ఏపీ ఎయిమ్స్‌ యాప్‌ను నిలిపివేయాలి | - | Sakshi
Sakshi News home page

ఏపీ ఎయిమ్స్‌ యాప్‌ను నిలిపివేయాలి

Jun 15 2026 1:17 AM | Updated on Jun 15 2026 1:17 AM

ఏపీ ఎయిమ్స్‌ యాప్‌ను నిలిపివేయాలి దాడి చేసిన వ్యక్తిపై కేసు నమోదు ప్రమాదవశాత్తు గనుల్లో పడి యువకుడు మృతి

కడప కార్పొరేషన్‌: ఏపీ ఎయిమ్స్‌ యాప్‌ ద్వారా రైతాంగానికి సరిపడా ఎరువులను వైఎస్సార్‌ కడప జిల్లాలో పంపిణీ చేయకపోవడంతో రైతుల్లో ఆందోళన, ఆగ్రహం పెల్లుబుకుతోందని వైఎస్సార్‌సీపీ రాష్ట్ర కార్యదర్శి రెడ్యం వెంకట సుబ్బారెడ్డి అన్నారు. ఆదివారం జిల్లా పార్టీ కార్యాలయలలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ తక్షణం యాప్‌ను నిలిపివేయాలని డిమాండ్‌ చేశారు. జిల్లా వ్యాప్తంగా ఖరీఫ్‌ సీజన్‌ కు సంబంధించి అవసరమైన మేరకు యూరియా, డీఏపీ, కాంప్లెక్స్‌ ఎరువులను ప్రభుత్వం సరఫరా చేయలేక చేతులెత్తేసిందని ఎద్దేవా చేశారు. వరి పంటకు సంబంధించి ఒక ఎకరాకు మూడు నుంచి నాలుగు బస్తాలు ఎరువులు అవసరం కాగా ఏపీ ఎయిమ్స్‌ యాప్‌ ద్వారా కేవలం ఒకటి, రెండు బస్తాలు మాత్రమే ఇస్తుండడంతో రైతులకు సరిపోవడం లేదన్నారు. శాస్త్రవేత్తలు సిఫారసు మేరకు ఒక ఎకరాకు 100 నుంచి 110 కేజీల యూరియాను అధిక దిగుబడుల కోసం తప్పనిసరిగా వాడాలని నిబంధనలు ఉండగా,ప్రస్తుత నూతన విధానం ద్వారా కేవలం 60 నుంచి 70 కేజీలు మాత్రమే వ్యవసాయ శాఖ ద్వారా పంపిణీ చేయడం సరికాదన్నారు. జిల్లాలో ప్రస్తుత ఖరీఫ్‌ సీజన్‌ కు సంబంధించి 50,000 మెట్రిక్‌ టన్నుల వివిధ రకాల ఎరువులు అవసరం కాగా కేవలం 15,000 మెట్రిక్‌ టన్నులే అందుబాటులో ఉన్నాయన్నారు. రైతులకు కావాల్సిన ఎరువులు విత్తనాలు అందించకపోతే వైఎస్సార్‌సీపీ ఆధ్వర్యంలో ఆందోళన చేస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో వైఎస్సార్‌ సీపీ జిల్లా ఎస్‌.సి విభాగం అధ్యక్షుడు సింగమాల వెంకటేశ్వర్లు, వైయస్సార్‌సీపీ నాయకులు పి. మహేశ్వర్‌రెడ్డి, ఎం. వెంకట సుబ్బయ్య పాల్గొన్నారు.

కమలాపురం : కమలాపురం జడ్పీటీసీ సభ్యురాలు లింగాల సుమిత్రా భర్త రాజశేఖర్‌ రెడ్డిపై దాడి చేసిన సునీల్‌ అనే యువకుడిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ విద్యాసాగర్‌ తెలిపారు. ఆయన తెలిపిన సమాచారం మేరకు.. శనివారం రాత్రి రాజశేఖర్‌రెడ్డి భోజనం చేశాక వాకింగ్‌ చేస్తుండగా అదే గ్రా మానికి చెందిన ఉప్పర సునీల్‌ కత్తితో పొడిచాడన్నారు. శరీరం వెనుక, ముందు వైపు కూడా దాదాపు 12 చోట్ల పొడిచాడన్నారు. కత్తిపోట్లకు గురైన రాజశేఖర్‌ రెడ్డి కేకలు వేయడంతో నిందితుడు పరారయ్యాడు. క్షతగాత్రుడుని చికిత్స నిమిత్తం ప్రొద్దుటూరు జిల్లా ఆసుపత్రికి తరలించారన్నారు. అక్కడ ప్రథమ చికిత్స అనంతరం మెరుగైన వైద్యం కోసం రాజశేఖర్‌ రెడ్డిని హైదరాబాద్‌కు తరలించినట్లు ఎస్‌ఐ వివరించారు. గ్రామంలో ఈ ఏడాది జనవరి 1న కేక్‌ కట్‌ చేసే నేపథ్యంలో గ్రామంలోని యువకులు ఘర్షణ పడ్డారు. ఆ సమయంలో రాజశేఖర్‌ రెడ్డి వారిని మందలించి ఇంటికి పంపారు. అప్పటి నుంచి రాజశేఖర్‌రెడ్డిపై పగ పెంచుకున్న సునీల్‌ దాడికి పాల్పడి ఉండాడని గ్రామస్థుల ద్వారా తెలిసిందన్నారు. భాధితుడి భార్య సుమిత్రా ఫిర్యాదు మేరకు సునీల్‌పై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామన్నారు. నిందితుని కోసం గాలింపు చర్యలు చేపట్టామని ఎస్‌ఐ తెలిపారు.

జమ్మలమడుగు రూరల్‌ : ప్రమాదవశాత్తు నాపరాయి గనిలో పడి గురుకుమార్‌ (20) అనే యువకుడు మృతి చెందిన సంఘటన జమ్మలమడుగులో చోటు చేసుకుంది. ఎస్‌ఐ హైమావతి వివరాల ప్రకారం.. మైలవరం మండలం దొమ్మరనంద్యాలకు చెందిన భీమునిపాటి గురుకు మతిస్థిమితం సరిగ్గా లేదు. ఈ నేపథ్యంలో గురువారం ఇంటి నుంచి వెళ్లిపోయారు. అతడి తమ్ముడు భీమునిపాటి గురుకుమార్‌ సిమెంట్‌ పని చేసి గురువారం రాత్రి ఇంటికి వచ్చాడు. అన్న గురు రాత్రి అయినా ఇంట్లో లేకపోవడంతో తల్లిదండ్రులను విచారించారు. గురు బయటకు వెళ్లాడని చెప్పడంతో అన్నను వెతుకుతూ బయటకు వెళ్లారు. గంట తరువాత అన్న వచ్చాడు. కానీ అన్న కోసం వెళ్లిన గురుకుమారు రాలేదు. దీంతో తండ్రి పెద్ద గురుస్వామి మైలవరం పోలీస్‌స్టేషన్‌లో శుక్రవారం ఫిర్యాదు చేశారు. పోలీసులు పలు చోట్ల గాలించినా ఆచూకీ లభించలేదు. ఆదివారం జమ్మలమడుగు మండల పరిధిలోని పొన్నతోట నాపరాయి గునుల్లో మృతదేహం ఉన్నట్లు స్థానికులు తెలపడంతో మృతదేహన్ని బయటకు తీసి పరిశీలించారు. మృతుడు గురుకుమార్‌గా గుర్తించారు. తండ్రి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి విచారిస్తున్నట్లు ఎస్‌ఐ తెలిపారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement