● రాజంపేట టీడీపీలో భగ్గుమన్న అసమ్మతి
● రణరంగంగా మారిన మంటపంపల్లి
ఒంటిమిట్ట : రాజంపేట నియోజకవర్గ టీడీపీలో అంతర్గత విభేదాలు ఒక్కసారిగా భగ్గుమన్నాయి. నియోజకవర్గ ఇన్‌ఛార్జ్ చమర్తి జగన్ మోహన్ రాజు తీరుపై సొంత పార్టీ సీనియర్ నాయకులే తిరుగుబాటు జెండా ఎగరేశారు. ఒంటిమిట్ట మండల పరిధిలోని మంటపంపల్లిలో ఆదివారం టీడీపీ సీనియర్ నాయకుడు కిరణ్ స్వామి నివాసంలో నియోజకవర్గంలోని 6 మండలాలకు చెందిన ముఖ్య నేతలు అత్యవసర అసమ్మతి సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా సీనియర్ నాయకులు చమర్తి జగన్ మోహన్ రాజుపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు. దశాబ్దాలుగా పార్టీ గెలుపు కోసం, జెండా మోసి కష్టపడిన నిబద్ధత గల నాయకులను, కార్యకర్తలను ఇన్‌ఛార్జ్ పూర్తిగా విస్మరించారని ధ్వజమెత్తారు. నిన్న మొన్న పార్టీలోకి వచ్చిన ఇసుక, మట్టి మాఫియా శక్తులను చమర్తి చేరదీస్తున్నారని.. వారికే కీలక పదవులు కట్టబెడుతూ, వారు చెప్పిందే వేదంగా పాలిస్తున్నారని తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు.
సమావేశం ధ్వంసం.. నేతల బాహాబాహీ పోరు
చమర్తిపై వ్యతిరేక స్వరాలు వినిపిస్తున్న తరుణంలో ఇన్‌ఛార్జ్ వర్గానికి చెందిన జడ్పీటీసీ అద్దలూరు ముద్దుకృష్ణారెడ్డి, మంటపంపల్లి ఎంపీటీసీ సుంకేసుల బాషా, మండల క్లస్టర్ ఇన్‌ఛార్జ్ ఈశ్వరయ్య మరికొంతమంది అనుచరులతో కలిసి అక్కడికి దూసుకొచ్చారు. తమకు సమాచారం లేకుండా ఒంటిమిట్టలో సమావేశం ఎలా నిర్వహిస్తారంటూ సీనియర్ నేతలతో వాదనకు దిగారు. సమావేశాన్ని బలవంతంగా భగ్నం చేసేందుకు ప్రయత్నించడంతో ఇరువర్గాల మధ్య మాట మాట పెరిగి, పరిస్థితి బాహాబాహీ వరకు దారితీసింది. గ్రామంలో ఉద్రిక్త వాతావరణం నెలకొనడంతో సమాచారం అందుకున్న ఒంటిమిట్ట సీఐ వెంకటేశ్వర్లు తన సిబ్బందితో కలిసి తక్షణమే ఘటనా స్థలానికి చేరుకున్నారు. శాంతిభద్రతల పరిరక్షణ దృష్ట్యా అక్కడ ఎలాంటి సమావేశాలు నిర్వహించడానికి వీల్లేదని ఇరువర్గాలకు తేల్చి చెప్పారు. పోలీసుల జోక్యంతో అసమ్మతి నాయకులు తమ సమావేశాన్ని రద్దు చేసుకుని వెనుదిరిగారు.
నాయకత్వ లోపం బయటపడుతుందనే భయం
చమర్తి వర్గీయుల దాడితో సమావేశం రద్దయిన అనంతరం, టీడీపీ సీనియర్ నాయకుడు, కల్లుగీత కార్మిక సంఘం రాష్ట్ర మాజీ డైరెక్టర్ కొమర వెంకట నరసయ్య, ఒంటిమిట్ట నేత కిరణ్ స్వామి సంయుక్తంగా విలేకర్ల సమావేశం నిర్వహించారు. నియోజకవర్గంలో చమర్తి జగన్ మోహన్ రాజు నాయకత్వ లోపం ఎక్కడ బయటపడుతుందోనన్న భయంతోనే తమ సమావేశాన్ని రౌడీయిజంతో భగ్నం చేశారని తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. మండలాలతో అస్సలు సంబంధం లేని చమర్తి అనుచరులను, సొంత కుటుంబ సభ్యులను మండల ఇంచార్జ్‌లుగా నియమించి.. దశాబ్దాలుగా పార్టీని నమ్ముకున్న కరుడుగట్టిన కార్యకర్తలను అవమానిస్తున్నారని మండిపడ్డారు. ఇదే తీరు కొనసాగితే రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో రాజంపేటలో టీడీపీకి భారీ ఎదురుదెబ్బ తగలడం ఖాయమని హెచ్చరించారు. ఇంచార్జ్ పదవి చూసుకుని గర్వంతో ఊగిపోతూ పార్టీ ప్రతిష్టకు మచ్చ తెస్తున్న చమర్తి జగన్ మోహన్ రాజు అక్రమాలపై త్వరలోనే ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు ఆధారాలతో సహా ఫిర్యాదు చేస్తామని నేతలు స్పష్టం చేశారు.


