తొండూరు : తొండూరు మండలంలోని గంగనపల్లె గ్రామంలో వెలసిన గంగమ్మ గుడిలో శనివారం అర్ధరాత్రి గుర్తు తెలియని వ్యక్తులు చోరీకి పాల్పడ్డారు. ఆలయంలోకి చొరబడి హుండీని పగులగొట్టి నగదును అపహరించారు. ఆదివారం ఉదయం అర్చకుడు ఆలయ తలుపులు తీసి చూడగా చోరీ జరిగినట్లు గుర్తించి గ్రామ పెద్దలకు సమాచారం అందించారు. హుండీలో ఎంత నగదు ఉందనే విషయం తెలియరాలేదు. కొన్ని వారాలుగా హుండీ ఆదాయాన్ని లెక్కించలేదు. దీంతో హుండీలో ఎక్కవ మొత్తంలో నగదు ఉంటుందని గ్రామస్థులు పేర్కొంటున్నారు.
ఆలయంలో
వెండి నగలు అపహరణ
ముద్దనూరు : మండలంలోని మంగపట్నం గ్రామంలో వెలసిన శ్రీ అంకాలమ్మ ఆలయంలో అమ్మవారి వెండి ఆభరణాలు చోరీకి గురయ్యాయి. స్థానిక హెడ్‌కానిస్టేబుల్ రమేష్ సమాచారం మేరకు శనివారం రాత్రి దుండగులు ఆలయం తలుపులు పగలగొట్టి వెండి ఆభరణాలు చోరీకి పాల్పడ్డారు. అర్చకుడు మహేశ్వరరావు ఫిర్యాదుతో ఆదివారం కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఆయన తెలిపారు.
లాడ్జీల్లో తనిఖీలు
కడప అర్బన్: జిల్లా వ్యాప్తంగా పోలీసు అధికారులు, సిబ్బంది ఆదివారం లాడ్జీల్లో తనిఖీ చేశారు. ప్రతి గదిని క్షుణ్ణంగా తనిఖీ చేసి, లాడ్జీల్లో బస చేసిన వ్యక్తులను ప్రశ్నిస్తూ వారి వివరాలపై ఆరా తీశారు. రిజిస్టర్ ను పరిశీలించారు. లాడ్జీల్లో అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. అనుమానితులను గుర్తిస్తే వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని, లాడ్జి పరిసరాలు స్పష్టంగా కనిపించేలా సీసీ కెమెరాలు తప్పనిసరిగా ఏర్పాటు చేయాలని నిర్వాహకులకు సూచించారు.


