breaking news
Seemandhra Movement committee
-
విభజన బిల్లుకు సవరణలు కోరండి
హైకమాండ్‌కు బీజేపీ సీమాంధ్ర ఉద్యమ కమిటీ వినతి సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర పునర్వ్యవస్థీకరణ బిల్లుపై అసెంబ్లీలో చర్చతో నిమిత్తం లేకుండా పార్లమెంటులో సవరణలు ప్రతిపాదించాల్సిందిగా బీజేపీ జాతీయ నాయకత్వంపై ఒత్తిడి తేవాలని ఆ పార్టీ సీమాంధ్ర ఉద్యమ కమిటీ నిర్ణయించింది. ఈ మేరకు తాము గుర్తించిన పది అంశాలతో అధిష్టానానికి ఓ నివేదిక పంపించింది. పోలవరం ప్రాజెక్టు, నూతన రాజధాని నిర్మాణం, హైదరాబాద్‌లోని సీమాంధ్రుల భద్రత, ఉమ్మడి రాజధాని, రాయలసీమలో స్టీల్‌ప్లాంట్, వెనుకబడిన ప్రాంతాలకు ఆర్థిక ప్యాకేజీలు వంటి అంశాలను అందులో పొందుపరిచింది. తమ డిమాండ్లలో ఏవి న్యాయమైనవో, ఏవి కావో పార్లమెంటు సమావేశాలకు ముందే తేల్చాలని కోరింది. న్యాయమని భావించిన వాటిపై పార్లమెంటులో సవరణలు ప్రతిపాదించడంతో పాటు ఓటింగ్‌కూ పట్టుబట్టాలని విజ్ఞప్తి చేసింది. చిన్న రాష్ట్రాల ఏర్పాటును తాము వ్యతిరేకించడంలేదని.. సీమాంధ్రుల ఉద్యమాన్ని గానీ, వారి ఆవేదనను గానీ పట్టించుకోకుండా బిల్లు తయారు చేయడమే తమను కలచివేస్తున్నట్టు అందులో వివరించింది. 25 పార్లమెంటు సీట్లు, సుదీర్ఘ చరిత్ర ఉన్న ఓ ప్రాంత సమస్యల్నే విస్మరిస్తే భవిష్యత్ పరిణామాలు తీవ్రంగా ఉంటాయని నివేదించింది. తెలంగాణకు గట్టి మద్దతుదారుగా ఉన్న సుష్మాస్వరాజ్తోనే తమ సమస్యలను ప్రస్తావించేలా చూడాలని ఆ ప్రాంత బీజేపీ నేతలు తమ నాయకత్వాన్ని కోరుతున్నారు. సీమాంధ్ర నేత హరిబాబు నేతృత్వంలో త్వరలో ఓ ప్రతినిధి బృందం ఢిల్లీ వెళ్లి అద్వానీ, రాజ్‌నాథ్‌సింగ్, సుష్మాస్వరాజ్, అరుణ్‌జైట్లీలను కలవనుంది. అలాగే పార్టీ ప్రధానమంత్రి అభ్యర్థి నరేంద్రమోడీని కూడా కలిసి పరిస్థితిని వివరించేందుకు నేతలు ప్రయత్నిస్తున్నారు. నేడు బీజేపీలో చేరనున్న కొమ్మూరి: వరంగల్ జిల్లా జనగాం నియోజకవర్గ టీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే కొమ్మూరి ప్రతాప్‌రెడ్డి ఆదివారం బీజేపీలో చేరనున్నారు. ఆయనతో పాటు మాజీ మంత్రి రవీంద్ర నాయక్ కూడా బీజేపీలో చేరుతున్నారు. -
వెంకయ్య ప్రకటనలో తప్పేముంది?
బీజేపీ సీమాంధ్ర ఉద్యమ కమిటీ సమర్థన సాక్షి, హైదరాబాద్: సీమాంధ్ర సమస్యల్ని పరిష్కరించిన తర్వాతే పార్లమెంటులో తెలంగాణ బిల్లు పెట్టాలన్న పార్టీ సీనియర్ నేత వెంకయ్య నాయుడు చేసిన ప్రకటనకు బీజేపీ సీమాంధ్ర ఉద్యమ కమిటీ మద్దతు పలికింది. బీజేపీలాంటి జాతీయ పార్టీకి అన్ని ప్రాంతాలు సమానమేనన్నది వెంకయ్య ప్రకటనతో తేటతెల్లమవుతోందని, దీన్ని ఆక్షేపించాల్సిన పనేమీ లేదని ప్రకటించింది. వెంకయ్య నాయుడు వ్యాఖ్యలకు పెడర్థాలు తీయాల్సిన పనిలేదని తెలంగాణ నేతలకు హితవుపలికింది. 2009 నుంచి ప్రత్యేక తెలంగాణ చుట్టూనే రాష్ట్ర నాయకత్వం పోరాటాలు చేసిందని, రాష్ట్రాన్ని విభజిస్తే సీమాంధ్రుల మనోభావాలు ఎలా ఉంటాయో పసిగట్టడంలో రాష్ట్ర నాయకత్వం విఫలమైందని అభిప్రాయపడింది. 25 పార్లమెంటు సీట్లున్న ఓ పెద్ద ప్రాంతాన్ని జాతీయ నాయకత్వం విస్మరించలేదని, నరేంద్ర మోడీ ప్రధాని కావాలంటే ఈ ప్రాంత ఓట్లూ, సీట్లూ కూడా ముఖ్యమేనని సున్నితంగా హెచ్చరించింది. ‘‘పార్టీ అంటే తెలంగాణ మాత్రమే కాదు. 2009 ఎన్నికల్లో పార్టీకి తెలంగాణలో వచ్చిన ఓట్లు మూడుశాతం లోపే. సీట్లు గెలవకపోయినా సీమాంధ్రలోనూ 2.3 శాతం ఓట్లు వచ్చాయి. ఈ నేపథ్యంలో వెంకయ్య చేసిన ప్రకటన సబబే’’నని ఉద్యమ కమిటీ నేత ఒకరు తెలిపారు. సీమాంధ్రలో ఉన్న ప్రస్తుత పరిస్థితుల దృష్ట్యా అనేక మంది ఇతర పార్టీల నేతలు బీజేపీ వైపు చూస్తున్నారని, వారిని ఆకట్టుకోవడానికి కూడా వెంకయ్య నాయుడు చేసిన ప్రకటన ఊతమిస్తుందని తెలిపారు. భద్రాచలం డివిజన్‌ను సీమాంధ్రలో కలపాలని, పోలవరం ప్రాజెక్టును త్వరితగతిన నిర్మించాలని తాము చేస్తున్న డిమాండ్లపై కేంద్రం తక్షణమే స్పందించాలని కోరారు.