ప్రజా చైతన్యంతోనే అవినీతికి చెక్! | Sakshi
Sakshi News home page

ప్రజా చైతన్యంతోనే అవినీతికి చెక్!

Published Sat, Jul 9 2016 11:58 PM

ACB officer Rangaraju interview

 ఈ దాడులన్నీ ఒక నెలలో జరిగినవే! ఇవి చాలు ప్రజాసేవ చేయాల్సిన ప్రభుత్వ కార్యాలయాల్లో అవినీతిపరుల ఆటకట్టించడానికి అవినీతి నిరోధక శాఖ ఎలా పనిచేస్తుందో చెప్పడానికి! అయితే ఏసీబీ ఒక్కటే పనిచేస్తే అవినీతి పోతుందనుకుంటే భ్రమే అవుతుందని కుండబద్దలుకొట్టి చెప్పారు ఆ శాఖ డీఎస్పీ కె.రంగరాజు. ప్రభుత్వ కార్యాలయాల్లో అవినీతి వేళ్లూనుకుపోవడానికి ప్రజలూ కారణమేనని నిర్మొహమాటంగా చెప్పారు. అక్రమాలను సక్రమం చేసుకోవడానికి కొందరు, పని త్వరగా పూర్తవ్వాలని మరికొందరు అవినీతి ప్రోత్సహిస్తుంటే... అవినీతి కంటపడినా మనకెందుకులే అని మౌనం వహించేవారూ కారణమేనని తన మనసులో మాటను బయటపెట్టారు. మరి సమాజాన్ని పట్టిపీడిస్తున్న అవినీతిని కూకటివేళ్లతో పెకిలించాలంటే ఏసీబీ ఒక్కటే సరిపోదని... ప్రజల్లో చైతన్యమూ రావాలని, వారు ప్రశ్నించినప్పుడే అది పరారవుతుందని, అక్రమార్కులకు అడ్డుకట్ట పడుతుందని అభిప్రాయపడ్డారు.  జిల్లాలో గతంలో ఎన్నడూ లేనివిధంగా ఏసీబీ దాడులను ముమ్మరం చేసి అవినీతిపరుల గుండెల్లో రైళ్లు పరిగెత్తిస్తున్నారు  రంగరాజు. ఈ కేసుల్లో నిందితుల గుట్టురట్టు చేసే పనిలో నిమగ్నమైన ఆయనను ‘సాక్షి’ పలుకరించింది.
 
 జిల్లాలో సంచలనం సష్టించిన బీసీ, గిరిజన సంక్షేమ శాఖల్లో ఉపకారవేతనాల కుంభకోణాన్ని ఏసీబీ (1.6.2016) వెలుగులోకి తీసుకొచ్చింది. దాదాపు రూ.90 లక్షల నిధుల దారిమళ్లింపుపై లోతైన దర్యాప్తుతో అందుకు బాధ్యులైన వారిని పక్కా ఆధారాలతో పట్టుకొనే పనిలో ప్రస్తుతం నిమగ్నమైంది.
 
 జాతీయ రహదారిపై జిల్లా సరిహద్దులోనున్న ఇచ్ఛాపురం చెక్‌పోస్టుపై(3.6.2016) ఏసీబీ దాడిచేసి రూ.45,500 నగదు స్వాధీనం చేసుకుంది. ఐదుగురు బ్రోకర్లను అరెస్టు చేసింది. అక్కడ విధుల్లో ఉండాల్సిన అధికారులు వ్యూహా త్మకంగా అక్కడవిధులకు గైర్హాజరైన వ్యవహా రంలో అసలురహస్యాన్ని ఛేదించే పనిలో ఉంది.
 
  ఆమదాలవలస మున్సిపాలిటీ అసిస్టెంట్ ఇంజినీర్ జి.రవి (10.6.2015) రూ.50 వేలు ఒక కాంట్రాక్టరు నుంచి లంచం తీసుకుంటుండగా ఏసీబీ రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకుంది.
 
 ఒక కేసును మాఫీ చేస్తానని బాధితుడి నుంచి (23.6.2016) రూ.3 వేలు లంచం తీసుకుంటున్న పొందూరు పోలీసుస్టేషన్ హెడ్ కానిస్టేబుల్ బెండి త్రినాథ్‌ను ఏసీబీ రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకుంది.
 
 ఇంటి ప్లానును ఆమోదించేందుకు ఓ యజ మాని నుంచి (24.6.2016) రూ.35 వేలు లంచం తీసుకుంటుండగా నరసన్నపేట మేజరు పంచాయతీ కార్యనిర్వహణాధికారి సీహెచ్ ఉమామహేశ్వరరావును ఏసీబీ వలపన్ని పట్టుకుంది.

 
 సాక్షి: శ్రీకాకుళం  జిల్లాలో ఏసీబీ దాడులను ముమ్మరం చేశారు. ఏ ప్రభుత్వ శాఖల్లో అవినీతి ఎక్కువగా ఉందని మీరు గుర్తించారు?
 రంగరాజు: ప్రజల సంక్షేమం, ప్రజావ్యవహారాలతో సంబంధం ఉన్న ప్రభుత్వ శాఖల్లో ఉద్యోగులపైనే ఎక్కువగా అవినీతి ఆరోపణలు వస్తున్నాయి. జిల్లా వరకూ అయితే రెవెన్యూ, రవాణా, మున్సిపాలిటీలు, పోలీసు, వాణిజ్యపన్నులు, సాంఘిక సంక్షేమం వంటి కీలక శాఖల్లోని సిబ్బందిపైనే ఎక్కువగా ఫిర్యాదులు వస్తున్నాయి. శ్రీకాకుళం, పాలకొండ సబ్‌డివిజన్‌ల నుంచి ఏసీబీకి ఎక్కువ ఫోన్‌కాల్స్ వస్తున్నాయి. టెక్కలి సబ్‌డివిజన్‌లో ఇచ్ఛాపురం టోల్‌గేట్ వ్యవహారాలపైనా ఫిర్యాదులు ఎక్కువే. జిల్లాలో అవినీతి వ్యవహారాలపై ఉన్నతాధికారులకు ఇప్పటికే నివేదిక ఇచ్చాను.
 
 సాక్షి: వ్యక్తిగత కక్షలతో తప్పుడు ఫిర్యాదులు చేసేవారు ఉంటారు కదా?
 రంగరాజు: తప్పుడు ఫిర్యాదుల బెడద ఏసీబీకి కూడా తప్పదు. ఇక్కడే పోలీసుకు, ఏసీబీకి తేడా ఉంటుంది. ఫిర్యాదు వస్తే వెంటనే ఫీల్డ్‌కి వెళ్లి సంబంధిత వ్యక్తులను పోలీసులు ప్రశ్నించవచ్చు. కానీ ఏసీబీకి హడావుడి పనిచేయదు. ఎవరైనా ప్రభుత్వ ఉద్యోగి లంచం కోసం వేధిస్తే బాధితులు ఏసీబీని ఎప్పుడైనా ఆశ్రయించవచ్చు. కానీ ఆ ఫిర్యాదులో వాస్తవం ఎంతో మేమే మరోసారి అన్ని కోణాల్లోనూ పరిశీలించిన తర్వాతే రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకోవడానికి వల వేస్తాం.
 
 సాక్షి: కొన్ని కేసులు తర్వాత కోర్టు విచారణలో నిలబడట్లేదు కదా?
 రంగరాజు: జిల్లాలో ఏసీబీ డీఎస్పీగా 2014, సెప్టెంబరు 8వ తేదీన బాధ్యతలు చేపట్టాను. అంతకుముందు కేసుల సంగతి పక్కనబెడితే... నేను మాత్రం పక్కా ఆధారాలతోనే నిందితుడిని కోర్టులో ప్రవేశపెట్టడానికి పూర్తిస్థాయిలో కసరత్తు చేస్తాను. బాధితుడి ఫిర్యాదు ఒక్కటే ఆధారం కాదు. నిందితుడైన ఉద్యోగి నైతిక ప్రవర్తన, విధి నిర్వహణలో వ్యవహారశైలిపైనా మా కోణంలో పరిశీలిస్తాం. అలాగే ఫిర్యాదుదారుడికి పనిచేసిపెట్టడానికి ఆ ఉద్యోగి లంచం డిమాండు చేసే పరిస్థితి ఉందా? లేదా? అనేదీ ఒక్కసారి చూస్తాం. ప్రాసంగిక సాక్ష్యాలను ఆధారంగానే ఆ ఉద్యోగిని రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకుంటాం. అన్ని ఆధారాలతో కోర్టు ముందు నిలబడతాం.
 
 సాక్షి: అవినీతి అధికారులను, సిబ్బందిని పట్టుకున్నప్పుడు మిగతా వారిలో తప్పు చేస్తే దొరికిపోతామన్న భయం కనిపించట్లేదు కదా?
 రంగరాజు: ఏసీబీ జిల్లాలోనే కాదు రాష్ట్రంలో ఏదొక చోట దాడులు చేస్తూనే ఉంది. అక్రమార్కుల గుట్టు రట్టు చేస్తోంది. వారిని చూసి మిగతావారు ఎందుకు అవినీతికి దూరంగా ఉండట్లేదనే సందేహం కలగడం సహజం. కానీ ఇప్పుడు సమాజంలో అవినీతి, ప్రభుత్వ కార్యాలయాల్లో ఆమ్యామ్యాలు సహజమైపోయాయనే వాదనలను కాదనలేం. అయితే అందరూ అవినీతిపరులు కాదు. విధినిర్వహణలో నీతినిజాయతీతో పనిచేసేవారూ ఉన్నారు. కానీ ఉద్యోగం కోసమో, నచ్చినచోట పోస్టింగ్ కోసమో ముడుపులు చెల్లించుకొని వచ్చేవారు కచ్చితంగా ప్రజలను లంచం కోసం వేధిస్తారని చెప్పడంలో సందేహం లేదు. అలాంటివారిపై ఫిర్యాదు వస్తే ఆ కోణంలోనూ నిఘా వేసి ఉంచుతాం. కానీ విచిత్రమేమిటంటే లంచం తీసుకుంటూ దొరికిపోయినా కొంతమందిలో ఎలాంటి పశ్చాత్తాపం కనిపించట్లేదు.
 
 సాక్షి: అవినీతిని పారద్రోలడానికి మీరేమి చేస్తున్నారు? ప్రజల నుంచి ఎలాంటి సహాయం ఆశిస్తున్నారు?
 రంగరాజు: ట్రాప్‌లే కాదు సర్‌ప్రై జ్ విజిట్‌లూ ముమ్మరం చేశాం. ఏసీబీకి వచ్చిన ప్రతి ఫిర్యాదునూ తోసిపుచ్చకుండా క్రాస్‌చెక్ చేసుకొని దాడులు చేస్తున్నాం. మరోవైపు ప్రజల్లో మార్పు రావాలి. నేనెందుకు లంచం ఇవ్వాలి? అని ప్రశ్నించే తత్వం అలవడాలి. జిల్లావాసుల్లో కర్మ సిద్ధాంతం ఎక్కువగా కనిపిస్తుంది. లంచం అడిగినవారి గురించి ఏసీబీకి ఫిర్యాదు చేసేవారు చాలా తక్కువ. ఒకవేళ ఫిర్యాదు చేస్తే ఎక్కువసార్లు ఏసీబీ కార్యాలయానికి వెళ్లిరావాల్సి ఉంటుందని వెనకడుగు వేసేవారూ ఉన్నారు. అందుకే బాధితులకు ఇబ్బంది లేకుండా ఇన్వెస్టిగేషన్ ప్రొసీజర్‌లో మార్పులు చేయడానికి ప్రయత్నిస్తున్నాం. ఏదిఏమైనా ప్రజల్లో చైతన్యం వస్తేనే అవినీతికి అడ్డుకట్ట వేయడం సులువవుతుంది.
 

Advertisement

తప్పక చదవండి

Advertisement