వంచనపై గర్జన | - | Sakshi
Sakshi News home page

వంచనపై గర్జన

Jun 12 2026 5:39 AM | Updated on Jun 12 2026 5:39 AM

కూటమి మోసపూరిత హామీలపై వైఎస్సార్‌ సీపీ రణభేరి

రెండేళ్లపాలనపై నేడు నిరసన ర్యాలీలు

కడప కార్పొరేషన్‌ : కూటమి ప్రభుత్వ రెండేళ్ల పాలనపై వైఎస్సార్‌సీపీ రణ భేరికి సిద్ధమైంది. ‘చంద్రబాబు వెన్నుపోటుకు రెండేళ్లు’ పేరుతో నేడు అన్ని నియోజకవర్గాల్లో భారీ ఎత్తున నిరసన ర్యాలీలకు శ్రీకారం చుట్టింది. జిల్లాలోని కడప, ప్రొద్దుటూరు, పులివెందుల, రాజంపేట, కమలాపురం, మైదుకూరు, జమ్మలమడుగు, బద్వేల్‌ నియోజకవర్గాల్లో ఆయా నియోజకవర్గాల సమన్వయకర్తలు, ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేల ఆధ్వర్యంలోర్యాలీలు కొనసాగనున్నాయి. 2024 ఎన్నికల్లో కూటమిలో భాగమైన టీడీపీ, జనసేన, బీజేపీలు సూపర్‌ సిక్స్‌ పథకాలు ప్రకటించాయి. రెండేళ్లు పూర్తయినా వాటిని సక్రమంగా అమలు చేయలేదని, ప్రధానమైన నిరుద్యోగ భృతి, ఆడబిడ్డ నిధి వంటి వాటిని విస్మరించారని ప్రజలు మండిపడుతున్నారు. కాగా కూటమి ప్రభుత్వం కొలువుదీరినప్పటి నుంచి అనేక స్కామ్‌లతో ముందుకు వెళుతుండడం, సంక్షేమ పథకాలను ప్రజలకు అందించడంలో విఫలం కావడం, ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలు అమలు చేయకుండా మోసం చేస్తున్న వైనంపై వైఎస్సార్‌ సీపీ శ్రేణులు రణభేరి మోగిస్తున్నారు. ఇందులో భాగంగా ఈనెల 4వ తేదిన ఎక్కడికక్కడ టీడీపీ మ్యానిఫెస్టో ప్రతులను ప్రధాన కూడళ్లలో దహనం చేసి నిరసన తెలియజేశారు. అనంతరం 8,9 తేదీలలో నియోజకవర్గాల్లో సదస్సులు నిర్వహించి ప్రభుత్వం ఎలా మోసం చేస్తుందో వివరించారు. శుక్రవారం జిల్లాలోని అన్ని నియోజకవర్గాల్లో భారీ ర్యాలీలు నిర్వహించి ఆర్‌డీఓలు, తహసీల్దార్లకు వినతిపత్రాలు అందజేయనున్నారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement