‘ఎన్టీఆర్‌ విద్యోన్నతి’ ఎంపికలో గోల్‌మాల్‌ | Sakshi
Sakshi News home page

‘ఎన్టీఆర్‌ విద్యోన్నతి’ ఎంపికలో గోల్‌మాల్‌

Published Thu, Oct 26 2017 3:07 AM

golmaal  in ntr vidyonnathi scheme - Sakshi

సాక్షి, అమరావతి: సివిల్స్‌ కోచింగ్‌కు ఉద్దేశించిన ఎన్టీఆర్‌ విద్యోన్నతి పథకం కింద ఎంపికలో తమకు తీవ్ర అన్యాయం జరిగిందని బీసీ విద్యార్థులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎంపికైన వారి జాబితాను బీసీ సంక్షేమ శాఖ సోమవారం రాత్రి ఇంటర్‌నెట్‌లో పెట్టింది. ఎంపికలో అవకతవకలు జరిగాయని విద్యార్థులు ఆరోపించారు. దాదాపు 100 మందికి అన్యాయం జరిగిందని విద్యార్థులు చెబుతుండగా 30 మంది వరకు ఉండే అవకాశం ఉందని బీసీ సంక్షేమ శాఖ డైరెక్టర్‌ తెలిపారు. 82 కంటే ఎక్కువ మార్కులు వచ్చిన వారు ఎంపిక జాబితాలో లేకుంటే నేరుగా తనను కలవొచ్చని, వారికి అవకాశం కల్పిస్తామని చెప్పారు. టీసీఎస్, జేఎన్‌టీయూ తయారు చేసిన జాబితాలో లోపాలు ఉన్నట్లు గుర్తించామన్నారు. విద్యార్థులు బుధవారం బీసీ సంక్షేమ శాఖ డైరెక్టర్‌ కార్యాలయానికి వచ్చారు. డైరెక్టర్‌ను కలిసి తమ సమస్యను వివరించారు. కటాఫ్‌ మార్కులు 82గా నిర్దేశించినందున సీటు రాని వారు వచ్చే సంవత్సరం రాసుకోవాలని, లేదంటే గ్రూప్స్‌ కోచింగ్‌కు ఎంపిక చేస్తామని డైరెక్టర్‌ పేర్కొన్నారు. కొందరు విద్యార్థినులు కార్యాలయం ఎదుట నిరసన తెలిపారు. సివిల్స్‌ కోచింగ్‌ తీసుకుంటే తప్పకుండా ఎంపికవుతామనే నమ్మకంతో పోటీ పరీక్ష రాశామని, ఇప్పుడు జాబితాలో తమ పేరు లేదని ఆవేదన వ్యక్తం చేశారు.

రిజర్వేషన్ల అమలేదీ?
సివిల్స్‌ కోచింగ్‌కు బీసీ విద్యార్థులను ఎంపిక చేసే విషయంలో రిజర్వేషన్లు అమలు చేయలేదు. నిబంధనల ప్రకారం.. ఏ, బీ, డీ గ్రూపుల వారికి తప్పనిసరిగా రిజర్వేషన్లు అమలు చేయాలి. ఏ గ్రూపు వారికి 7శాతం, బీ గ్రూపు వారికి 10 శాతం, డీ గ్రూపు వారికి 8 శాతం ఇవ్వాలి. సీ గ్రూపు వారికి సాంఘిక సంక్షేమ శాఖ రిజర్వేషన్‌ ఇస్తుంది. ఇవి కాకుండా 33 శాతం మహిళా రిజర్వేషన్‌ తప్పక పాటించాలి. బీసీ సంక్షేమ శాఖ మెరిట్‌ ప్రకారం జాబితాను ప్రకటించి ఎంపిక చేసింది. అందులోనూ లోపాలు ఉన్నాయని బయటపడింది. ఎక్కువ మార్కులు వచ్చిన వారిని పక్కనపెట్టి తక్కువ మార్కులు వచ్చిన వారికి సీట్లు ఇచ్చారు. ఇచ్చిన సీట్లను రద్దుచేసే అవకాశం లేదు.

మిగిలిపోయిన సీట్లు
బీసీల్లో 131 సీట్లు మిగిలిపోయాయి. 1,000 మందికిగాను 869 మందికి సీట్లు కేటాయించారు. ఈబీసీల్లో 750 మందికి గాను 620 మందికి మాత్రమే ఇచ్చారు. ఇంకా 130 మందికి ఇవ్వాల్సి ఉంది. కటాఫ్‌ మార్కుల కారణంగా సీట్లు మిగిలిపోయాయి. తక్కువ మార్కులు వచ్చిన వారికి సీట్లు రావడం, ఎక్కువ మార్కులు వచ్చిన వారికి సీట్లు రాకపోవడాన్ని చూస్తే అధికార పార్టీ నేతల ప్రమేయం ఉన్నట్లు తెలుస్తోంది. వారి సిఫార్సులకు తలవంచి తక్కువ మార్కులు వచ్చిన వారికి సీట్లు కేటాయించినట్లు విశ్వసనీయ సమాచారం. కాగా, నిబంధనల ప్రకారమే అభ్యర్థులను ఎంపిక చేశామని, మెరిట్‌ ప్రకారం ఎంపిక ఉంటుంది తప్ప కేటగిరీల వారీగా రిజర్వేషన్‌ ఉండదని బీసీ సంక్షేమ శాఖ డైరెక్టర్‌ కె.హర్షవర్థన్‌  చెప్పారు.

Advertisement
Advertisement