● జిల్లా అంతటా వర్షం
● ఆరుతడి పంటలసాగుకు సమాయత్తం
● సత్తువ పంటలతో పాటు ఆరుతడి పంటల సాగుకు సన్నద్ధం
● నీటి వసతి ఉన్న రైతులు నారుమడులసాగుకు ఉపక్రమణ
● ఖాజీపేట మండలంలో అత్యధికంగా 94.8 ఎంఎం వర్షం
● అన్నదాతలల్లో చిగురించిన ఆశలు
కడప అగ్రికల్చర్ : ఉపరితల ఆవర్తన ప్రభావంతో వైఎస్సార్ కడప జిల్లావ్యాప్తంగా శనివారం తెల్లవారుజాము నుంచి కురిసిన విస్తారమైన వర్షాలు పల్లెల్లో సరికొత్త ఉత్సాహాన్ని నింపాయి. ఖరీఫ్ సీజన్ ప్రారంభం నుంచే అక్కడక్కడ జల్లులు పడుతున్నప్పటికీ, తాజా భారీ వర్షంతో నేల పూర్తిగా పదును కావడంతో సాగు పనులను ప్రారంభించేందుకు అన్నదాతల్లో సరికొత్త ఆశలు చిగురిస్తున్నాయి.
ఆరుతడి పంటల సాగుకు ఇదే తగిన అదును
జిల్లాలో ప్రస్తుతం వేరుశనగ, కంది, పసుపు, మినుము వంటి ఆరుతడి పంటల సాగుకు ఇదే అత్యంత అనుకూలమైన సమయం (అదును) అని వ్యవసాయ అధికారులు తెలిపారు. రాబోయే రెండు మూడు రోజుల పాటు జిల్లాలో వర్షాలు ఇలాగే కొనసాగే అవకాశం ఉండటంతో చాలా చోట్ల రైతులు ఆరుతడి పంటల సాగు కోసం ఇప్పటికే దుక్కి దున్నడం చేసి సిద్ధమవుతున్నారు. మరోవైపు, ఇప్పటికే క్షేత్రస్థాయిలో సాగులో ఉన్న ఆరుతడి, ఉద్యానవన పంటలకు ఈ వర్షపు నీరు అమృతంలా మారి ఎంతో మేలు చేసింది.
సత్తువ విత్తనాల పంపిణీ ముమ్మరం..
నారుమడుల హడావుడి
జిల్లావ్యాప్తంగా ఇటీవల అధికారులు పంపిణీ చేసిన పచ్చిరొట్ట ఎరువులైన జీలుగలు, జనుములు, పెసల విత్తనాల సరఫరా దాదాపు చివరి దశకు చేరుకుంది. ఈ వర్షపు పదునును ఉపయోగించుకుని రైతులు వీటిని సత్తువ పంట కింద సాగు చేయడానికి సిద్ధమయ్యారు. ఖరీఫ్ ప్రధాన పంట అయిన వేరుశనగ విత్తనాల పంపిణీ కూడా జిల్లాలోని పలు ప్రాంతాలలో ’రైతు భరోసా కేంద్రాల’ ద్వారా ముమ్మరంగా సాగుతోంది. కేసీ కాలువతో పాటు పెన్నా నది పరివాహక ప్రాంతాలైన చెన్నూరు, ఒంటిమిట్ట, చాపా డు, రాజుపాలెం తదితర ఏరియాల్లో సొంత నీటి వసతి (బోర్లు, బావులు) ఉన్న కొంతమంది రైతులు ఇప్పటికే సత్తువ పంటలను సాగు చేసి, నారుమడుల సాగుకు సమాయత్తమవుతున్నారు. ఈ వర్షాలు మరో నాలుగైదు రోజుల పాటు ఇలాగే కొనసాగితే ఈ నదీ పరివాహక ప్రాంతాలలో చాలా మంది రైతులు పెద్ద ఎత్తున నారుమడులు సాగు చేసే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు.
ఖాజీపేట మండలంలో అత్యధిక వర్షపాతం
జిల్లావ్యాప్తంగా దాదాపు అన్ని మండలాల్లోనూ ఓస్తరు నుంచి భారీ వర్షం కురిసింది. అయితే అత్యధికంగా ఖాజీపేట మండలంలో 94.8 మిల్లీమీటర్ల (ఎంఎం) భారీ వర్షపాతం నమోదైనట్లు రెవెన్యూ మరి యు వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు. ఈ భారీ వర్షంతో ఖాజీపేట పరిసర ప్రాంతాల్లోని వాగులు, వంకలు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. తగిన యాజమాన్య పద్ధతులు పాటించి ఖరీఫ్ పంటల సాగును ప్రారంభించాలని ఉద్యాన, వ్యవసాయ శాఖ అధికారులు రైతులకు సూచిస్తున్నారు.


