విభజన బిల్లుకు సవరణలు కోరండి | amendments need to bifurcation bill | Sakshi
Sakshi News home page

విభజన బిల్లుకు సవరణలు కోరండి

Jan 5 2014 12:26 AM | Updated on Mar 29 2019 9:18 PM

రాష్ట్ర పునర్వ్యవస్థీకరణ బిల్లుపై అసెంబ్లీలో చర్చతో నిమిత్తం లేకుండా పార్లమెంటులో సవరణలు ప్రతిపాదించాల్సిందిగా బీజేపీ జాతీయ నాయకత్వంపై ఒత్తిడి తేవాలని ఆ పార్టీ సీమాంధ్ర ఉద్యమ కమిటీ నిర్ణయించింది.

హైకమాండ్‌కు బీజేపీ సీమాంధ్ర ఉద్యమ కమిటీ వినతి
 
 సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర పునర్వ్యవస్థీకరణ బిల్లుపై అసెంబ్లీలో చర్చతో నిమిత్తం లేకుండా పార్లమెంటులో సవరణలు ప్రతిపాదించాల్సిందిగా బీజేపీ జాతీయ నాయకత్వంపై ఒత్తిడి తేవాలని ఆ పార్టీ సీమాంధ్ర ఉద్యమ కమిటీ నిర్ణయించింది.
 ఈ మేరకు తాము గుర్తించిన పది అంశాలతో అధిష్టానానికి ఓ నివేదిక పంపించింది. పోలవరం ప్రాజెక్టు, నూతన రాజధాని నిర్మాణం, హైదరాబాద్‌లోని సీమాంధ్రుల భద్రత, ఉమ్మడి రాజధాని, రాయలసీమలో స్టీల్‌ప్లాంట్, వెనుకబడిన ప్రాంతాలకు ఆర్థిక ప్యాకేజీలు వంటి అంశాలను అందులో పొందుపరిచింది. తమ డిమాండ్లలో ఏవి న్యాయమైనవో, ఏవి కావో పార్లమెంటు సమావేశాలకు ముందే తేల్చాలని కోరింది. న్యాయమని భావించిన వాటిపై పార్లమెంటులో సవరణలు ప్రతిపాదించడంతో పాటు ఓటింగ్‌కూ పట్టుబట్టాలని విజ్ఞప్తి చేసింది.

చిన్న రాష్ట్రాల ఏర్పాటును తాము వ్యతిరేకించడంలేదని.. సీమాంధ్రుల ఉద్యమాన్ని గానీ, వారి ఆవేదనను గానీ పట్టించుకోకుండా బిల్లు తయారు చేయడమే తమను కలచివేస్తున్నట్టు అందులో వివరించింది. 25 పార్లమెంటు సీట్లు, సుదీర్ఘ చరిత్ర ఉన్న ఓ ప్రాంత సమస్యల్నే విస్మరిస్తే భవిష్యత్ పరిణామాలు తీవ్రంగా ఉంటాయని నివేదించింది. తెలంగాణకు గట్టి మద్దతుదారుగా ఉన్న సుష్మాస్వరాజ్‌తోనే తమ సమస్యలను ప్రస్తావించేలా చూడాలని ఆ ప్రాంత బీజేపీ నేతలు తమ నాయకత్వాన్ని కోరుతున్నారు. సీమాంధ్ర నేత హరిబాబు నేతృత్వంలో త్వరలో ఓ ప్రతినిధి బృందం ఢిల్లీ వెళ్లి అద్వానీ, రాజ్‌నాథ్‌సింగ్, సుష్మాస్వరాజ్, అరుణ్‌జైట్లీలను కలవనుంది. అలాగే పార్టీ ప్రధానమంత్రి అభ్యర్థి నరేంద్రమోడీని కూడా కలిసి పరిస్థితిని వివరించేందుకు నేతలు ప్రయత్నిస్తున్నారు.
 
 నేడు బీజేపీలో చేరనున్న కొమ్మూరి: వరంగల్ జిల్లా జనగాం నియోజకవర్గ టీఆర్‌ఎస్ మాజీ ఎమ్మెల్యే కొమ్మూరి ప్రతాప్‌రెడ్డి ఆదివారం బీజేపీలో చేరనున్నారు. ఆయనతో పాటు మాజీ మంత్రి రవీంద్ర నాయక్ కూడా బీజేపీలో చేరుతున్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement