కరువు మండలాలు రెండే | Drought effected of two zones in district | Sakshi
Sakshi News home page

కరువు మండలాలు రెండే

Jan 4 2014 12:10 AM | Updated on Nov 9 2018 5:52 PM

ఖరీఫ్‌లో వర్షాభావంతో నష్టపోయిన దౌల్తాబాద్, వెల్దుర్తి మండలాలను కరువు ప్రభావిత మండలాల జాబితాలో చేరుస్తూ రాష్ట్ర ప్రభుత్వం శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది.

 సాక్షి ప్రతినిధి, సంగారెడ్డి: ఖరీఫ్‌లో వర్షాభావంతో నష్టపోయిన దౌల్తాబాద్, వెల్దుర్తి మండలాలను కరువు ప్రభావిత మండలాల జాబితాలో చేరుస్తూ రాష్ట్ర ప్రభుత్వం శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది. నైరుతి రుతుపవనాల ద్వారా గత జూన్ ఒకటి నుంచి సెప్టెంబర్ 30వ తేదీ వరకు జిల్లాలో నమోదైన వర్షపాతాన్ని పరిగణనలోకి తీసుకుంటూ కరువు మండలాల జాబితా రూపొందించారు. రాష్ట్రంలో మొత్తం 119 మండలాలను కరువు ప్రభావిత మండలాల జాబితాలో చేర్చారు. జిల్లా నుంచి రెండు మం డలాలకు జాబితాలో చోటు దక్కింది. లోటు వర్షపాతం, వర్షాభావం, పంటల దిగుబడి 50 శాతానికి పైగా పడిపోవడం వంటి అంశాలను పరిగణనలోకి తీసుకుని వివిధ ప్రభుత్వ శాఖల ముఖ్య కార్యదర్శులతో కూడిన కమిటీ కరువు ప్రభావిత మండలాల జాబితా సిద్ధం చేసింది.

 జూన్ ఒకటి నుంచి సెప్టెంబర్ 30 వరకు దౌల్తాబాద్‌లో మైనస్ 36 శాతం, వెల్దుర్తిలో మైనస్ 22.3 శాతం లోటు వర్షపాతం నమోదైంది. దీనిని పరిగణనలోకి తీసుకుని వ్యవసాయ, రెవెన్యూ శాఖల నుంచి సేకరించిన వివరాలు క్రోడీకరించి కలెక్టర్ ప్రభుత్వానికి నివేదిక పంపారు. అయితే అక్టోబర్‌లో కురిసిన వర్షాలతో చాలా చోట్ల రైతులు పంట నష్టపోయారు. దౌల్తాబాద్, వెల్దుర్తి మండలాల్లోనూ భారీ వర్షాల వల్ల చేతికందే సమయంలో పంటలు నేల పాలయ్యాయి. అటు కరువు, ఇటు అకాల వర్షాలకు నష్టపోయిన రైతులు ప్రభుత్వ సాయం కోసం ఎదురు చూస్తున్నారు. ఎంపిక చేసిన మండలాలను కరువు ప్రభావిత ప్రాంతాలుగా పేర్కొంటూ జిల్లా గెజిట్‌లో నమోదు చేసేందుకు అధికారులు సిద్ధమవుతున్నారు. రైతులకు రుణ, ఇతర సదుపాయాలు కల్పించాలనే ప్రభుత్వ ఆదేశాలు ఎంత మేరకు అమలవుతాయో చూడాల్సిందే.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement