కవర్డ్‌ కండక్టర్ల స్కామ్‌లో కవరింగ్‌!

Covering to the Covered conductors scam - Sakshi

‘సాక్షి’ కథనంతో ఉలిక్కిపడ్డ రాష్ట్ర ప్రభుత్వం 

విచారణను నీరుగార్చేందుకు ప్రయత్నాలు షురూ 

అనుభవం లేని వ్యక్తికి ఎస్పీడీసీఎల్‌ సీఎండీగా బాధ్యతలు  

కావాల్సిన అధికారికే కీలక పోస్టింగ్‌

చక్రం తిప్పిన సీఎంవోలోని ఐఏఎస్‌ ఆఫీసర్‌

సాక్షి, అమరావతి: రాష్ట్రంలో సంచలనం సృష్టించిన కవర్డ్‌ కండక్టర్ల కుంభకోణం మరో మలుపు తిరిగింది. ఈ వ్యవహారంలో ముఖ్యమంత్రి కార్యాలయం(సీఎంవో) ప్రమేయం వెలుగు చూస్తున్న నేపథ్యంలో దక్షిణ ప్రాంత విద్యుత్‌ పంపిణీ సంస్థ (ఏపీఎస్పీడీసీఎల్‌) సీఎండీ బాధ్యతలను వేరొకరికి అప్పగించారు. విజయవాడలో చీఫ్‌ ఇంజనీర్‌గా పనిచేస్తున్న రాజబాపయ్యను ఎస్పీడీసీఎల్‌ డైరెక్టర్‌(టెక్నికల్‌)గా నియమించి, ఎస్పీడీసీఎల్‌ సీఎండీగా అదనపు బాధ్యత అప్పగించారు. ఇప్పటివరకూ ఈ స్థానంలో ఉన్న ఐఏఎస్‌ అధికారి ఎంఎం నాయక్‌ను తూర్పు ప్రాంత విద్యుత్‌ పంపిణీ సంస్థకు(ఈపీడీసీఎల్‌) పరిమితం చేశారు. కవర్డ్‌ కండక్టర్ల కుంభకోణంలో ఈపీడీసీఎల్‌ సీఎండీగా ఉన్న హెచ్‌వై దొర పాత్ర ఉందన్న ఆరోపణలు రావడంతో ఆయన రాజీనామా చేశారు. ఎస్పీడీసీఎల్‌ సీఎండీ బాధ్యతలను రాజబాపయ్యకు అప్పగిస్తూ శనివారం ఇంధనశాఖ ముఖ్యకార్యదర్శి అజయ్‌జైన్‌ ఆగమేఘాలపై జీవో విడుదల చేయడం విద్యుత్‌ వర్గాలను విస్మయ పరుస్తోంది. ఇలాంటి జీవోలు మునుపెన్నడూ శని, ఆదివారాల్లో విడుదల చేసిన దాఖలాలు లేవు. కవర్డ్‌ కండక్టర్ల కుంభకోణంలో సీఎంవోలోని ఓ ఐఏఎస్‌ అధికారి పాత్ర ఉందంటూ ‘సాక్షి’లో కథనం వెలువడిన కొన్ని గంటల్లోనే ఈ జీవో వెలువడడం గమనార్హం. 

విచారణను ప్రభావితం చేసేందుకేనా? 
రూ.131 కోట్ల విలువైన కవర్డ్‌ కండక్టర్ల స్కామ్‌పై ఎస్పీడీసీఎల్‌ డైరెక్టర్‌(ఫైనాన్స్‌) నేతృత్వంలో విచారణ చురుగ్గా సాగుతోంది. విజిలెన్స్‌ నివేదిక వచ్చిన తర్వాతే కాంట్రాక్టు సంస్థకు ఎస్పీడీసీఎల్‌ సీఎండీ బిల్లులు చెల్లించినట్టు తేలింది. ముఖ్యమంత్రి కార్యాలయంలోని అధికారులకు, ప్రభుత్వాధినేతకు గుట్టుచప్పుడు కాకుండా ముడుపులు సమకూర్చిపెట్టే ప్రసాద్‌ అనే బ్రోకర్‌ ప్రమేయం ఇందులో ఉందని బయటపడినట్లు సమాచారం. దీంతో ఉలిక్కిపడ్డ ముఖ్యమంత్రి కార్యాలయం హడావిడిగా రంగంలోకి దిగింది. ముఖ్యమంత్రికి అత్యంత సన్నిహితుడిగా పేరొందిన సీఎంవోలోని ఐఏఎస్‌ అధికారి తనకు అనుకూలమైన వ్యక్తికి సీఎండీగా బాధ్యతలు అప్పగించినట్టు తెలుస్తోంది. కుంభకోణంపై జరుగుతున్న విచారణను ప్రభావితం చేయడానికి ప్రయత్నిస్తున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి.

నిష్పక్షపాతంగా విచారణ
‘కవర్డ్‌ కండక్టర్ల కుంభకోణంలో సీఎంవో’ శీర్షికన ఈ నెల 22వ తేదీన ‘సాక్షి’ ప్రచురించిన కథనంపై ఎస్పీడీసీఎల్‌ డైరెక్టర్‌(టెక్నికల్‌) స్పందించారు. ఈ స్కామ్‌పై నిష్పక్షపాతంగా విచారణ చేస్తున్నట్టు తెలిపారు. బిల్లుల చెల్లింపు వ్యవహారంలో సీఎంవో పాత్ర లేదని పేర్కొన్నారు.

అనుభవం లేని అధికారికి కీలక పదవా?
కవర్డ్‌ కండక్టర్ల కుంభకోణంలో విచారణ కీలక దశకు చేరిన నేపథ్యంలో అనుభవం లేని వ్యక్తికి ఎస్పీడీసీఎల్‌ సీఎండీగా బాధ్యతలు అప్పగించడాన్ని ఇంధనశాఖ ముఖ్యకార్యదర్శి వ్యతిరేకించినట్టు తెలిసింది. ఆయన తన అభిప్రాయాన్ని ముఖ్యమంత్రి కార్యాలయానికి తెలియజేసినట్లు సమాచారం. రాజబాపయ్య ఇప్పటివరకూ చీఫ్‌ ఇంజనీర్‌గానే పనిచేశారని, డైరెక్టర్‌ పోస్టుకు తీసుకోవడమే కొత్త అని ఆక్షేపిస్తున్నట్లు తెలుస్తోంది. అలాంటి వ్యక్తికి ఏకంగా సీఎండీగా బాధ్యతలు ఇవ్వడం వల్ల పలు అనుమానాలు వచ్చే ప్రమాదం ఉందని స్పష్టం చేసినట్టు తెలిసింది. 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top