అనుకున్నంతా..జరిగింది!

Clashes On Polling Booth In Prakasam - Sakshi

జిల్లా వ్యాప్తంగా బరితెగించిన టీడీపీ నేతలు

పోలింగ్‌ బుత్‌ల వద్ద దౌర్జన్యం, దాడులు

పలుచోట్ల రిగ్గింగ్‌లకు పాల్పడిన అధికార పార్టీ నేతలు

సాక్షి ప్రతినిధి, ఒంగోలు: ముందే ఊహించినట్లే జరిగింది. గురువారం జిల్లా వ్యాప్తంగా జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో అధికార పార్టీ నాయకులు రెచ్చిపోయారు. ఓడిపోతామన్న భయంతో పోలింగ్‌ బూత్‌ల వద్ద భయాందోళనలు సృష్టించారు. చీరాల, అద్దంకి, పర్చూరు, సంతనూతలపాడు నియోజకవర్గాల్లో ఘర్షణలు చెలరేగాయి. పలుచోట్ల వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ ఏజెంట్లపై టీడీపీ నాయకులు దాడికి దిగారు. పలువురు వైఎస్సార్‌ సీపీ కార్యకర్తలకు గాయాలయ్యాయి. అద్దంకి, చీరాల నియోజకవర్గాల్లోని పలు బూత్‌ల్లో టీడీపీ నేతలు వైఎస్సార్‌ సీపీ ఏజెంట్లను బయటకు పంపి రిగ్గింగ్‌లకు పాల్పడ్డారు. పర్చూరు నియోజకవర్గంలోని కారంచేడు మండలం స్వర్ణలో 181,182 పోలింగ్‌ బూత్‌ల్లో అధికార పార్టీ నేతలు వైఎస్సార్‌ సీపీ కార్యకర్తలపై దాడి చేసి గాయపరిచారు.

ఈ దాడిలో ఇద్దరు కార్యకర్తలకు గాయాలయ్యాయి. చీరాల నియోజకవర్గంలోని దేవినూతలలో వైఎస్సార్‌ సీపీ ఏజెంట్లను అధికార పార్టీ నేతలు కొట్టి బయటకు పంపి ఏకపక్షంగా ఓటింగ్‌ జరుపుకున్నారు. పిట్టువారిపాలెంలోనూ వైఎస్సార్‌ సీపీ ఏజెంట్లపై దాడి చేశారు. ఈ నియోజకవర్గంలో అధికార పార్టీ నేతలు పోలింగ్‌ కేంద్రాల వద్దే డబ్బులు పంపిణీ చేసినట్లు తెలుస్తోంది. అద్దంకి నియోజకవర్గంలో అద్దంకి మండలం బొమ్మనంపాడులో టీడీపీ నేతలు చూపించి ఓట్లు వేయాలంటూ ఓటర్లకు ఆంక్షలు పెట్టారు. దీనిని వైఎస్సార్‌ సీపీ ఏజెంట్లు వ్యతిరేకించడంతో గొడవ పెద్దదై కొద్దిసేపు పోలింగ్‌ నిలిచిపోయింది. బల్లికురవ మండలం వేమవరంలో టీడీపీ నేతలు వైఎస్సార్‌ సీపీ ఏజెంట్లను కూర్చో నివ్వకుండా ఏకపక్షంగా ఓట్లేసుకున్నారు. సంతమాగలూరు మండలం అడవిపాలెంలో అధికార పార్టీ నేతలు ప్రతిపక్ష పార్టీ ఏజెంట్లను బయటకు పంపేశారు.

అద్దంకి మండలం మణికేశ్వరంలో టీడీపీ నేతలు వృద్ధుల ఓట్లు లాక్కొని వారే వేసుకున్నారు. దీంతో వైఎస్సార్‌ సీపీ నేతలు ఆందోళనకు దిగారు. బల్లికురవ మండలం కొత్తపాలెంలో టీడీపీ నేతలు వైఎస్సార్‌ సీపీ కార్యకర్తలపై దాడికి పాల్పడ్డారు. సంతమాగలూరు మండలం మక్కెనివారిపాలెంలో వైఎస్సార్‌ సీపీ వారిని అధికార పార్టీ నేతలు ఓట్లు వేయనీయలేదు. మేదరమెట్లలో రెండు పోలింగ్‌ బూత్‌ల్లో అధికార పార్టీ నేతలు వైఎస్సార్‌ సీపీ నేతలను ఓట్ల వేయనీయకుండా అడ్డుకున్నారు.  సంతమాగలూరు మండలం తంగేడుమల్లిలో టీడీపీ నేతలు వైఎస్సార్‌సీపీ నేతలపై దాడి చేశారు. గిద్దలూరు నియోజకవర్గ కేంద్రం 202 పోలింగ్‌ బూత్‌లో వైఎస్సార్‌ సీపీ కార్యకర్త కటారి అరుణ్‌కుమార్‌ యాదవ్‌పై టీడీపీ నేతలు దాడి చేశారు.

రాచర్ల మండలం చోళ్లవీడులో తెలుగుదేశం పార్టీ నాయకులు వైఎస్సార్‌ సీపీ ఏజెంట్‌పై దాడి చేశారు. కందుకూరు మండలం విక్కిరాలపేటలో బీఎల్‌ఓపై అధికార పార్టీ నాయకులు దాడికి దిగారు. ఇందుకు నిరసనగా ఎస్సీ సామాజికవర్గం కార్యకర్తలు ధర్నా చేశారు. గుడ్లూరు మండలం మోచర్లలో ప్రతిపక్షపార్టీ కార్యకర్తలపై పోలీసులు దాడి చేశారు. కొండపి నియోజకవర్గం టంగుటూరు మండలం జమ్ములపాలెంలో ప్రతిపక్ష పార్టీ కార్యకర్తలపై టీడీపీ దాడికి దిగగా ఇరువర్గాల మధ్య ఘర్షణ జరిగింది. టంగుటూరు 108 పోలింగ్‌ బూత్‌లోనూ టీడీపీ, వైఎస్సార్‌ సీపీ కార్యకర్తలు ఘర్షణ పడ్డారు. కొణిజేడులో టీడీపీ, వైఎస్సార్‌ సీపీ కార్యకర్తల మధ్య గొడవ చెలరేగింది. సంతనూతలపాడు నియోజకవర్గం నాగులుప్పలపాడు మండలం తిమ్మసముద్రంలో అధికార పార్టీ నేతలు వైఎస్సార్‌ సీపీ ఏజెంట్‌పై దాడికి తెగబడ్డారు. ఈ ఘర్షణలో మరికొందరు వైఎస్సార్‌ సీపీ కార్యకర్తలకు గాయాలయ్యాయి.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top