‌ వి.రాధయ్య సిబ్బందితో ప్రత్యేక సమావేశం నిర్వహించారు.  
ఎస్‌ఈబీ సూపరింటెండెంట్‌ కె.శ్రీనివాసాచారి నేతృత్వంలో ప్రత్యేక బృందాన్ని ఏర్పాటుచేసి సరిహద్దు చెక్‌పోస్టులతోపాటు అంతర్గత రహదారుల వద్ద నిఘా పెట్టి దాడులు ముమ్మరం చేశారు.  
నెలరోజుల వ్యవధిలో 21 కేసులు నమోదు చేసి 24 మందిని అరెస్ట్‌ చేశారు. వారి నుంచి 70.02 లీటర్ల మద్యం, 3.9 లీటర్ల బీరును స్వాధీనం చేసుకున్నారు.  
మద్యాన్ని తరలిస్తున్న నాలుగు వాహనాలను సీజ్‌ చేశారు.  
తనిఖీలను అధికారులు ముమ్మరం చేశారు. లాక్‌డౌన్‌ ప్రారంభం నుంచి ఇప్పటి వరకు అధికారులు సుమారు 146 లీటర్ల మద్యాన్ని స్వా«దీనం చేసుకున్నారు. 

పూర్తిస్థాయిలో కట్టడికి.. 
స్థానిక పోలీసుల సహకారంతో పొరుగు రాష్ట్ర మద్యాన్ని పూర్తిస్థాయిలో కట్టడి చేసేందుకు ఎస్‌ఈబీ అధికారులు పక్కా ప్రణాళికలు రూపొందిస్తున్నారు. సరిహద్దు ప్రాంతాల్లో ఇన్‌ఫార్మర్‌ వ్యవస్థను ఏర్పాటు చేస్తున్నారు. వారి ద్వారా అక్రమరవాణా, విక్రయాలపై నిఘా ఉంచనున్నారు. అక్రమ వ్యాపారానికి సహకరిస్తున్న సిబ్బంది ఎవ్వరనే విషయంపై రహస్యంగా వివరాలు సేకరిస్తున్నారు.  

దాడులు ముమ్మరం 
మద్యం అక్రమరవాణా, నిల్వలు, అధిక ధరలకు విక్రయాలపై జిల్లావ్యాప్తంగా దాడులు కొనసాగుతున్నాయి. పెద్దఎత్తున మద్యం పట్టుకోవడంతోపాటు అక్రమార్కులపై కేసులు నమోదు చేస్తున్నాం. పొరుగు రాష్ట్రం (ఎన్‌డీపీ) మద్యం అక్రమరవాణా, విక్రయాలపై దృష్టి సారించాం. దాడులు కొనసాగుతూ ఉన్నాయి. ఎస్‌ఈబీ ఏర్పాటైన నాటినుంచి ఎన్‌డీపీ విక్రయాలు, రవాణాపై ఇప్పటివరకు 21 కేసులు నమోదు చేశాం. నాటుసారా తయారీ, విక్రయాలపై దాడులు చేసి కేసులు పెట్టాం. సరిహద్దుల్లో నిఘా వ్యవస్థను మరింత పటిష్టం చేస్తున్నాం. అక్రమార్కులపై కఠినంగా వ్యవహరిస్తాం.  
–డాక్టర్‌ వి.రాధయ్య,ఎస్‌ఈబీ డిప్యూటీ కమిషనర్‌  

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top