కడప అర్బన్: పక్కాగా స్కెచ్ వేసి అక్కుపల్లి వంశీ(26) అనే యువకుడిని అతని యజమానే దారుణంగా హత్య చేశాడనీ పోలీసులకు ప్రాథమికంగా నిర్ధారణ అయినట్లు సమాచారం. కడపలోని రిమ్స్ పీఎస్ పరిధిలో ఈనెల 10న విన్యాస్ అపార్ట్‌మెంట్‌లో నివాసం ఉంటున్న చింతా రామసుబ్బారెడ్డి, తన భార్య మధురవాణితో తమ దగ్గర పనిచేసే డ్రైవర్ వివాహేతర సంబంధం పెట్టుకున్నాడనే అనుమానంతో దారుణంగా హత్య చేశాడు. తరువాత గుట్టు చప్పుడు కాకుండా ప్లాస్టిక్ కవర్‌లో దాచేసి కారులో సోమశిల బ్యాక్ వాటర్స్‌లో మృతదేహాన్ని పడేయాలని భావించి రాజంపేట వైపు వెళ్లాడు. ఒంటిమిట్ట మండలం సాలాబాద్ క్రాస్ రోడ్‌లో రాచపల్లి పంచాయతీ పరిధిలో అటవీప్రాంతంలో పడేశారు. 11వతేదీన వంశీ తండ్రి ఫిర్యాదు మేరకు కడప రిమ్స్ పీఎస్‌లో అదృశ్యం కేసు నమోదు చేశారు.విచారణలో భాగంగా ఫొటోలను జిల్లాలోని పోలీసులకు పంపించారు. సంఘటన స్థలంలో మృతదేహాన్ని స్థానిక ప్రజలు గుర్తించి పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు మృతదేహాన్ని గుర్తించి, వంశీ తండ్రి మునెయ్యను పిలిపించి గుర్తుపట్టాక కడప రిమ్స్ వైద్యబృందం సంఘటన స్థలంలోనే పోస్టుమార్టం నిర్వహించి బంధువులకు అప్పగించారు. తరువాత రామసుబ్బారెడ్డి కోసం ప్రత్యేకంగా పోలీసు బృందం గాలింపుచర్యలు చేపట్టారు. అతన్ని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్లు తెలిసింది. వంశీ ఆరునెలల క్రితమే రామసుబ్బారెడ్డి వద్ద డ్రైవర్ ఉద్యోగం చాలించి ఇంటివద్దనే వుంటున్నాడు. ఇటీవల వంశీని మళ్లీ డ్రైవర్‌గా పిలిపించారు. మరోవైపు రామసుబ్బారెడ్డికి, అతని భార్య మధురవాణితో విభేదాలు ముదిరిపోయాయి. ఇంకోవైపు ఆర్థిక సమస్యలు పెరిగిపోతున్నాయి. ఈక్రమంలోనే వంశీని హత్య చేశాడని సమాచారం. ఈహత్యకు మరో నలుగురు సహకరించి ఉంటారని పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. సమగ్రంగా దర్యాప్తు చేసి త్వరలోనే నిందితులను అరెస్ట్ చేసి చట్టపరమైన చర్యలను తీసుకుంటామనీ కడప రిమ్స్ పీఎస్ సీఐ రాజగోపాల్ తెలియజేశారు.
● భయాందోళనలో ప్రజలు
కడప అర్బన్: కడప నగరంలో మైనర్ డ్రైవింగ్ స్టంట్స్ రోజురోజుకు మితిమీరిపోతున్నాయి. రిమ్స్,శిల్పారామం మార్గంలో ఆదివారం సాయంత్రం ప్రజలను భయబ్రాంతులకు గురి చేస్తూ బైక్ పై స్టంట్స్ చేశారు. జనాలు రద్దీగా ఉన్న ప్రాంతాల్లో కూడా స్టంట్స్ వదలడంలేదు. కొద్ది నెలల క్రితం విమానాశ్రయం సమీపంలో బైక్ పై స్టంట్స్ చేస్తూ రోడ్డు ప్రమాదానికి గురై ఓ యువకుడు మృత్యువాత పడ్డాడు. బైక్ లకు ఎటువంటి నంబర్ ప్లేట్ లేకుండా మైనర్లు డ్రైవింగ్ చేస్తున్నారు.
గాలివీడు : మండల పరిధిలోని నూరివీడు గ్రామం బోడసానివాండ్లపల్లెకు చెందిన మహిళా రైతు కె.సాలమ్మ, బి.శివారెడ్డిలకు చెందిన విద్యుత్ వైర్‌ను శనివారం రాత్రి గుర్తు తెలియని వ్యక్తులు చోరీ చేశారు. ఆదివారం ఉదయం పొలాల వద్దకు వెళ్లి చూడగా వైర్ చోరీకి గురైనట్లు గుర్తించారు. వెంటనే స్థానిక పోలీస్‌స్టేషన్‌లో రైతులు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు గాలివీడు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.


