ప్రైవేట్‌ కాలేజీలపై జగన్‌ సర్కారు కొరడా..! 

Government Action Against Private Junior Colleges - Sakshi

ప్రభుత్వం నిర్ణయించిన విధంగా ఫీజులు అమలు

హాస్టల్‌ లేకుండా కాలేజి నిర్వహిస్తే చర్యలు తప్పవు

ముందుగా నోటీసు, ఆ తర్వాత జరిమానా 

అయినా తీరు మారకుంటే కళాశాల మూతే

కాలేజీ పేర్ల వెనుక నీట్, జీ వంటి తోకల కత్తిరింపు

సాక్షి, ఒంగోలు టౌన్‌: నిబంధనలు పాటించని ప్రైవేటు జూనియర్‌ కళాశాలలపై జగన్‌ సర్కారు కొరడా ఝుళిపిస్తోంది. విద్యార్థుల తల్లిదండ్రుతో ఆడుకుంటున్న విద్యాసంస్థల ఆటకట్టించేందుకు రంగం సిద్ధం చేస్తోంది. అడ్డగోలుగా ఫీజులు వసూలు చేయడం.. కాలేజీ పేర్ల వెనుక నీట్, జీ వంటి తోకలు చేర్చి తల్లిదండ్రులను ఆకర్షించడం.. ఒక దానికి అనుమతి తీసుకొని, మూడు నాలుగు బ్రాంచ్‌లు ఏర్పాటు చేయడం.. కాలేజీ హాస్టల్‌కు అనుమతి లేకుండా ఏర్పాటు చేయడం వంటివి ఇప్పటి వరకు అనేక ప్రైవేట్‌ జూనియర్‌ కాలేజీలు యథేచ్ఛగా చేస్తూ వచ్చాయి. తాము చెప్పిందే శాసనం అన్నట్టు తల్లిదండ్రులను బెదిరించే ధోరణిలో వ్యవహరిస్తూ వచ్చాయి. 

ప్రభుత్వం నిర్ణయించిన విధంగా ఫీజులు వసూలు చేయాలని, ఒక్క రూపాయి అదనంగా వసూలు చేసినా చర్యలు తప్పవని ప్రైవేటు, కార్పొరేట్‌ జూనియర్‌ కళాశాలలకు వైఎస్సార్‌ సీపీ సర్కారు హెచ్చరికలు జారీ చేసింది. ఫీజుల వివరాలను ఆయా కాలేజీల నోటీసు బోర్డుల్లో తప్పనిసరిగా ప్రదర్శించాలని ఆదేశించింది. నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తే సంబంధిత కాలేజీలకు ముందుగా నోటీసులు ఇవ్వడం, ఆ తర్వాత ఫైన్‌ వేయడం, అప్పటికీ తీరు మారకుంటే దానిని క్లోజ్‌ చేసేందుకు కూడా వెనుకాడవద్దంటూ రాష్ట్ర విద్యాశాఖామంత్రి ఆదిమూలపు సురేష్‌ ఆదేశాలు జారీ చేశారు. గత ప్రభుత్వాలకు భిన్నంగా వైఎస్‌ జగన్‌ ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలతో ఇప్పటి వరకు దర్జాగా జూనియర్‌ కాలేజీలు నిర్వహిస్తూ వచ్చిన అక్రమార్కుల గుండెల్లో రైళ్లు పరుగెడుతున్నాయి. తమకు కౌంట్‌ డౌన్‌ ప్రారంభమైందని భయపడుతున్నారు. 

కార్పొ‘రేట్‌’ బురిడీ..
జిల్లాలో కార్పొరేట్‌ కాలేజీలు అడుగు పెట్టిన తర్వాత ఫీజుల రూపంలో అడ్డగోలుగా దోచుకుంటున్నాయి. విద్యార్థుల తల్లిదండ్రులను ఆకర్షించే విధంగా రకరకాల ప్రకటనలు చేస్తూ బుట్టలో వేసుకుంటున్నాయి. ఇక ఇంటర్‌ మీడియట్‌ ఫలితాలు, ఎంసెట్‌ ర్యాంకులు విడుదల చేస్తే కార్పొరేట్‌ కాలేజీలు చేసే హడావుడి అంతా ఇంతా కాదు. ఎక్కడో ఒకచోట అత్యధిక మార్కులు వచ్చినా, టాప్‌ టెన్‌లో ర్యాంకు వచ్చినా దానిని రాష్ట్రం మొత్తం రుద్దేసి తల్లిదండ్రులను బహిరంగంగానే బురిడీ కొట్టిస్తున్నాయి. కార్పొరేట్‌ కాలేజీలు రాకముందు జిల్లాలోని ప్రైవేట్‌ కాలేజీలు ఫీజులు నామమాత్రంగా వసూలు చేసేవి. కార్పొరేట్‌ కాలేజీలు అడుగుపెట్టిన తర్వాత ఫీజులను భారీగా పెంచేసుకున్నాయి. కార్పొరేట్‌ కాలేజీలకు తీసిపోని విధంగా కొన్ని ప్రైవేట్‌ కాలేజీలు కూడా ఫీజులు భారీగానే దండుకుంటున్నాయి. 

జిల్లాలో 107 ప్రైవేటు కళాశాలలు..
జిల్లాలో మొత్తం 151 జూనియర్‌ కాలేజీలు ఉన్నాయి. అందులో ప్రభుత్వ జూనియర్‌ కాలేజీలు 33 ఉండగా, ఎయిడెడ్‌ కాలేజీలు 11ఉన్నాయి. ప్రైవేట్‌ కాలేజీలు 107 ఉన్నాయి. ప్రభుత్వ, ఎయిడెడ్‌ కాలేజీలు దగ్గరకు రాని విధంగా ప్రైవేట్, కార్పొరేట్‌ కాలేజీలు జిల్లాలో పాగా వేశాయి. జిల్లాలో ఇంటర్‌ చదువుతున్న వారిలో మూడొంతుల మంది ప్రైవేట్, కార్పొరేట్‌ కాలేజీల్లో ఉన్నారంటే అవి ఏ స్థాయిలో చక్రం తిప్పుతున్నాయో అర్ధం చేసుకోవచ్చు.

నాడు విచ్చలవిడిగా అనుమతులు..
ప్రభుత్వ జూనియర్‌ కాలేజీల ఏర్పాటుకు 2013 సంవత్సరం నుంచి అప్పటి ప్రభుత్వం తలుపులు బార్లా తెరిచింది. గతంలో ఉన్న నోటిఫికేషన్‌ విధానానికి తిలోదకాలు ఇచ్చేసింది. ఆ తర్వాత వచ్చిన చంద్రబాబు ప్రభుత్వం అయితే ప్రైవేట్, కార్పొరేట్‌ కాలేజీలకు విచ్చలవిడిగా అనుమతులు ఇచ్చేసింది. నిబంధనలకు విరుద్దంగా క్యాంపస్‌లు నిర్వహిస్తున్నప్పటికీ అటువైపు కన్నెత్తి కూడా చూసేది కాదు. చంద్రబాబు మంత్రివర్గంలో కీలకంగా వ్యవహరించిన విద్యా సంస్థల అధినేత రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో తమ విద్యా సంస్థల బ్రాంచ్‌లను ఏర్పాటుచేసి విద్యార్థుల తల్లిదండ్రులను దోపిడీ చేయడమే పరమావధిగా పెట్టుకున్నారన్న విమర్శలు బలంగా ఉన్నాయి. జూనియర్‌ కాలేజీల ఏర్పాటుకు సంబంధించి ప్రభుత్వం నుంచి శాంక్షన్‌ ఆర్డర్‌ తెచ్చుకోవడం, ఆ తర్వాత వాటి రిపోర్టులను ఆర్‌ఐఓలకు పంపించడం ఇప్పటి వరకు జరుగుతూ వచ్చింది. గత ప్రభుత్వాలనే మేనేజ్‌ చేసుకొని ఆర్డర్‌లు తెచ్చుకున్నవారు తాము నిబంధనలకు లోబడి నిర్వహిస్తున్నామంటూ ఇంటర్‌ బోర్డు అధికారులపై ఒత్తిళ్లు తీసుకువచ్చి తమకు అనుకూలంగా రిపోర్టులు పంపించుకుంటూ వచ్చారు.  ఇక నుంచి ప్రతి జూనియర్‌ కాలేజీ బోర్డులో సంబంధిత సెంటర్‌ కోడ్, ఆర్‌సీ నంబర్, సొసైటీ పేరు తప్పనిసరి చేస్తూ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది.  

12 కాలేజీలకు షోకాజు నోటీసులు..
రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాలతో జిల్లాలోని ప్రైవేట్, కార్పొరేట్‌ జూనియర్‌ కాలేజీలలో తనిఖీలు ప్రారంభించిన ఆర్‌ఐఓ వీవీ సుబ్బారావు ఇప్పటి వరకు 12 జూనియర్‌ కాలేజీలకు షోకాజు నోటీసులు జారీ చేశారు. పామూరులోని ఒక జూనియర్‌ కాలేజీకి నోటీసులు ఇవ్వడంతోపాటు రూ.50వేల జరిమానా కట్టించి రాష్ట్రంలోనే ఫైన్‌ కట్టించిన తొలి ఆర్‌ఐఓగా నిలిచారు. ఇదిలా ఉండగా విద్యాశాఖామంత్రి ఆదిమూలపు సురేష్‌ ఆర్‌ఐఓలతో నిర్వహించిన సమీక్షా సమావేశంలో తీసుకున్న నిర్ణయం మేరకు జిల్లాలో త్రీమెన్‌ కమిటీని ఏర్పాటు చేశారు. ఆర్‌ఐఓ సుబ్బారావు నేతృత్వంలో ప్రభుత్వ జూనియర్‌ కాలేజీ ప్రిన్సిపాల్స్‌ సైమన్‌ విక్టర్, కాశింపీరాలతో కూడిన త్రీమె¯న్‌ కమిటీ జిల్లాలోని ప్రైవేట్, కార్పొరేట్‌ జూనియర్‌ కాలేజీలను తనిఖీచేస్తూ నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తే చర్యలు తీసుకోనున్నారు.  

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top