పల్నాట శాంతి పవనాలు | decreased Maoist ascendant in district | Sakshi
Sakshi News home page

పల్నాట శాంతి పవనాలు

Dec 13 2013 1:51 AM | Updated on Oct 9 2018 2:49 PM

చీకటి పడుతుందంటే ఒకప్పుడు ఆ గ్రామాలు బిక్కుబిక్కుమనేవి. ఏ వైపు నుంచి ఏ ఉపద్రవం ముంచుకొస్తుందో తెలియక ఆందోళనతో సతమతమయ్యేవి.

సాక్షి, నరసరావుపేట:  చీకటి పడుతుందంటే ఒకప్పుడు ఆ గ్రామాలు బిక్కుబిక్కుమనేవి. ఏ వైపు నుంచి ఏ ఉపద్రవం ముంచుకొస్తుందో తెలియక ఆందోళనతో సతమతమయ్యేవి. మావోయిస్టులు, పోలీసుల దాడుల మధ్య నలిగిపోయేవి. ఇలాంటి గ్రామాలు పల్నాడులో ఎన్నో. అయితే నేడు ఆ పరిస్థితిలో మార్పు వచ్చింది. మావోయిస్టుల ప్రాబల్యంతోపాటు పోలీసుల దాడులు తగ్గడంతో ఆ గ్రామాలు ప్రశాంత వాతావరణంలో ఊపిరి పీల్చుకుంటున్నాయి. పల్నాడులోని బొల్లాపల్లి, ఈపూరు, దుర్గి, వెల్దుర్తి, మాచవరం, పిడుగురాళ్ల, కారంపూడి మండలాల్లోనేకాక పిడుగురాళ్ల  పోలీస్ సర్కిల్ పరిధిలోని బెల్లంకొండ మండలంలోని గ్రామాలు అన్నీ ఒకప్పుడు భయం నీడన బతుకుతుండేవి. ఏకంగా 15 ఏళ్ల పాటు దినదినగండంలా గడిచింది. అన్నల పుణ్యమా అని కొన్ని సమస్యలు పరిష్కారమైనప్పటికీ కొత్త సమస్యలెన్నో పుట్టుకువచ్చాయి.

 గ్రామా ల్లో అశాంతి రాజ్యమేలింది. అధికార పార్టీ ప్రజాప్రతినిధులు విపరీతంగా భయపడాల్సిన పరిస్థితి. గ్రామంలో ఎవరితో ఎవరు  ఏ మాట మాట్లాడాలన్నా ఆచితూచి మాట్లాడేవారు. నాలుక జారితే ఏ కొంప కూలుతుందో అన్న భయం వెంటాడేది. మనసు విప్పి అరుగులపై ముచ్చట్లు చెప్పుకునే ఊసే కరువైంది. మావోయిస్టులతో ఇలావుంటే, పోలీసుల నుంచి పులి మీద పుట్రలా మరో బాధ. ఏ రాత్రి ఏ కూం బింగ్ పార్టీ వచ్చి ఇళ్ల మీద దాడులు చేస్తుందో  మావోయిస్టు సానుభూతిపరులంటూ ఎవరిని ఎత్తుకువెళుతుందో తెలియని పరిస్థితులు వెంటాడాయి.
 ప్రశాంత వాతావరణంలో పల్నాడు గ్రామాలు.. 15 ఏళ్ల పాటు మావోయిస్టులు, పోలీసుల నడుమ నలిగిపోయిన పల్నాడు పల్లెల ప్రజలు గత కొన్నేళ్లుగా క్రమేణా మారిన పరిస్థితుల్లో  స్వేచ్ఛాయుత వాతావరణంలో జీవిస్తున్నారు. పల్లెల్లో మళ్లీ సందడి నెలకొంది. రచ్చబండలపై ప్రజలు హాయిగా మనసు విప్పి మాట్లాడుకోగలుగుతున్నారు. ప్రజల్లో నెల కొన్న అభద్రతా భా వం క్రమేణా దూరమైంది. గతంలో మావోయిస్టుల భయంతో గ్రామాలను విడిచి వెళ్లిన అనేక మ ంది నాయకులు, ప్రజలు తిరిగి తమతమ గ్రామాలకు చేరుకుని హాయిగా జీవనం సాగిస్తున్నారు.
 మళ్లీ పడగవిప్పుతున్న ఫ్యాక్షనిజం.. పల్నాడులో మావోయిస్టుల ప్రాబల్యం తగ్గి పల్లె ప్రజలు హాయిగా జీవనం సాగిస్తున్న సమయంలో స్వార్థ రాజకీయ నాయకులు తమ ఆధిపత్యాల కోసం మళ్లీ ఫ్యాక్షనిజాన్ని ప్రోత్సహిస్తున్నారు. దీంతో మావోయిస్టుల భయంతో అనేక పల్లెల్లో తోకముడిచిన రౌడీయిజం, ఫ్యాక్షనిజం మళ్లీ పడగ విప్పుతూ ప్రజలను భయాందోళనలకు గురిచేస్తోంది.ఈ పరిస్థితులు నెలకొనకుండా జాగ్రత్తలు తీసుకోవలసిన బాధ్యత అటు ప్రజాప్రతినిధులు, ఇటు పోలీసు అధికారులపై ఎంతైనా వుంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement