జీతాలు రావు..సెలవుల్లేవు!

ఇబ్బందుల్లో 102 వాహన సిబ్బంది

మూడు నెలలుగా అందని వేతనాలు

రిలీవర్లు లేక మరిన్ని వెతలు

నిన్న.. మొన్నటివరకు 108, 104 వాహనాల సిబ్బంది అనేక ఇబ్బందులు పడ్డారు. ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. ఇదే కోవలోకి తాజాగా 102 వాహన (తల్లీబిడ్డ ఎక్స్‌ప్రెస్‌) సిబ్బంది చేరిపోయారు. టీడీపీ ప్రభుత్వం 2016 జనవరి ఒకటో తేదీ నుంచి ఈ వాహనాలను తెరపైకి తెచ్చినప్పటికీ ఇప్పటికీ విధివిధానాల్లేక సిబ్బంది పడరానిపాట్లు పడుతున్నారు. ఓ ఏజెన్సీకి వీటి నిర్వహణ బాధ్యతలను సర్కార్‌ అప్పగించింది. జీతాల్లేక, రిలీవర్లు ఉండక.. ఆర్థిక, ఆరోగ్యపరమైన సమస్యలను ఎదుర్కొంటున్నారు.

కాశీబుగ్గ: పేరుగొప్ప..ఊరుదిబ్బ చందంగా ఉంది తెలుగుదేశం ప్రభుత్వం తీరు. ఆర్భాటంగా పథకాలను ప్రారంభించి తరువాత వాటి గురించి పట్టించుకోవడం లేదనే విమర్శలున్నాయి. 102 వాహనాల విషయంలో కూడా ఇదే పరిస్థితి. ప్రసవం కోసం ఆస్పత్రికి వచ్చే గర్భిణిని.. డెలివరీ తరువాత తల్లీబిడ్డను ఇంటికి క్షేమంగా తీసుకెళ్లేందుకు 102 వాహనాలను వినియోగిస్తున్నారు. అయితే వీటిలో పని చేస్తున్న సిబ్బందికి నెలల తరబడి వేతనాలు చెల్లించడం లేదు. రోజంతా ఒక్కరే డ్యూటీ చేయాల్సిన పరిస్థితి. కనీసం రిలీవర్‌ను కూడా కేటాయించడం లేదు. పీఎఫ్‌ సౌకర్యం ఉందో..లేదో తెలియక సిబ్బంది ఆందోళన చెందుతున్నారు.  సర్కార్‌ స్పందించి తమ సమస్యలను పరిష్కరించాలని వేడుకుంటున్నారు.

 వాహనాలు కేటాయించిన ఆస్పత్రులు  
శ్రీకాకుళం కేంద్ర ఆస్పత్రికి:4, నరసన్నపేటకు:2, పలాస, కొత్తూరు, టెక్కలి, సొంపేట, పాలకొండ, పాతపట్నం, రాజాం ఆస్పత్రులకు ఒకొక్కటీ.

సమస్యలు పరిష్కారిస్తాం
102 వాహనాలు సక్రమంగానే నడుస్తున్నాయి. గ్రామీణ ప్రాంతాల పేదలకు వరంగా ఉన్నాయి. సిబ్బంది సమస్యలు ఇంతవరకు మా దృష్టికిరాలేదు. జీతాలు ఏజెన్సీలు చెల్లిస్తాయి.అలస్యమైతే వారితో మాట్లాడి జీతాలు అందేలా చూస్తాం. –సనపల తిరుపతిరావు, డీఎంహెచ్‌వో,శ్రీకాకుళం

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top